అనుకరణలో పుట్టే సాహిత్య సృజనాత్మకత ‘పేరడీ’
Politics Parody
సాహిత్యంలో ప్రతి ప్రక్రియకు తనదైన స్వరూపం ఉంటుంది. కొన్ని ప్రక్రియలు జీవితాన్ని యథాతథంగా చిత్రిస్తే, మరికొన్ని సమాజాన్ని ప్రశ్నిస్తాయి. ఇం కొన్ని నవ్వుల వెనుక గంభీరమైన విమర్శను దాచుకుంటాయి. అలాంటి విశిష్ట ప్రక్రియల్లో పేరడీ ఒకటి. సాధారణంగా పేరడీ అంటే హాస్యం కోసం చేసిన అనుకరణ అనే అభిప్రాయం ఉంది. కానీ సాహిత్య దృష్టిలో పేరడీ అంతకంటే విస్తృతమైన భావన. అది ఒక రచయిత శైలి ని, ఒక ప్రసిద్ధ రచనను లేదా ఒక సాహిత్య ప్రక్రియను అనుకరిస్తూ, అందులోని లక్షణాలను ఉద్దేశపూర్వకంగా అతిశయోక్తితో చూపించే సృజనాత్మక ప్రక్రియ. ఆ అతిశయోక్తి పాఠకుడిలో నవ్వును పుట్టించడమే కాదు, అసలు రచనను కొత్త కోణంలో ఆలోచించేలా చేస్తుంది. పేరడీ విజయవంతం కావాలంటే రచయితకు మూల రచనపై లోతైన అవగాహన అవసరం. ఒక రచనలోని భాష, శైలి, వాక్య నిర్మాణం, పాత్రల స్వభావం, కథన పద్ధతి, భావవ్యక్తీకరణ వంటి అంశాలను క్షుణ్ణంగా గ్రహించినప్పుడే వాటిని కళాత్మకంగా పునర్నిర్మించడం సాధ్యమవుతుం ది. అందుకే పేరడీని కేవలం హాస్య రచనగా కాకుండా, విమర్శనాత్మక పునఃసృష్టిగా కూడా పరిగణిస్తారు. మంచి పేరడీ మూల రచనను తక్కువ చేయదు. అందుకు భి న్నంగా, దాని ప్రత్యేకతను మరింత స్పష్టంగా కనిపించే లా చేస్తుంది. పేరడీలో అనుకరణ ప్రధాన లక్షణం. అ యితే అది యాంత్రికమైన అనుకరణ కాదు. అసలు రచనలోని శైలి, పదప్రయోగం, లయ, కథన నిర్మాణం వం టి లక్షణాలను నిలుపుకుంటూనే వాటిని కొద్దిగా విస్తరిం చి, కొన్నిసార్లు అతిశయోక్తిగా మలుస్తుంది. ఈ అతిశయోక్తే పేరడీకి హాస్యాన్ని అందిస్తుంది. ఒక రచయిత తరచూ ఉపయోగించే అలంకారాలు, భావోద్వేగాల తీవ్రత, లేదా ఒక ప్రక్రియలో పదేపదే కనిపించే మూసలను విస్తరించి చూపించడం ద్వారా పేరడీ తన లక్ష్యాన్ని సాధిస్తుంది. అయితే పేరడీ లక్ష్యం ఎప్పుడూ ఎగతాళి చేయడమే కాదని గుర్తించాలి. ఎందుకుంటే, అది కొన్నిసార్లు గౌరవప్రదమైన నివాళిగా కూడా నిలుస్తుంది. ఒక గొప్ప రచయిత ప్రభావం ఎంత బలంగా ఉందో తెలియజేయడానికి కూడా పేరడీ ఉపయోగపడుతుంది. అదే స మయంలో ఏదైనా సాహిత్య ప్రక్రియలో ఏర్పడిన అతిశయాలు, కృత్రిమత, పునరుక్తి, మూస ధోరణులను వెలుగులోకి తీసుకురావడానికి కూడా ఇది సమర్థమైన సాధనంగా పనిచేస్తుంది. అందువల్ల పేరడీని సాహిత్య విమర్శకు, సృజనాత్మకతకు మధ్య నిలిచే ప్రక్రియగా చెప్పవ ప్రపంచ సాహిత్యంలో పేరడీకి చిరస్థాయి గుర్తింపు తెచ్చిన రచనల్లో జేన్ ఆస్టిన్ రాసిన ‘నార్త్యాంగర్ ఎబ్బే’ ఒకటి. ఆ కాలంలో విపరీత ఆదరణ పొందిన గోతిక్ నవలల్లో కనిపించే రహస్యాలు, భయానక వాతావరణం, అ సంభవ సంఘటనలు, అతిగా నాటకీయతను ఆమె చమత్కారంగా పునర్నిర్మించింది. గోతిక్ సంప్రదాయాన్ని పూర్తిగా తిరస్కరించకుండా, అందులోని అతిశయాలను హాస్యంతో చూపించడం ద్వారా ఆ ప్రక్రియపై విమర్శనాత్మక దృష్టిని ఏర్పరిచింది. అలెగ్జాండర్ పోప్ రచించిన ‘ది