MLA Gudem Mahipal Reddy Video: ఎర్రవెల్లి BRSLP సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ సైడ్ కూర్చుంటానని ప్రకటన..
MLA Gudem Mahipal Reddy: ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ శాసనసభా పక్ష (BRSLP) భేటీకి మహిపాల్ రెడ్డి హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశమైంది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి డైరెక్షన్లోనే ఇక్కడికి వచ్చాను. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని స్పీకర్ తీర్పు ఇచ్చారు కదా, మళ్లీ అనుమానాలు ఎందుకు? రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నేను బీఆర్ఎస్ పార్టీ వైపే కూర్చుంటాను” అని స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఘట్టం ఊహించని మలుపులు తిరుగుతున్న వేళ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ శాసనసభా పక్ష (BRSLP) భేటీకి మహిపాల్ రెడ్డి హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశమైంది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి డైరెక్షన్లోనే ఇక్కడికి వచ్చాను. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని స్పీకర్ తీర్పు ఇచ్చారు కదా, మళ్లీ అనుమానాలు ఎందుకు? రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నేను బీఆర్ఎస్ పార్టీ వైపే కూర్చుంటాను” అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ తీర్థం నుంచి తిరిగి గులాబీ గూటికి..
గతంలో గులాబీ కండువా తీసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారనే వార్తలతో మహిపాల్ రెడ్డి వార్తల్లో నిలిచారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు దాఖలైనప్పటికీ, సాంకేతికంగా ఆయన కాంగ్రెస్‌లో చేరలేదని స్పీకర్ స్పష్టం చేయడంతో అనర్హత వేటు నుంచి సాంకేతికంగా బయటపడ్డారు.
అయితే, పటాన్చెరు నియోజకవర్గంలో స్థానిక కాంగ్రెస్ నేతలతో వైరం, ఆధిపత్య పోరు పెరగడంతో ఆయన అధికార పార్టీకి క్రమంగా దూరమయ్యారు. మళ్లీ స్వగూటికే మొగ్గు చూపుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సరసన చేరారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను స్వయంగా ముందుండి గెలిపించి తన పట్టును చాటుకున్నారు. విజయానంతరం ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు అధికార పార్టీకి మింగుడుపడకుండా చేయగా, గులాబీ శ్రేణులకు కొత్త ఊపిరి పోశాయి.
బీఆర్ఎస్ లో ప్రత్యేకం.. కాంగ్రెస్‌లో పునరాలోచన!
పార్టీని వీడిన ఇతర ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం కొంత వ్యూహాత్మక దూరంగా ఉన్నప్పటికీ, మహిపాల్ రెడ్డికి నియోజకవర్గంలో ఉన్న ప్రజాదరణ, ఫలితాలు సాధించగల సత్తాను చూసి ఆయనను బేషరతుగా ఆహ్వానించింది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన అత్యంత కీలకమైన బీఆర్ఎస్ఎల్పీ భేటీకి కూడా అధికారికంగా ఆహ్వానించి, రాబోయే సభల వ్యూహరచనలో భాగస్వామిని చేసింది. మహిపాల్ రెడ్డి వ్యూహాత్మక యు-టర్న్ మరియు బీఆర్ఎస్లో ఆయనకు దక్కిన ప్రాధాన్యత కాంగ్రెస్ వర్గాలకు మింగుడుపడటం లేదు. కాంగ్రెస్‌లో చేరినా స్థానికంగా కేడర్ మద్దతు దక్కక, గుర్తింపు లేక సతమతమవుతున్న ఇతర ‘ఫిరాయింపు’ ఎమ్మెల్యేలకు ఈ పరిణామం కళ్లు తెరిపించేలా ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ ‘మహిపాల్ రెడ్డి ఎపిసోడ్’ తెలంగాణ రాజకీయంలో చేరికల పర్వానికి సరికొత్త పాఠాలు నేర్పుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.