Roots: The Saga of an American Family Book Review: మూలాలు వెతికిన ‘రూట్స్’
రచయిత: సత్య శ్రీ
Roots: మాండికా వ్యక్తి కుంటా కింటా అమెరికాలో స్థిరపడతాడు. ఆ తర్వాత అతని వారసులు అనేక తరాలు అమెరికా నేలపైనే జీవిస్తారు. బానిసత్వ బాధల నుంచి హక్కుల కోసం జరిగిన పోరాటాల వరకూ ఆ కుటుంబం ఎన్నో ఒడిదిడుకులు ఎదుర్కొంటుంది. అయితే, ‘రూట్స్’ను బానిసత్వంపై రాసిన నవలగా చూడడం సరికాదు. ఎందుకంటే, అది నిష్కళంకమైన కుటుంబ చరిత్రగా కూడా నిలుస్తుంది. ఆ కోణంలో చదివితేగానీ దాని లోతులు అర్థం కావు.
ఆఫ్రికా నుంచి అమెరికా చేరిన నల్లజాతి కుటుంబాల్లో హేలీ కుటుంబం కూడా ఒకటి. మిగతా వారి మాదిరి కాకుండా, హేలీ తన కుటుంబ సంప్రదాయాలను విశ్లేషిస్తాడు. వారసత్వ సంపదగా నిలిచే పత్రాలను లోతుగా పరిశీలిస్తాడు. వంశ వృక్షాన్ని సిద్ధం చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ పరిశోధనా క్రమంలోనే చరిత్రను తవ్వితీస్తాడు. ఏడు తరాల చరిత్రనే సాహిత్య గాథగా నిర్మిస్తాడు. ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం ‘పులిట్జర్’ (1977)కు ఎంపికైన ఈ నవల, 46 వారాల పాటు న్యూ యార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.
గాంబియా నదికి సమీపంలోని జుఫ్యూర్ గ్రామంలో పుట్టిపెరిగిన కుంటా బాలాన్ని తన మాండింకా కుటుంబం, గ్రామ సంప్రదాయాలు, మతం, వ్యవసాయం, సామాజిక క్రమం వంటి అంశాలు శాసిస్తాయి. తన తండ్రి పదేపదే వంశ గౌరవం గురించి ఘనంగా చెప్పడంతో, కుంటా కింటేలో ఒక రకమైన గర్వం పెరుగుతుంది. బానిసత్వ దుష్ట సంప్రదాయాన్ని బానిసగా ఉన్న ఒక వ్యక్తి కళ్లతోనే చూపడించడం హేలీ గొప్ప ఎత్తుగడ.
బానిసత్వ నిర్మూలన అనంతరం జన్మించిన వారంతా తమ స్వేచ్ఛను అనుభవిస్తారు. భాష, మతం, భూమి, పేరు అన్నింటినీ తనవిగా భావిస్తారు. ఇలాంటి భావాలే జీర్ణించుకుపోయిన ఒక యువతరాన్ని హేలీ ఒక్కసారిగా బానిసత్వ వ్యవస్థలోకి నెట్టేస్తాడు. అంతేకాదు, బానిసత్వం అంటే కేవలం శారీరకంగా ఒకరి ఆధీనంలో ఉండడమే కాదని, పేరు నుంచి భాష వరకు, కుటుంబ సంబంధాల నుంచి సామాజిక స్థానం వరకూ, గతం నుంచి భవిష్యత్తు వరకూ అడుగడుగునా జరిగే అణచివేత అని గుర్తిస్తాడు. పాఠకులు అదే కోణంలో ఆలోచించేలా కథను ముందుకు తీసుకెళ్లడంలో హెలీ అద్భుత ప్రతిభ కనబరిచాడు.
కథ విషయానికి వస్తే, చెక్కతో డ్రమ్ తయారు చేయడానికి అడవిలోకి వెళ్లిన కుంటా అనుకోకుండా బానిస వ్యాపారుల చేతిలో బందీ అవుతాడు. అక్కడి నుంచి అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. అతనిని మానసికంగా అవమానించి, శారీరకంగా హింసించి, సంకెళ్లతో కట్టేసి అట్లాంటిక్ మహా సముద్రాన్ని దాటిస్తారు. ఆ సమయంలో అతను పడిన బాధను, ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులు బానిస వ్యవస్థ దుర్మార్గాన్ని హేలీ కళ్లకు కడతాడు.
మనిషిని సరుకుగా మార్చిన ఆర్థిక వ్యవస్థను ఒక శరీరం అనుభవించే బాధగా చూపిస్తాడు. ఎవరూ ప్రవేశించలేని ఓ ఇరుకైన ప్రదేశం, దుర్వాసన, ఆకలి, దాహం, వ్యాధి, నగ్నత్వం, హింస, మరణ భయం కలగలిసిన బానిస వ్యాపార వ్యవస్థ చెక్కిన అమానుష ఆధిపత్యాన్ని పాఠకుల ముందుకు తెస్తాడు. ఈ అనుభవాన్ని విస్తృతంగా అమెరికా పాఠక వర్గానికి చేరువ చేసిన తొలి నవలగా, అత్యంత ప్రజాదరణ పొందిన రచనగా ‘రూట్స్’ నిలుస్తుంది.
