CPI Mega Rally: బదలావ్ జరూరీ హై ఫోటోలు ఇవిగో.. రేపు ఢిల్లీలో భారీ ర్యాలీ చేపట్టనున్న సీపీఐ.. వేలాదిగా తరలివస్తున్న ప్రజలు..
CPI Mega Rally
CPI Mega Rally: దేశ రాజధాని ఢిల్లీని రామ్ లీలా మైదానం ఎర్రజెండాలతో నిండిపోయింది. సీపీఐ ఆధ్వర్యంలో రామ్‌లీలా మైదానంలో మంగళవారం నిర్వహించనున్న భారీ ర్యాలీకి దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు తరలివస్తుండగా.. ఇప్పటికే ఢిల్లీ వీధుల్లో కార్యకర్తల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి వేలాది మంది సీపీఐ కార్యకర్తలు, నాయకులు ప్రత్యేక రైళ్లు, ఇతర ప్రయాణ సౌకర్యాల ద్వారా ఢిల్లీకి చేరుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
‘బదలావ్ జరూరీ హై’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీని కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పోరాటానికి కీలక వేదికగా సీపీఐ భావిస్తోంది. గత 12 ఏళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో విఫలమైందంటూ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రామ్‌లీలా మైదానం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సహా పలువురు ప్రముఖ నేతలు పాల్గొని, ప్రసంగించనున్నారు.
ర్యాలీకి ఒక రోజు ముందుగానే ఢిల్లీకి వివిధ రాష్ట్రాల నుంచి కార్యకర్తల రాక పెరిగింది. రైల్వే స్టేషన్లు, బస కేంద్రాలు, పార్టీ కార్యాలయాల వద్ద సీపీఐ శ్రేణుల సందడి కనిపిస్తోంది. తెలంగాణ నుంచి వచ్చిన కార్యకర్తలు ఎర్రజెండాలు, పార్టీ నినాదాలతో రాజధాని వీధుల్లో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలుదేరారు.
బదలావ్ జరూరీ హై ఫోటోలు ఇవిగో..















‘బదలావ్ జరూరీ హై’ ర్యాలీని కేవలం రాజకీయ సభగా కాకుండా, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజా నిరసనగా మలచాలని సీపీఐ ప్రయత్నిస్తోంది. తెలంగాణ నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తల ఉత్సాహం ఈ ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా మారింది. మంగళవారం జరిగే సభలో కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ ఎలాంటి రాజకీయ సందేశాన్ని ఇవ్వబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.








