Skip to content
జాతీయం వార్తలు

‘ఆత్మనిర్భర్‌’ ఎవరి కోసం?

Prajapaksham 08 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
‘ఆత్మనిర్భర్‌’ ఎవరి కోసం?

For whom is ‘Atmanirbhar’?

ఎం.ఏ. బేబీ, సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి

బకాయిలు ఏకంగా రూ.22,006.57 కోట్లు. పరిష్కారం కోసం చెల్లించాల్సిన మొత్తం కేవలం రూ.6.25 కోట్లు. అంటే వంద రూపాయల అప్పుకు మూడు పైసల చెల్లింపు మాత్రమే. ఎస్సెల్‌ గ్రూప్‌, ‘జీ’ సంస్థల వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్రకు సంబంధించిన రుణ పరిష్కారంపై 2026 ఆగస్టు 25న నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌టి) ఆమోదించిన ప్రణాళిక ఈ సంఖ్యలతోనే ఒక తీవ్రమైన ప్రశ్నను ముందుకు తెస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రణాళికను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, దేశంలో పెద్ద కార్పొరేట్‌ రుణగ్రహీతలకు దివాలా చట్టం నిజంగా బాధ్యతను నిర్ధారించే సాధనమా, లేక అప్పుల భారాన్ని ప్రజలపైకి మళ్లించే మార్గమా? అనే ప్రశ్న మాత్రం ప్రజాస్వామిక వాదులందరినీ వేధిస్తున్నది. సుభాష్‌ చంద్ర కేసులో చూపిన పరిష్కారంలో దాదాపు 99.97 శాతం ‘హెయిర్‌ కట్‌’ ఏర్పడింది. అంటే రుణదాతలు తమ క్లెయిమ్‌లో దాదాపు మొత్తం వదులుకోవాల్సి వచ్చింది. ఈ రుణదాతల్లో సాధారణ ప్రజల పొదుపులు, ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థల నిధులతో పనిచేసే సంస్థలు ఉన్నాయి. ఎల్‌ఐసి హౌసింగ్‌ ఫైనాన్స్‌కు ఉన్న రూ.1,322 కోట్ల క్లెయిమ్‌ చివరకు రూ.38 లక్షలకు తగ్గింది. కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ వంటి సంస్థలు కూడా ఈ పరిష్కార ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒక వ్యక్తి లేదా ఒక కంపెనీ గురించి కాదు… పెద్ద మొత్తంలో అప్పులు తీసుకు న్న కార్పొరేట్‌ సంస్థలు విఫలమైనప్పుడు దాని ఖర్చును చివరికి ఎవరు భరిస్తారన్నదే అసలు ప్రశ్న. సుభాష్‌ చంద్ర సంపద 2017 రూ.40,000 కోట్ల మధ్య ఉందని అంచనా. దివాలా ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి అది రూ.31.79 కోట్లకు తగ్గింది. ఆస్తుల విలువలో ఇంతటి భారీ వ్యత్యాసం ఎలా ఏర్పడిందన్న దానిపై పూర్తి ఆస్తి-వారీ లెక్కలు ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రుణదాతల్లో 80.81శాతం మంది ఆమోదించడంతో పరిష్కార ప్రణాళికకు మార్గం సుగమమైంది. కొన్ని ప్రధాన రుణదాతలు వ్యతిరేకించినప్పటికీ అది ఆమోదం పొందింది. 2016లో అమల్లోకి వచ్చిన దివాలా, రుణ పరిష్కా ర చట్టం (ఐబిసి) వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి ప్రమోటర్లు కంపెనీల వైఫల్యానికి బాధ్యత వహించేలా చేయడం. అయితే పెద్ద సంస్థల రుణ పరిష్కారాల్లో భారీ ‘హెయిర్‌ కట్లు’ సర్వ సాధారణమైతే, చట్టం అసలు లక్ష్యంపై ప్రశ్నలు రావడం సహజం. ఒక పెద్ద రుణగ్రహీతకు వేల కోట్ల అప్పు మాఫీ అవుతుంటే, చిన్న రుణగ్రహీత మాత్రం కొన్ని వేల రూపాయల అప్పు కోసం ఆస్తి కోల్పోయే పరిస్థితిని ఎదుర్కోవడం వ్యవస్థలోని అసమానతను స్పష్టంగా చూపుతుంది.
పన్ను రాయితీలు ఎవరికి?