ఇక, అమెరికా చేరుకున్న తర్వాత, బానిస వ్యాపారులు కుంటాను జాన్ వాలెర్ అనే వ్యక్తికి అమ్మేస్తారు. అతను కుంటాకు ‘టోబీ’ అని పేరు పెడతారు. అయితే, కుంటా తన అసలు పేరును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. తనను టోబీ అని పిలవడాన్ని తిరస్కరిస్తాడు. ఎందుకంటే పేరు మార్చడం ద్వారా యజమాని అతని వ్యక్తిత్వంపై తన అధికారం ప్రకటిస్తున్నాడు. కుంటా ప్రతిఘటనను కొనసాగిస్తాడు. పారిపోవడానికి పలుమార్లు ప్రయత్నిస్తాడు. చివరకు బానిస వేటగాళ్లు అతని కుడి పాదంలో కొంత భాగాన్ని తొలగిస్తారు.
యజమాని తన బానిస శరీరాన్ని నియంత్రించగలడుగానీ, అతని జ్ఞాపకాన్ని పూర్తిగా నియంత్రించలేడనే ఒక శక్తివంతమైన ప్రతీకను కుంటా ప్రతిఘటన రూపంలో హేలీ నిర్మిస్తాడు. యజమాని తాను కొనుగోలు చేసిన బానిస పేరు మార్చగలడేమోగానీ, అతని పూర్వీకుల జ్ఞాపకాన్ని మాత్రం తుడిచివేయలేడు. కాగా, కుంటా తన కుమార్తె కిజ్జీకి తన మూలాలను చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ జ్ఞాపకమే తరువాత తరాలుగా కథల రూపంలో ప్రయాణించి హేలీ వద్దకు చేరుతుంది.
కుంటా వివాహం బెల్‌తో జరుగుతుంది. వారికి కిజ్జీ పుడుతుంది. కిజ్జీ బాల్యం తల్లిదండ్రుల ప్రేమతో కొంత సురక్షితంగా సాగుతుంది. ఆమెకు మిస్సీ యాన్ అనే తెల్లజాతి యువతితో స్నేహం ఏర్పడుతుంది. చదవడం, రాయడం నేర్చుకోవడానికి ఆమెకు అవకాశం వస్తుంది. కానీ బానిస వ్యవస్థలో వ్యక్తిగత సంబంధాలకు కూడా యజమాన్య హక్కు అడ్డుపడుతుంది. కిజ్జీ ఒక బానిస యువకుడు నోహ్‌కు పారిపోవడానికి నకిలీ ప్రయాణ పత్రం తయారు చేస్తుంది. విషయం బయటపడటంతో ఆమెను కుటుంబం నుంచి వేరు చేసి అమ్మేస్తారు. ఆమెకు అప్పటికి పదహారేళ్లు.
‘రూట్స్’ నవలలో ‘కుటుంబ విభజన’ అనే అత్యంత విషాదాన్ని వివరిచే ఘట్టం ఇది. బానిస వ్యవస్థ ఒక వ్యక్తినేగాక అతని లేదా ఆమె కుటుంబాన్ని కూడా ఛిద్రం చేస్తుందని, తల్లి, తండ్రి, కుమార్తె, భార్య, భర్త అనే సంబంధాలనూ మార్కెట్‌లో వస్తువులుగా మార్చేస్తుందని అర్థమైనప్పుడు పాఠకుడి గుండె బాధతో బరువెక్కుతుంది.
కిజ్జీని కొనుగోలు చేసిన టామ్ లీ, ఆమెపై అత్యాచారం చేస్తాడు. అతడు శారీరక సంబంధాన్ని కొనసాగించడంతో, ఆమె జార్జికి జన్మనిస్తుంది. జార్జి పెరిగిపెద్దవాడై పందెపు కోళ్ల శిక్షకుడిగా మంచి పేరు సంపాదిస్తాడు. అందరూ అతనిని ‘చికెన్ జార్జి’ అని పిలుస్తారు. ఈ పాత్ర ద్వారా, బానిసత్వంలో బతికిన ప్రతి ఒక్కరూ ఒకే రకంగా ప్రతిఘటించరని, కొందరు పారిపోవడానికి ప్రయత్నిస్తే, మరి కొందరు కుటుంబాన్ని రక్షించుకోవడానికి యజమానితో రాజీ పడతారని ఒక సంక్లిష్టమైన అంశాన్ని హేలీ ప్రస్తావిస్తాడు. కొంత మంది తమకు దొరికిన చిన్న ఆర్థిక అవకాశాలను ఉపయోగించుకుని స్వేచ్ఛకు దారి వెతుకుతారని కూడా చెప్తాడు. చికెన్ జార్జి కోడి పందేల ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని నిర్మించుకోవడం ద్వారా, కుటుంబానికి కొంత స్వేచ్ఛను కొనుక్కునేందుకు ప్రయత్నిస్తాడు.