రేప్ ఆఫ్ ది లాక్” మరో విశిష్ట ఉదాహరణ. మహాకావ్యాలకు ఉండే గంభీరమైన శైలిని ఉపయోగించి, ఒక యువతి జుట్టు ముడిని కత్తిరించిన చిన్న సంఘటనను ఆయన అత్యంత వైభవంగా వర్ణించాడు. తుచ్ఛమైన సం ఘటనను మహాకావ్య స్థాయికి తీసుకెళ్లడం ద్వారా సమాజంలోని కృత్రిమ గౌరవ భావనలను, ఉన్నత వర్గాల అలవాట్లను వ్యంగ్యంగా చిత్రించాడు. ఈ రచన పేరడీతో పా టు వ్యంగ్య రచనకు కూడా ఆదర్శంగా నిలిచింది. పేరడీని వ్యంగ్యంతో సమానంగా చూడడం సరైంది కాదు. వ్యంగ్యం ప్రధానంగా సమాజాన్ని, వ్యక్తులను లేదా ఆ లోచనలను విమర్శిస్తుంది. పేరడీ మాత్రం ముందుగా ఒక నిర్దిష్ట రచన, రచయిత లేదా సాహిత్య శైలిని అనుకరిస్తుంది. ఆ అనుకరణలోనే హాస్యం, విమర్శ, ప్రశంస అ నే మూడు అంశాలు సందర్భానుసారం కలిసిపోతాయి. అందువల్ల ప్రతి పేరడీలో వ్యంగ్య లక్షణాలు ఉండవచ్చుగానీ, ప్రతి వ్యంగ్య రచన పేరడీ కాదు. సాధారణంగా, సాహిత్యం నిరంతరం తనను తాను పరిశీలించుకుంటూ ముందుకు సాగుతుంది. ఆ ఆత్మపరిశీలనకు పేరడీ ఒక సమర్థమైన సాధనం. ఒక ప్రక్రియ తన పరిమితులను దాటినప్పుడు, ఒక శైలి మూసగా మారినప్పుడు, ఒక రచయిత ప్రభావం అతిగా పెరిగినప్పుడు పేరడీ వాటిని సు న్నితమైన హాస్యంతో ప్రశ్నిస్తుంది. అదే సమయంలో గొ ప్ప రచనల ప్రత్యేకతను కొత్త తరాలకు పరిచయం చేసే వంతెనగానూ నిలుస్తుంది. అందుకే పేరడీని కేవలం న వ్వించే ప్రక్రియగా చూడలేం. అది పాఠకుడి సాహిత్య అవగాహనను పరీక్షించే ప్రక్రియ. మూల రచన తెలిసినవారికే పేరడీలోని చమత్కారం పూర్తిగా అర్థమవుతుంది. అనుకరణను కళగా, హాస్యాన్ని విమర్శగా, విమర్శను సృజనాత్మకతగా మలిచే సాహిత్య ప్రక్రియగా పేరడీ నేటికీ తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది.
పేరడీ అవసరం ఏమిటి?
సాధారణంగా ఒక గంభీరమైన విషయాన్ని కూడా వ్యంగ్యంగా, హాస్యాత్మకంగా చెప్పడానికి ‘పేరడీ’ని ఆశ్రయిస్తారు. అయితే, కొన్నిసార్లు ఒక రచయిత తన అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేస్తే తీవ్ర విమర్శలు లేదా దూషణలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో పేరడీ ఒక సమర్థమైన సాహిత్య సాధనంగా మారుతుంది. ప్రత్యక్ష విమర్శకు బదులుగా హాస్యం, చమత్కారం, అనుకరణ ద్వారా తన భావాన్ని వ్యక్తీకరించే అవకాశం పేరడీ కల్పిస్తుంది. దీనివల్ల విమర్శ మరింత సున్నితంగా, కళాత్మకంగా పాఠకుడికి చేరుతుంది. ఎప్పుడూ అవమానపరచడానికి మాత్రమే ఉద్దేశించిన ప్రక్రియ కాదు. చాలాసార్లు అది మూల రచయిత పట్ల ఉన్న అభిమానానికి, గౌరవానికి కూడా సంకేతంగా ఉంటుంది. ఒక రచయిత శైలిని సమర్థంగా అనుకరించాలంటే ఆ రచనలపై లోతైన అవగాహన అవస అందువల్ల మంచి పేరడీ వెనుక విమర్శతో పాటు ప్ర శంస కూడా అంతర్లీనంగా ఉంటుంది. సందర్భా ల్లో మహాకవుల రచనా శైలిని పైపైగా అనుకరిస్తూ వారి గొప్పతనాన్ని అర్థం చేసుకోలేని రచయితలను ఎద్దేవా చేయడానికి పేరడీని ఉపయోగిస్తారు. అలాగే కాలానుగుణత కోల్పోయిన సాహిత్య సంప్రదాయాలను