నిరుద్యోగ యువతకు ఏదీ భవిష్యత్తు?
చదువుకో… మంచి ఉద్యోగం వస్తుంది—మన దేశంలో ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు చెప్పే మాట. చిన్నతనం నుంచి పాఠశాల, కళాశాల, కోచింగ్ సెంటర్, పోటీ పరీక్షలు అంటూ ఎన్నో సంవత్సరాలు చదివిన తర్వాత ఒక మంచి ఉద్యోగం వస్తే కుటుంబ భవిష్యత్తు మారుతుందని యువత ఆశపడుతుంది. కానీ నేటి వాస్తవ పరిస్థితి ఆ ఆశలకు భిన్నంగా ఉంది. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఒక ఉద్యోగ ప్రకటన వెలువడితే లక్షలాది మంది పోటీ పడాల్సిన పరిస్థితి. పరీక్ష రాస్తే ఫలితాల కోసం నెలలు, సంవత్సరాలు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఉద్యోగం వచ్చినా అది శాశ్వతమా? సరైన వేతనం ఉంటుందా? సామాజిక భద్రత ఉంటుందా? అనే ప్రశ్నలు యువతను వెంటాడుతున్నాయి.
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశాల్లో ఒకటి. ఈ యువశక్తి దేశానికి గొప్ప సంపద. యువతలో ఉన్న శక్తి, ప్రతిభ, సృజనాత్మకత, శ్రమ దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడితే భారతదేశం అపారమైన పురోగతిని సాధించగలదు. కానీ యువతకు విద్య, నైపుణ్యం, ఉపాధి, సామాజిక భద్రత కల్పించలేకపోతే అదే యువ జనాభా నిరుద్యోగం, నిరాశ, వలసలు, అసమానతలకు కారణమవుతుంది. అందుకే నేడు దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రశ్నల్లో యువత ఉపాధి ప్రశ్న ఒకటి.
అంతర్జాతీయ కార్మిక సంస్థ మరియు ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ రూపొందించిన ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్ 2025 కూడా భారతదేశంలో యువత నిరుద్యోగం, ముఖ్యంగా చదువుకున్న యువత నిరుద్యోగాన్ని తీవ్రమైన సవాలుగా గుర్తించింది. విద్యా స్థాయి పెరుగుతున్నప్పటికీ దానికి అనుగుణంగా నాణ్యమైన ఉపాధి అవకాశాలు తగినంతగా పెరగకపోవడం భారత కార్మిక మార్కెట్‌లో ఉన్న వైరుధ్యాన్ని బయటపెడుతోంది. ఒకవైపు యువ భారతదేశం గురించి గొప్పగా మాట్లాడుతున్న పాలకులు, మరోవైపు ఆ యువతకు తగిన స్థిరమైన ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమవుతున్నారు. నేటి యువత గత తరాలతో పోలిస్తే ఎక్కువగా చదువుకుంటోంది. అయితే విద్యా వ్యవస్థ నుంచి బయటకు వచ్చిన ప్రతి యువకుడికి తన విద్యకు తగ్గ ఉద్యోగం దొరుకుతుందా అనే ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం లేదు. డిగ్రీ చేతిలో ఉంది, కానీ ఉద్యోగం లేదు. నైపుణ్యం ఉంది, కానీ అవకాశాలు లేవు. ప్రతిభ ఉంది, కానీ స్థిరమైన ఉపాధి లేదు. ఇదే నేటి యువత ఎదుర్కొంటున్న విషాదకర వాస్తవం.
ప్రభుత్వ ఉద్యోగం కోసం జీవితమే ఒక పరీక్షగా మారడం నేటి యువత పరిస్థితికి మరో ఉదాహరణ. ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం జీతం కాదు. అది కుటుంబానికి స్థిరమైన ఆదాయం, ఉద్యోగ భద్రత, సామాజిక గౌరవం, వైద్య భద్రత, భవిష్యత్తుపై నమ్మకం. అందుకే ఒక చిన్న ఉద్యోగ ప్రకటన వెలువడినా వేలాది, లక్షలాది మంది యువత దరఖాస్తు చేసుకుంటున్నారు. ఒక పోస్టుకు వేలమంది పోటీ పడటం యువత ప్రతిభకు మాత్రమే నిదర్శనం కాదు; దేశంలో నాణ్యమైన, స్థిరమైన ఉద్యోగాల కొరతకు కూడా నిదర్శనం.
తెలంగాణలో కూడా యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ప్రధాన రాజకీయ, సామాజిక ప్రశ్నగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం వివిధ దశల్లో నియామక ప్రక్రియలను చేపట్టింది. 2026 జనవరిలో టీజీపీఎస్ గ్రూప్ ఎంపికైన 1,370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడం జరిగింది. భవిష్యత్తులో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నియామకాలు జరగడం స్వాగతించాల్సిన విషయమే. అయితే యువత అడగాల్సిన ప్రశ్న ఇక్కడితో ముగియదు. ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి? వాటికి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి? పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి? ఫలితాలు ఎప్పుడు వస్తాయి? నియామకాలు ఎప్పుడు పూర్తవుతాయి? ఈ వివరాలన్నీ ప్రజలకు పారదర్శకంగా తెలియాలి.