కార్పొరేట్‌ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలపై కూడా ఇదే ప్రశ్న వర్తిస్తుంది. 2019లో ప్రాథమిక కార్పొరేట్‌ పన్ను రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. కొత్త తయారీ సంస్థలకు 15 శాతం రేటును నిర్ణయించారు. దీనివల్ల తొలి ఏడాదిలోనే ప్రభుత్వ ఆదాయానికి రూ.1.45 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని అంచనాలు ఉన్నాయి. బాంబే స్టాక్‌ ఎక్ఛేంజ్‌ (బిఎస్‌ఇ) 500 కంపెనీల వాస్తవ పన్ను రేటు 30 శాతానికి పైగా ఉండగా, 2023- నాటికి అది 21.2 శాతానికి పడిపోయింది. ఐదేళ్లలో కంపెనీలకు రూ.3.14 లక్షల కోట్ల మేర ప్రయోజనం లభించింది. పన్ను మినహాయింపులు, ప్రభుత్వానికి రాకుం డా పోయిన ఆదాయాన్ని కలిపితే పదేళ్లలో ఈ మొత్తం రూ.8.22 లక్షల కోట్లకు చేరుతుంది. కానీ, ఈ భారీ ప్రోత్సాహకాలతో తయారీ రంగం ఆశించిన స్థాయిలో విస్తరించిందా? స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో తయారీ రంగం వాటా 2010లో సుమారు 17 శాతం ఉండగా, 2023 నాటికి దాదాపు 13 శాతానికి తగ్గిందని వ్యాసం చెబుతోంది. కంపెనీలు అదనంగా వచ్చిన నిధులను అప్పుల చెల్లింపులు, షేర్ల బైబ్యాక్లు, డివిడెండ్ల రూపంలో ఉపయోగించుకున్నాయని రచయిత అభిప్రాయపడుతున్నారు. కాగా, ప్రభుత్వ ఆదాయంలో ఏర్పడే లోటును పరోక్ష పన్నుల ద్వారా భర్తీ చేయాల్సి రావణం ఇందులోని మరో కోణం. అందులో జిఎస్‌టి ప్రధానమైనది. పన్ను భారాన్ని భరించే సామర్థ్యం తక్కువగా ఉన్న ప్రజలపై పరోక్ష పన్నుల భారం ఎక్కువగా పడుతుందన్న విమర్శకు ఈ పరిణామా లు బలం చేకూరుస్తాయి. ఖనిజ వనరుల విషయంలోనూ కేంద్ర సంబంధాలపై ఇదే చర్చ మొదలవుతోంది. 2024 జులైలో తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఖనిజ హక్కులపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ చట్టంలో ‘సెక్షన్‌ 9 డి’ ద్వారా రాష్ట్రాల అధికారాన్ని పరిమితం చేసింది. అదే సమయంలో ‘ఖనిజాలు ఉన్న భూమి’ పరిధిని విస్తరించడం ద్వారా ఆదివాసీ ప్రాంతాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఏర్పడింది. పునరావాసం, పరిహారం వంటి అంశాలను పక్కనపెట్టి సహజ వనరుల వినియోగాన్ని వేగవంతం చేయడం అభివృద్ధి విధానమా, లేక వనరుల బదలాయింపా అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. టాటా స్టీల్‌, వేదాంత వంటి సంస్థలకు సంబంధించి న రూ.1.52లక్షల కోట్ల ఖనిజ బకాయిలను వెనక్కి వర్తించే నిబంధనతో రద్దు చేశారని విజిల్‌ బ్లోయర్లు ఆరోపించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. ఈ ఆరోపణలపై పారదర్శకమైన వివరణ అవసరం. ఎందుకంటే జార్ఖండ్‌, ఒడిశా వంటి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్లో ఖనిజ ఆదాయానికి కీలక స్థానం ఉంది.