ప్రశ్నించడానికి, పాత మూసలను విమర్శించడానికి కూడా ఇది సమర్థమైన ఆయుధంగా పనిచేస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఒక ప్రసిద్ధ రచయిత శైలిని ఆశ్రయించి, అసలు లక్ష్యంగా మరో వ్యక్తిని, ఆలోచనను లేదా సామాజిక ప రిస్థితిని వ్యంగ్యంగా చిత్రించడానికి కూడా పేరడీని ఉపయోగిస్తారు. కాబట్టి పేరడీకి మూడు రకాల లక్ష్యాలు ఉంటాయని అనుకోవచ్చు. అంటే, అది మూల రచయిత ను విమర్శించవచ్చు, మూల రచనను విశ్లేషించవచ్చు లేదా ఆ రచన శైలిని మాధ్యమంగా చేసుకొని పూర్తిగా వేరే అంశాన్ని వ్యంగ్యంగా చిత్రించవచ్చు. పేరడీకి మరో ముఖ్యమైన ప్రయోజనం హాస్యమని ముందుగానే చెప్పుకున్నాం. హాస్యం మనసును తేలికపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆలోచనకు దారితీస్తుంది. పేరడీ ఈ లక్షణాలన్నింటినీ కలగలిపి పాఠకుడికి వినోదంతో పాటు విమర్శనాత్మక దృష్టిని కూడా అందిస్తుంది. నవ్విస్తూ ఆలోచింపజేయడం, చమత్కారం ద్వారా సాహిత్యాన్ని కొత్త కోణంలో చూడేలా చేయడం పేరడీ ప్రక్రియ విశిష్టత.
కూచిమంచి జగ్గకవి రచించిన ‘చంద్రరేఖా విలాపం’ వెనుక వ్యక్తిగత అసంతృప్తి ప్రధాన కారణంగా కనిపిస్తే, కందుకూరి వీరేశలింగం రచించిన ‘అభాగ్యోపాఖ్యానం’ పూర్తిగా సాహిత్య సంస్కరణ లక్ష్యంతో రూపుదిద్దుకుంది. రచన వెనుక ఉన్న ఉద్దేశాన్ని స్వయంగా కందుకూరి వివరించాడు. తెలుగు ప్రబంధ సాహిత్యం ఒకే తరహా శృం గార వర్ణనలతో నిండిపోయి, వైవిధ్యాన్ని కోల్పోయిందని ఆయన భావించాడు. అలాంటి ప్రబంధాలు సాహిత్యానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయనే అభిప్రాయానికి వచ్చిన తరువాత, ఆ ధోరణిని పరిహసించి సంస్కరించాలనే లక్ష్యంతో ఈ రచనను రూపొందించాడు. అం దువల్ల ఇది వ్యక్తిగత దూషణ కోసం రాసిన రచన కా దని, సాహిత్య సంస్కరణ కోసం చేసిన సృజనాత్మక ప్రయత్నమని అర్థం చేసుకోవాలి. ఇక కూచిమంచి జగ్గకవి రచనల్లో కనిపించే వ్యక్తిగత ఆగ్రహం, పరుష వ్యాఖ్య లు వీరేశలింగం రచనలో ఉండవు. ఆయన విమర్శ వ్యక్తులపై కాదు, కాలం చెల్లిన సాహిత్య ధోరణులపై. వ్యాసం రాసి విమర్శించడానికి బదులుగా, ప్రబంధాల్లోని మూసపద్ధతులను అతిశయోక్తితో చిత్రించి, వాటి బలహీనతల ను పాఠకుడి ముందుంచాడు. ఈ విధంగా పేరడీని సా హిత్య విమర్శకు సమర్థమైన సాధనంగా ఉపయోగించా డు. ‘అభాగ్యోపాఖ్యానం’లో కథా నిర్మాణం, పద్యశైలి, వర్ణనలు, ఉపమానాలు అన్నీ అప్పటి ప్రబంధాల లక్షణాలను ఉద్దేశపూర్వకంగా అనుకరిస్తాయి. ‘విజయవిలా సం’, ‘మనుచరిత్ర’ వంటి ప్రసిద్ధ ప్రబంధాల శైలిని ప్రతిబింబించే అనేక సందర్భాలు ఇందులో కనిపిస్తాయి. అ భాగ్యుడు అనే రాక్షసుడి కథ, అతని ప్రేమ, అన్వేషణ, చివరికి ఎదురయ్యే హాస్యాస్పద పరిణామాలు పాఠకుడికి నవ్వు పుట్టిస్తూనే, ప్రబంధ సాహిత్యంలో పేరుకుపోయిన కృత్రిమతను కూడా బహిర్గతం చేస్తాయి. ఈ కారణంగానే ‘అభాగ్యోపాఖ్యానం’ తెలుగు సాహిత్యంలో పేరడీకి ఒక ప్రామాణిక రచనగా గుర్తింపు పొందింది.
–విశ్వమిత్ర