ప్రతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యోగాలపై హామీలు ఇవ్వడం, కొన్ని నియామకాలు చేపట్టడం, ఆ తర్వాత మిగిలిన ఖాళీలపై స్పష్టత లేకపోవడం కొనసాగితే యువత భవిష్యత్తు అనిశ్చితిలోనే ఉంటుంది. అందుకే రాష్ట్రంలో ప్రతి సంవత్సరం శాఖల వారీగా ఖాళీలను ప్రకటించి, వాటి ఆధారంగా వార్షిక ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలి. ఉద్యోగ నోటిఫికేషన్ కోసం యువత జీవితాన్ని సంవత్సరాల తరబడి నిలిపివేసే పరిస్థితికి ముగింపు పలకాలి.
ప్రభుత్వ ఉద్యోగాల కొరతతో యువత ప్రైవేటు రంగాన్ని ఆశ్రయిస్తోంది. అయితే ప్రైవేటు రంగంలో కూడా సమస్యలు తీవ్రంగానే ఉన్నాయి. ఇంజినీరింగ్ లేదా ఇతర ఉన్నత విద్య పూర్తిచేసిన యువకుడు తక్కువ వేతనంతో ఉద్యోగం ప్రారంభిస్తాడు. ఎక్కువ పని గంటలు, వారానికి ఆరు రోజుల పని, ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆరోగ్య బీమా లేకపోవడం, భవిష్యత్తు భద్రత లేకపోవడం సాధారణమవుతున్నాయి. కాంట్రాక్ట్ ముగిసిందంటే ఉద్యోగం ముగిసిపోవచ్చు. సంస్థలో ఆర్థిక పరిస్థితులు మారితే ఉద్యోగం కోల్పోవచ్చు.
ఈ నేపథ్యంలో గిగ్ ఎకానమీ మరో కొత్త సవాలుగా ముందుకు వచ్చింది. డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ కార్మికులు, వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సేవలు అందించే యువత సంఖ్య పెరుగుతోంది. వీరికి పనిచేసే స్వేచ్ఛ ఉన్నట్లు కనిపించినప్పటికీ, కనీస ఆదాయ భద్రత, ప్రమాద బీమా, ఆరోగ్య రక్షణ, వృద్ధాప్య భద్రత వంటి ప్రశ్నలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. యాప్‌లో లాగిన్ అవ్వండి, పని చేసుకోండి అనే విధానం యువతకు స్థిరమైన భవిష్యత్తును ఇవ్వదు. శ్రమించే ప్రతి యువకుడికి సామాజిక భద్రత ఉండాలి.
అదే విధంగా స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో ప్రభుత్వాలు కేవలం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి బాధ్యత ముగించకూడదు. నైపుణ్యం అవసరమే. కానీ స్కిల్ ట్రైనింగ్ ఉద్యోగానికి ప్రత్యామ్నాయం కాదు. ఒక యువకుడికి ఆరు నెలల శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వడం ద్వారా అతని సమస్య పరిష్కారం కాదు. శిక్షణ తర్వాత అప్రెంటిస్‌షిప్, అప్రెంటిస్‌షిప్ తర్వాత ఉద్యోగం, ఉద్యోగంలో న్యాయమైన వేతనం, సామాజిక భద్రత అనే పూర్తి వ్యవస్థను నిర్మించాలి. యువతకు శిక్షణ ఇచ్చే సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ విభాగాలు పరస్పరం అనుసంధానమై పనిచేయాలి.
ఉపాధి సమస్యకు మరో ముఖ్యమైన కోణం ప్రాంతీయ అసమానత.
గ్రామీణ యువత ఉపాధి ప్రశ్నను వ్యవసాయంతో వేరు చేసి చూడలేం. రైతు కుటుంబం ఆర్థికంగా బలహీనపడితే ఆ కుటుంబంలోని యువత మొదటగా ప్రభావితమవుతుంది. వ్యవసాయంలో ఆదాయం అనిశ్చితంగా ఉంటే యువత పట్టణాల వైపు చూస్తుంది. అందుకే వ్యవసాయాన్ని కేవలం పంట పండించే రంగంగా కాకుండా ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలి. పంట ఉత్పత్తితో పాటు నిల్వ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా, మార్కెటింగ్, ఎగుమతులు వంటి రంగాలను గ్రామీణ ప్రాంతాల్లోనే అభివృద్ధి చేస్తే వ్యవసాయంతో అనుసంధానమైన అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.
మహిళా యువత ఉపాధి సమస్యను కూడా ప్రత్యేకంగా చూడాలి. విద్య పూర్తిచేసిన అనేక మంది యువతులు ఉద్యోగాల్లోకి రావాలనుకున్నా సురక్షితమైన రవాణా లేకపోవడం, పని ప్రదేశాల్లో భద్రతపై ఆందోళనలు, కుటుంబ బాధ్యతలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాల కొరత, వేతన అసమానత వంటి సమస్యలు అడ్డంకులుగా నిలుస్తున్నాయి. కాబట్టి మహిళా యువతకు ఉపాధి కల్పించడం అంటే కేవలం ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడం కాదు. సురక్షిత రవాణా, హాస్టళ్లు, సమాన వేతనం, సురక్షిత పని ప్రదేశాలు, ప్రసూతి ప్రయోజనాలు, నైపుణ్య శిక్షణ వంటి అంశాలను కూడా ఉపాధి విధానంలో భాగం చేయాలి.
