Congress At DharnaChowk: కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదు..కొడుకు, అల్లుడు అడ్డుకుంటున్నారా? పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధ్వజం..(Video)
Congress At DharnaChowk: కేసీఆర్‌ను సభకు రాకుండా ఆయన కొడుకు, అల్లుడు అడ్డుకుంటున్నారా? ఒకవేళ సభకు రాలేని పరిస్థితి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. కొడుకు, అల్లుడికే పూర్తి అవకాశం ఇవ్వాలనుకుంటే కేసీఆర్ శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలి” అని మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో సవాల్ విసిరారు.
Congress At DharnaChowk: ప్రతిపక్ష నేత, గజ్వేల్ శాసనసభ్యుడు కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద గల ధర్నా చౌక్‌లో నిర్వహించిన ‘మహా ధర్నా’ ముగిసింది. ఈ భారీ నిరసన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదా?: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ధర్నా వేదికపై నుంచి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను తీవ్ర అప్పుల పాలు చేశారని విమర్శించారు. ప్రతిపక్ష హోదా కల్పిస్తే అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు.
“వెయ్యి రోజులుగా జీతం తీసుకుంటున్నా ప్రతిపక్ష పాత్ర పోషించకుండా, సభకు హాజరుకాకుండా కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణాలను ఆయన ప్రజలకు వివరించాలి. కేసీఆర్‌ను సభకు రాకుండా ఆయన కొడుకు, అల్లుడు అడ్డుకుంటున్నారా? ఒకవేళ సభకు రాలేని పరిస్థితి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. కొడుకు, అల్లుడికే పూర్తి అవకాశం ఇవ్వాలనుకుంటే కేసీఆర్ శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలి” అని మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో సవాల్ విసిరారు.
అప్పులు ఆగలేదు.. హామీల అమలూ ఆగలేదు: మంత్రి శ్రీధర్ బాబు
శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. “గత ప్రభుత్వం తీవ్రమైన అప్పుల భారంతో రాష్ట్రాన్ని మాకు అప్పగించినప్పటికీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క మాటనూ విస్మరించలేదు. ఆరు గ్యారంటీలలో సింహభాగాన్ని ఇప్పటికే అమలు చేశాం” అని తెలిపారు. విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచామని, ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. అప్పులు ఎంత ఉన్నా, హామీల అమలును ఏమాత్రం ఆపకుండా ముందడుగు వేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధత అని, ఇదే తమ వెయ్యి రోజుల విజయ ప్రయాణమని వివరించారు.
ప్రజా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చెల్లవు: మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా కేసీఆర్ బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించాలని హితవు పలికారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు శాసనసభకు రాకుండా దూరంగా ఉంటే ప్రజలు తప్పకుండా ప్రశ్నిస్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, విమర్శలు మాని తెలంగాణ వికాసానికి ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాల ప్రచారానికి తెలంగాణ ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.