అతని కుమారుడు టామ్ ముర్రే కమ్మరిగా ఎదుగుతాడు. అంతర్యుద్ధం ముగియడంతో బానిసత్వ నిర్మూలనా చట్టం అమల్లోకి వస్తుంది. కానీ, ఆ వ్యవస్థ ఒక్కసారిగా అంతమైపోదు. ఇదే విషయాన్ని హేలీ ప్రస్తావిస్తాడు. అందుకే, ఆ కుటుంబం ఉత్తర కరోలినా నుంచి టెన్నెసికి వలసవెళ్లి, అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది.
యుద్ధం ముగిసి, బానిస కుటుంబాలకు కొత్త జీవితం లభించడంతో కథ ముగుస్తుందని అంతా అనుకుంటారు. కానీ, హేలీ వాస్తవ పరిస్థితులను మరింత దగ్గరగా చూపే ప్రయత్నం చేస్తాడు. బానిసత్వం నుంచి విముక్తి తర్వాత కూడా ఆఫ్రికన్ కుటుంబాలు భూమి, విద్య, ఉపాధి, సామాజిక గౌరవం కోసం పోరాడాల్సి వచ్చింది.
టామ్ కుమార్తె సింథియా, విల్ పాల్మర్‌ను వివాహం చేసుకుంటుంది. వారి కుమార్తె బెర్తా కళాశాలకు వెళ్లే కుటుంబంలోని తొలి వ్యక్తిగా ఎదుగుతుంది. అనంతర కాలంలో హేలీని బెర్తా సైమన్ వివాహం చేసుకుంటుంది. వారి కుమారుడే అలెక్స్ హేలీ. అంటే కుంటా కథ ఒక వ్యక్తి బానిసత్వంలో పడిపోవడంతో ప్రారంభమై, అతని వారసుల్లో ఒకరు తన కుటుంబ చరిత్రను రాయడానికి కూర్చోవడంతో ముగుస్తుంది. ఇది వలయాకార నిర్మాణం. బానిసత్వం కుంటా నుంచి అతని పేరు తీసుకుంది. రచన మాత్రం ఆ పేరును తిరిగి చరిత్రలోకి తీసుకొచ్చింది.
బానిస కుటుంబాల మూలాలు వెతకడం, అందునా, అనేకానేక పేర్లు మారిన ఒక కుటుంబ వివరాలను సేకరించడం అనుకున్నంత సులభం కాదు. ఆ పనిని హేలీ సమర్థంగా నిర్వహించాడు. వాస్తవాల ఆధారంగా కథను సిద్ధం చేసుకొని, ‘రూట్స్’ పూర్తి చేశాడు. ఒక రకంగా ఇది చరిత్ర మూలాల్లోకి వెళ్లే రచన.
అలెక్స్ హేలీ రచించిన ‘రూట్స్: ది సెగా ఆఫ్ యాన్ అమెరికన్ ఫ్యామిలీ’ నవల కుటుంబ కథను చెప్పడాన్ని, సమాజ చరిత్రను వివరించడాన్ని అధిగమించి, ఒక ప్రజాసమూహం తన గతాన్ని వెతుక్కునే ప్రయత్నాన్ని, సాంస్కృతిక ప్రక్రియను మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. 1976 ప్రచురితమైన ఈ నవలలో కథ విస్తారమైన అనుభవాలను ప్రోదిచేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఆఫ్రికాలోని గాంబియా నుంచి అమెరికా బానిస వ్యవస్థ వరకు ఎన్నో అంశాలను ప్రస్తావిస్తుంది. అంతర్యుద్ధాన్ని పలకరిస్తుంది. బానిసత్వ నిర్మూలకు సాగిన పోరాటాన్ని పరిచయం చేస్తుంది. జీవితాలను పేర్చుకుంటూ, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సాగిన ఒక కుటుంబ ప్రయాణాన్ని సమకాలీన సమాజానికి ఆపాదించి వివరిస్తుంది.
మాండికా వ్యక్తి కుంటా కింటా అమెరికాలో స్థిరపడతాడు. ఆ తర్వాత అతని వారసులు అనేక తరాలు అమెరికా నేలపైనే జీవిస్తారు. బానిసత్వ బాధల నుంచి హక్కుల కోసం జరిగిన పోరాటాల వరకూ ఆ కుటుంబం ఎన్నో ఒడిదిడుకులు ఎదుర్కొంటుంది. అయితే, ‘రూట్స్’ను బానిసత్వంపై రాసిన నవలగా చూడడం సరికాదు. ఎందుకంటే, అది నిష్కళంకమైన కుటుంబ చరిత్రగా కూడా నిలుస్తుంది. ఆ కోణంలో చదివితేగానీ దాని లోతులు అర్థం కావు.