ఇక కొత్తగా ముందుకొస్తున్న సాంకేతిక మార్పు యువత ఉపాధి ప్రశ్నకు మరో కొత్త కోణాన్ని జోడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి సాంకేతిక పరిణామాలు కొన్ని కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని ప్రథమ శ్రేణి, రిపీటిటివ్ పనుల స్వభావాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. అందుకే యువతకు కేవలం ఏఐ నేర్చుకోండి అని చెప్పడం సరిపోదు. గ్రామీణ ప్రాంతాల వరకు డిజిటల్ మౌలిక వసతులు, ఉచిత AI శిక్షణ, కంప్యూటర్ సదుపాయాలు, రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ అవకాశాలు అందుబాటులోకి రావాలి.
AIYF కోరుకునేది కేవలం కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కాదు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను తక్షణం భర్తీ చేయాలి. కేంద్రం, రాష్ట్రాలు ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలి. నోటిఫికేషన్ నుంచి నియామకం వరకు నిర్ణీత కాలపరిమితి ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించకుండా బలోపేతం చేయాలి. ప్రతి జిల్లాలో స్థానిక వనరుల ఆధారంగా ఉపాధి సృష్టి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కొత్త పరిశ్రమల్లో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి. స్కిల్ డెవలప్‌మెంట్‌ను అప్రెంటిస్‌షిప్, ఉద్యోగంతో అనుసంధానం చేయాలి. గిగ్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి. గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, చిన్న పరిశ్రమలు, సహకార రంగాన్ని అభివృద్ధి చేయాలి. మహిళా యువతకు సురక్షితమైన, సమాన వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఏఐ, ఆటోమేషన్ వల్ల ఉద్యోగ మార్పులకు గురయ్యే యువతకు ఉచిత రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ అందించాలి. ప్రతి జిల్లాలో పోటీ పరీక్షలకు ఉచిత ప్రభుత్వ కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. నియామకాల్లో పేపర్ లీకులు, అవకతవకలు లేకుండా పారదర్శక వ్యవస్థను నిర్మించాలి.
ఇది కేవలం డిమాండ్ల జాబితా కాదు. యువత భవిష్యత్తు గురించి ఒక ప్రత్యామ్నాయ దిశ. ప్రజల పన్నులతో నడిచే ప్రభుత్వం ప్రజలకు ఉద్యోగ అవకాశాలను సృష్టించాలి. దేశ సంపదను సృష్టించే కార్మికులకు గౌరవప్రదమైన జీవితం కల్పించాలి. చదువుకున్న యువతకు తన ప్రతిభను ఉపయోగించుకునే అవకాశం కల్పించాలి. గ్రామీణ యువత తన ఊరిని వదిలి వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించాలి. మహిళా యువతకు సమాన అవకాశాలు కల్పించాలి. సాంకేతిక అభివృద్ధి ప్రయోజనాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలి. భారతదేశ యువతకు సామర్థ్యం ఉంది. ప్రతిభ ఉంది. శ్రమ ఉంది. కలలు ఉన్నాయి. అవసరం ఉన్నది అవకాశం. ఒక యువకుడికి ఉద్యోగం ఇవ్వడం ద్వారా కేవలం ఒక వ్యక్తిని నిలబెట్టడం కాదు; ఒక కుటుంబాన్ని నిలబెట్టడం. ఒక కుటుంబం ఆర్థికంగా బలపడితే ఒక గ్రామం బలపడుతుంది. లక్షల కుటుంబాలు బలపడితే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అందుకే యువతకు ఉద్యోగం కల్పించడం ప్రభుత్వ దయ కాదు; ప్రజల పన్నులతో నడిచే ప్రభుత్వానికి ఉన్న ప్రజా బాధ్యత.
యువతను ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తు చేసుకుని, మిగిలిన కాలంలో వారి సమస్యలను పక్కన పెట్టే రాజకీయ సంస్కృతికి ముగింపు పలకాలి. యువతను ఓటు బ్యాంకుగా కాకుండా దేశ నిర్మాణ శక్తిగా గుర్తించాలి. వారి కోపాన్ని మతం, కులం, ప్రాంతం పేరుతో విభజించకుండా, వారి సమస్యలకు పరిష్కారం చూపే ప్రజా ఉద్యమంగా మలచాలి. నిరుద్యోగ యువతలో ఉన్న అసంతృప్తికి ప్రజాస్వామ్య, శాస్త్రీయ, సామాజిక న్యాయ దిశను చూపడం యువజన ఉద్యమాల చారిత్రక బాధ్యత.
యువత హక్కుల కోసం ఐక్యమై ఉద్యమిద్దాం. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, శాస్త్రీయ దృక్పథం ఆధారంగా సమానత్వ, ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం కోసం పోరాడుదాం.