Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

Vijayasai Reddy: సీఎం పదవి నాకొద్దు.. బాల్‌థాకరేలా మెంటర్‌గా ఉంటా.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన.. వీడియో ఇదిగో..

jagan 07 Sep 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Vijayasai Reddy: సీఎం పదవి నాకొద్దు.. బాల్‌థాకరేలా మెంటర్‌గా ఉంటా.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన.. వీడియో ఇదిగో..

Vijayasai Reddy

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీకి తెరలేపుతున్నట్లు మాజీ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో తన రాజకీయ భవిష్యత్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మూడో ప్రత్యామ్నాయం అవసరమని.. అందుకే కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. పార్టీ జెండా, ఎజెండాను ప్రకటించే ముందు.. రాష్ట్ర ప్రజలకు తమ పార్టీ ఎందుకు అవసరమో వివరిస్తామని చెప్పారు.

తన కొత్త పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని తాను చేపట్టబోనని విజయసాయిరెడ్డి స్పష్టం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాకరే తరహాలో తాను మెంటర్ పాత్రలో ఉంటానని, ప్రభుత్వానికి వెనుక నుంచి దిశానిర్దేశం చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి తగిన సమర్థుడైన నాయకుడిని ఎంపిక చేసి ఆ పదవిలో కూర్చోబెడతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి కొన్ని సామాజిక వర్గాలకే పరిమితం కావాల్సిన అవసరం లేదని, అన్ని వర్గాల్లోనూ సమర్థులైన నాయకులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు ప్రధాన పార్టీల చుట్టూనే తిరుగుతున్నాయని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆయా పార్టీలు ఫ్యాక్షన్ తరహా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి ప్రధానంగా రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకే పరిమితమవుతున్న పరిస్థితిపై ఆయన ప్రశ్నలు సంధించారు. బీసీలతో పాటు ఇతర సామాజిక వర్గాలకు కూడా రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యత లభించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

తమ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. పార్టీలో 66 శాతం ప్రాధాన్యత యువతకే ఇచ్చేలా వ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే తమ విధానమని స్పష్టం చేశారు. కుటుంబ రాజకీయాలకు కూడా తాము దూరంగా ఉంటామని చెబుతూ.. తాను అధికారంలోకి వచ్చినా తన కుటుంబ సభ్యులు ఎవరూ పదవుల్లో ఉండరని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురావడం, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంపై పెరుగుతున్న రుణభారం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సమయంలో సుమారు రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్న అప్పులు, ఆ తర్వాతి సంవత్సరాల్లో భారీగా పెరిగి రూ.12 లక్షల కోట్లకు చేరాయని ఆయన పేర్కొన్నారు. ఇంత భారీగా అప్పులు ఎందుకు పెరిగాయి, ఆ నిధులు ఎక్కడ ఖర్చయ్యాయనే అంశంపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు.

సామాన్య ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడం కూడా తమ పార్టీ లక్ష్యమని విజయసాయిరెడ్డి చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, ఇళ్ల అద్దెలు వంటి అంశాలు సామాన్య కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. వీటిని నియంత్రించే విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధితో పాటు ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించడం తమ రాజకీయ లక్ష్యాల్లో భాగమని చెప్పారు.

రాజధాని అంశంపైనా విజయసాయిరెడ్డి తన వైఖరిని స్పష్టం చేశారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా అంగీకరించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయినా రాష్ట్ర రాజధానిగా అమరావతిని అంగీకరించాల్సిందేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి రాజధాని విషయంలో స్పష్టత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

కొత్త పార్టీని ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం చేస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అయితే పార్టీ నిర్మాణం, సిద్ధాంతం, భవిష్యత్ కార్యాచరణపై పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పార్టీ అధికారంలోకి వస్తే తాను సీఎం అభ్యర్థిగా ఉండకుండా.. సమర్థుడైన మరో నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి, తాను మెంటర్‌గా వ్యవహరిస్తానన్న ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. పార్టీ ఇంకా పూర్తిస్థాయిలో ఏర్పాటుకాకముందే ముఖ్యమంత్రి ఎంపికపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ వ్యూహంపై ఆసక్తిని మరింత పెంచాయి. కొత్త పార్టీ ఎంతవరకు ప్రజాదరణ పొందుతుంది, రాష్ట్ర రాజకీయాల్లో అది నిజంగా మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.