Skip to content
ఎడిట్ పేజి వార్తలు

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు

Prajapaksham 08 Sep 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు

Telangana Assembly Speaker Video

శాసన సభాపతి స్థానాన్ని ఉద్దేశించి బిఆర్‌ఎస్‌ శాసనమండలి సభ్యు లు తాతా మధు నోటి వెంట వచ్చిన నిందాపూర్వక వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురి చేశాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశం ఆరంభం రోజున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ముద్రించిన నల్ల టీషర్టులు ధరించిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ ప్రాంగణంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించారు. సభలో ప్లకార్టు ప్రదర్శనపై నిషేధమున్న నేపథ్యంలో నినాదాలున్న టీషర్టులపై అభ్యంతర పెడుతూ పోలీసులు వారిని బైటే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగిన సమయంలో& పోలీసు లపై ఎమ్మెల్సీ తాతా మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నోటి నుంచి వెలువడిన ‘నిన్ను ఆపమని చెప్పాడా స్పీకర్‌ గా..?’అంటూ ఏకవచనంతో కూడిన అనుచిత, అసభ్య వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌, సోషల్‌ మీడియా, మీడియాలో విస్తృతంగా వైరలైంది. ఎమ్మెల్సీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురిచేశాయి.
భారత ప్రథమ ప్రధాన మంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ నాడు లోక్‌సభ స్పీకర్‌ పదవి గురించి ప్రస్తావిస్తూ ‘స్పీకర్‌ సభకు ప్రాతినిధ్యం వహిస్తారు. సభ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి, స్పీకర్‌ సభ గౌరవాని కి, స్వేచ్ఛకు కూడా ప్రతీకగా నిలుస్తారు’ అని విశదీకరించారు. ఒక్క మాట లో చెప్పాలంటే కుటుంబానికి పెద్ద ఎలాగో, శాసనసభకు స్పీకర్‌ ఆ విధంగా ఉంటారు. అలాంటి స్పీకర్‌ వ్యవస్థ ప్రతిష్టను పరిరక్షించాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సభ్యుడిపై ఉంటుంది. గత దశాబ్దకాలంగా ప్రతిపక్ష పార్టీల నుంచి చట్టసభ సభ్యుల ఫిరాయింపులపై ఆయా సభాపతులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ, ప్రతిపక్షాలు ఆ అంశంపై సభాపతిపై విమర్శలు
చేయటమో లేదా న్యాయస్థానాలను ఆశ్రయించటం, ఇతర అవకాశాలన్నీ వినియోగించుకోవటానికే పరిమితమయ్యాయి. కానీ, నేటి ఘటన ఆ హద్దులను, పరిమితులను చెరిపివేసింది. తొందరపాటో, లేదా ఆవేశమో కారణమేదైనప్పటికీ స్పీకర్‌పై ప్రయోగించిన భాష శాసనసభ గౌరవానికి భంగం కలిగించటమే అవుతుంది.
ప్రస్తుత స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ సీనియర్‌ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా పని చేసిన పలువురు ఉద్దండులు అధికార సభ్యులను ఉద్దేశించి కూడా కఠినంగా మాట్లాడేవారు. కానీ, ప్రసాద్‌ బాబు మాత్రం మృధుభాషి. శాసనసభ చర్చల సమయంలో ప్రధాన ప్రతిపక్షానికి అడిగినప్పుడల్లా మైక్‌, ఎక్కువ సమయం ఇవ్వటం పట్ల అప్పుడప్పుడు ట్రెజరీ బెంచ్‌ సభ్యుల నుంచే అసంతృప్తి స్వరాలు వినిపిస్తుంటాయి. అలాంటి స్పీకర్‌ను ఉద్దేశించి సభ వెలుపల ప్రతిపక్ష ఎమ్మెల్సీ అగౌరవంగా మాట్లాడడం అన్ని పక్షాల సభ్యులను ఆశ్చర్యం కలిగింది. అందుకే శాసనసభ వెంటనే తీవ్రంగా స్పందించింది. అనంతరం సమావేశమైన శాసనసభలో సభ్యులంతా స్పీకర్‌ స్థానంపై అభ్యంతరకర వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించారు. ఆయన దళిత వర్గం నుంచి వచ్చినప్పటికీ, అంతకుమించి స్పీకర్‌ స్థానానికి జరిగిన అవమానంగానే సభకు హాజరైన సభ్యులు చూశారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్ష నేత కెసిఆర్‌ క్షమాపణ చెప్పాలని, ఆ ఎమ్మెల్సీతో రాజీనామా చేయించాలని లేదంటే తక్షణమే ఆ సభ్యుడిని బర్తరఫ్‌ చేయాలని మండలి చైర్మన్‌ను కోరతామనే ప్రతిపాదన సభ ముందుంచారు. దీనికి సభలో బిజెపి, ఎంఐఎం పక్షాల నుంచి కూడా ఏకగ్రీవ మద్దతు వ్యక్తమైంది.
సభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆలోచించదగినవి. చట్టసభలో జరిగే చర్చల్లో వాడే భాష, ప్రజా వేదికలపై ప్రయోగిస్తున్న భాషపై సభల్లో చర్చ పెట్టి, స్వయం నియంత్రణ చేసే విధానాన్ని పెట్టుకోవాలనే మంచి సూచనను తెలంగాణ సమాజానికి, భారతదేశానికి ఒక మంచి సంకేతమివ్వాలని అనుకున్నామన్నారు.
ఇటీవల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వాడుతున్న భాష స్థాయి దిగిజారిపోతోంది. వీటికి ఆయా పార్టీల సోషల్‌ మీడియా బృందాలు అగ్నికి ఆజ్యం పోసేలా మరింత జుగుప్సాకర రీతిలో వ్యక్తిగత హననానికి పాల్పడే వ్యాఖ్యలు, మార్ఫింగ్‌ ఫోటోలు, వీడియోలను ప్రచారంలో పెడుతున్నాయి. ఇటీవల శృతిమించి వైరి పార్టీలు ఒక నేతకు పిండప్రదానం చేసినట్లు, మరో నేత అర్థనగ్నం చిత్రాన్ని ఊరేగించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇవి తాత్కాలికంగా వారి పార్టీల నేతలకు, కార్యకర్తలకు సంబరం కలిగించవచ్చునేమో కానీ, మొత్తం రాజకీయ వ్యవస్థ గౌరవమే మంటగలుస్తున్న విషయాన్ని గ్రహించాలి. ఇప్పటికైనా మేలుకొని సరిచేసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా చట్టసభ సభ్యుల భుజాలపైన ఉంది.