ఇలావుంటే, బ్యాంకుల రుణాల విషయంలో అసమానత పలు కేసు ల్లో మరింత స్పష్టంగా కనిపిస్తోంది. గత పన్నెండేళ్లలో పెద్ద వ్యాపార సంస్థలకు సంబంధించిన రూ.9.95లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు రద్దు చేశాయన్నది తెలిసిన విషయమే. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన సమాధానం ప్రకారం, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చిన్న రుణగ్రహీతలకు రద్దు చేసిన రుణాల్లో 74 శాతం తిరిగి రాబట్టగా, పెద్ద రుణగ్రహీతల నుంచి కేవలం 15 శాతం మాత్రమే రాబట్టింది. ఈ వ్యత్యాసం కేవలం ఆర్థిక గణాంకం కాదు. ఇది వ్యవస్థలో అధికార సంబంధాలను ప్రతిబింబిస్తుంది. చిన్న రైతు లేదా చిరు వ్యాపారి రుణం చెల్లించలేకపోతే రికవరీ ఏజెంట్లు, రెవెన్యూ అధికారులు అతని తలుపు తడతారు. పెద్ద కార్పొరేట్‌ రుణగ్రహీత విషయంలో మాత్రం న్యాయపరమైన పునర్వ్యవస్థీకరణ, దివాలా పరిష్కారం, ‘హెయిర్‌ కట్‌’ వంటి ప్రక్రియలు అందుబాటులో ఉంటాయి. 2024 నవంబరులో నాగపూర్‌ రైతు రవీంద్ర అలోన్‌ తన ట్రాక్టర్‌ను ఫైనాన్స్‌ సంస్థ స్వాధీనం చేసుకున్న కొద్ది గంటలకే ఆత్మహత్య చేసుకున్నాడన్న చేదు నిజాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాలి. ఈ ఏడాది జూన్‌ మాసంలో, నాందేడ్‌కు చెందిన గుణాజీ పవార్‌ అప్పుల బాధతో విషం తీసుకున్న ఘటనను మరచిపోకూడదు. ఎన్‌సిఆర్‌బి గణాంకాల ప్రకారం 2024లో రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 10,546గా నమోదయ్యాయి. ఒకవైపు రూ.22,000 కోట్ల రుణం రూ.6.25కోట్లకు పరిష్కారమవుతుంది. మరోవైపు కొన్ని వేల రూపాయల అప్పు కూడా ఒక రైతు జీవితాన్ని సంక్షోభంలోకి నెడుతుంది. ఈ రెండు వాస్తవాలను ఒకే ఆర్థిక వ్యవస్థలో ఎలా సమర్థించాలి? ఐబిసికి సంస్కరణ లు అవసరమా? పెద్ద రుణ ఎగవేతదారులకు మరింత కఠినమైన బాధ్యత ను నిర్ధారించాలా? చిన్న రుణగ్రహీతలకు రక్షణ కల్పించాలా? అనే చర్చ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి.
గ్రామీణ ఉపాధి విషయంలో కూడా విధాన ప్రాధాన్యతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ స్థానంలో వచ్చిన విబిజి రామ్‌జి చట్టం వచ్చిన నేపథ్యంలో, ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య 2025 జులైలో 1.42 కోట్ల నుంచి 2026 జులైలో 68.9 లక్షలకు పడిపోయింది. వ్యవసాయ విరామ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే విధానం వల్లే ఈ తగ్గుదల ఏర్పడుతోందనేది బహిరంగ రహస్యం. అదే సమయంలో కార్పొరేట్‌ రంగానికి భారీ ప్రోత్సాహక పథకాలు కొనసాగుతున్నాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలకు రూ.1.97 లక్షల కోట్లు, ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాలకు రూ.1.07 లక్షల కోట్లు, సెమీకండక్టర్‌ మిషన్‌కు రూ.1.27లక్షల కోట్లు, మొబైల్‌ ఫోన్‌ తయారీకి రూ.62,500 కోట్లు కేటాయించారు. ఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్స్‌ తయారీ పథకం కేటాయింపు ను రూ.40,000 కోట్లకు పెంచారు. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం కింద కోటి ఇంటర్న్‌షిప్‌ల లక్ష్యాన్ని నిర్దేశించగా, 2026 జనవరి నాటికి పూర్తయినవి కేవలం 3,417మాత్రమే. యువత, నిరుద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వ ప్రదర్శిస్తున్న ఉదాశీన వైఖరికి ఇది నిదర్శనం. పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ఆర్థిక విధానంలో అసాధారణం కాదు. సమస్య వాటి ఫలితాలను కొలిచే విధానంలో ఉంది. ఎన్ని రూపాయల సబ్సిడీ ఇచ్చారు అన్నదానికంటే, దానికి ప్రతిగా ఎన్ని శాశ్వత ఉద్యోగాలు వచ్చా యి? ఎంత ఉత్పత్తి పెరిగింది? ఎంత పన్ను ఆదాయం వచ్చింది? ఎంత సాంకేతిక సామర్థ్యం ఏర్పడింది? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలి.
ఇదే సమయంలో విద్యార్థులు, యువతలో అసంతృప్తి పెరుగుతోన్న విషయాన్ని గమనించాలి. జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసనలను ప్రస్తావించుకోవాలి. ఈ ఏడాది ఆగస్టు 15న ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని ‘దిమాగినక్సల్‌’ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ వర్గాలను గుర్తించి ఒంటరిచేయాలన్న ఉద్దేశంతోనే ప్రధాని ఈ పిలుపు నిచ్చారనడం లో అనుమానం లేదు. తర్వాత ఆర్గనైజర్‌లో వచ్చిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించాలి. తుపాకులు పట్టుకోకుండా ప్రముఖ చరిత్రకారులు, మేధావులు వంటి గుర్తింపులతో పనిచేసేవారిని కూడా ఈ వర్గంలో చేర్చారన్న వాస్తవాన్ని గుర్తించాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఆర్థిక విధానాల ను ప్రశ్నించే మేధావులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, పౌర సమాజ సంస్థలకు స్థానం ఉండాలి. ప్రభుత్వానికి వ్యతిరేకమైన అభిప్రాయాన్ని
‘శతృత్వం’గా నిర్వచించడం ప్రజాస్వామ్యచర్చ పరిధిని కుదించే ప్రమాదం కలిగిస్తుంది.
ఈ మొత్తం పరిణామాలను కలిపి చూస్తే, కార్పొరేట్‌ సంస్థలకు పన్ను రాయితీలు, పెద్ద రుణాలకు భారీ హెయిర్‌ కట్లు, ఖనిజ బకాయిల రద్దు, పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ఒకవైపు, గ్రామీణ ఉపాధి తగ్గుదల, చిన్న రుణగ్రహీతలపై ఒత్తిడి, పరోక్ష పన్నుల భారం మరోవైపు కేంద్ర ప్రభుత్వ విధానాలను స్పష్టం చేస్తున్నాయి. వీటిని ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’గా పిలవడం లో అర్థం లేదు. ప్రజల పొదుపులు, ప్రభుత్వ ఆదాయం, సహజ వనరులను ప్రైవేటుసంపదగా మార్చే ప్రక్రియగానే తాజా పరిణామాలను చూడాల్సి ఉంటుంది. లాభాలు ప్రైవేటుకు, నష్టాలు సమాజానికి అనే విధానం చివరికి అసమానతను మరింత పెంచుతుంది. ప్రతిపక్ష పార్టీలు, మేధావులు, యువత విసురుతున్న ఈ ప్రశ్నలు, చేస్తున్న వాదనలతో ఏకీభవించాలా, విభేదించాలా అన్నది వేరే విషయం. కానీ, ప్రజాధనంతో నడిచే బ్యాంకు లు వేల కోట్ల రూపాయల రుణాలను వదులుకుంటే, దాని తుది భారం ఎవరు మోస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనేది వాస్తవం. పన్ను రాయితీలతో కంపెనీలకు లభించే ప్రయోజనాలకు ప్రతిగా దేశానికి ఎంత ఉపాధి, ఉత్పత్తి, పెట్టుబడి లభించిందో లెక్క చెప్పాలి. సహజ వనరుల వినియోగం ద్వారా రాష్ట్రాలకు, స్థానిక ప్రజలకు ఎంత ప్రయోజనం చేకూరిందో వెల్లడించాలి. అప్పు తీసుకున్న చిన్న రైతు కు ఒక న్యాయం, వేల కోట్ల అప్పు తీసుకున్న కార్పొరేట్‌ సంస్థకు మరో న్యాయం ఉంటే, ఆర్థిక వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. దివాలా చట్టం రుణగ్రహీతను కాపాడటానికా, రుణదాతను కాపాడటాని కా, లేక ప్రజా ప్రయోజనాన్ని కాపాడటానికా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఆత్మనిర్భరత అంటే ప్రజలపై భారం మోపడం కాదు. ప్రజా సంపదను కాపాడటం, బాధ్యతను నిర్ధారించడం, చిన్న రుణగ్రహీతను రక్షించడం, పెద్ద రుణ ఎగవేతదారుడికి జవాబుదారీతనం విధించడం, ఉపాధిని సృష్టించడం, సహజ వనరులపై ప్రజా హక్కును కాపాడటం. ఆ ప్రమాణాలతోనే ఏ ఆర్థిక విధానాన్నయినా అంచనా వేయాలి.
(ఐపిఎ సర్వీసెస్‌)