Skip to content
ప్రపంచం వార్తలు

US-Iran war latest: హార్ముజ్‌ జలసంధిపై ట్రంప్‌ మడత పేచీలు

Prajapaksham 23 Aug 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
US-Iran war latest: హార్ముజ్‌ జలసంధిపై ట్రంప్‌ మడత పేచీలు

US-Iran war latest: హార్ముజ్‌ జలసంధిపై ట్రంప్‌ మడత పేచీలు

హార్ముజ్‌ తమ భూభాగం అని వ్యూహాత్మక ప్రకటన చేయటంలో ట్రంప్‌ ఎత్తుగడ – జలసంధి ఇప్పటికే తెరుచుకుందని చెప్పటం ద్వారా దాని మూసివేతను నియంత్రించే అవకాశాన్ని ఇరాన్‌కు నిరాకరించటం, అదే సమయంలో మున్ముందు ఏదైనా విఘాతం జరిగినా అమెరికా ప్రకటిత భూభాగంపై ‘కవ్వింపు’గా చిత్రించే అవకాశాన్ని అట్టిపెట్టుకోవటం.

రచయిత: ఆజాద్ మీర్జా

US-Iran war latest: ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం దాదాపు ఆరు నెలలు పూర్తిచేసుకుంటోంది. హార్ముజ్‌ జలసంధి నౌకాయాన మార్గంగా తగ్గిపోయి వాగాడంబర యుద్ధక్షేత్రంగా మారింది. ఆ కార్యస్థలం ఈ వారం కొత్త దశకు చేరుకుంది. ఆ జలమార్గం “కొత్త అమెరికా భూభాగం” అంటూ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’పై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ)తో రూపొందించిన మ్యాప్‌ పోస్టు చేశారు. “జలసంధి తెరుచుకుంది, పనిచేస్తున్నది” అని వక్కాణిస్తూ, “నీటిలోని మందుపాతరలన్నీ తొలగించబడినాయి లేదా పేల్చి వేయబడినాయి” అని ప్రకటించారు.

టెహరాన్‌ ఆ ప్రకటనను మొరటుగా పరిహసించింది. ట్రంప్‌ తర్కం ప్రకారం తాము కూడా కాలిఫోర్నియాను ఇరాన్‌ భూభాగంగా ప్రకటించగలం అని ఇరాన్‌ అధికారులు అన్నారు. “వాషింగ్టన్‌ ఇరాన్‌ రేవుల దిగ్బంధనం ఎత్తివేసేవరకు, ఆయిలుపై ఆంక్షలు ఎత్తివేసేవరకు, స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులు విడుదల చేసేవరకు, ప్రతి ఒక్క రంగంలోనూ మిలటరీ చర్యలు నిలుపు చేసేవరకు హార్ముజ్‌ జలసంధి మూసివేయబడే ఉంటుంది” అని పార్లమెంటు స్పీకర్‌ మొహమ్మద్‌ బకెర్‌ క్వాలిబఫ్‌ పార్లమెంటు సభ్యులకు చెప్పారు.

రెండు ప్రకటనలూ సత్యం కాబోవు. చెప్పుకునేదానికీ, వాస్తవికతకూ మధ్యనున్న దూరం ఇప్పుడు ఈ సంక్షోభంలో కేంద్రబిందువుగా ఉన్న వాస్తవం.

ట్రంప్‌ భౌగోళిక వాదనను మానసిక ఒత్తిడి తెచ్చేటటువంటి రాజకీయ ప్రదర్శనగా చూడాలి తప్ప ఆచరణకు నోచుకున్న క్లెయింగా కాదు. జలసంధిని స్వాధీనం చేసుకోవటం, భౌతికంగా దాన్ని నిర్వహించటం అమెరికా ఉద్దేశం అయినట్లు గంభీరమైన సూచన ఏదీ లేదు. ట్రంప్‌ సొంత అధికారులు సైతం జలసంధి ద్వారా సురక్షిత ప్రయాణాన్ని సుగమం చేసేందుకు నావికా దిగ్బంధనం గూర్చి మాట్లాడుతున్నారు.

అయితే హార్ముజ్‌ తమ భూభాగం అని వ్యూహాత్మక ప్రకటన చేయటంలో ట్రంప్‌ ఎత్తుగడ – జలసంధి ఇప్పటికే తెరుచుకుందని చెప్పటం ద్వారా దాని మూసివేతను నియంత్రించే అవకాశాన్ని ఇరాన్‌కు నిరాకరించటం, అదే సమయంలో మున్ముందు ఏదైనా విఘాతం జరిగినా అమెరికా ప్రకటిత భూభాగంపై ‘కవ్వింపు’గా చిత్రించే అవకాశాన్ని అట్టిపెట్టుకోవటం.

US-Iran war latest

ఇదిలా వుండగా, ఇరాన్‌ ఒమన్‌తో నేరుగా జలసంధి ద్వారా ఓడల రాకపోకలపై ఒక ఒప్పందం కుదుర్చుకుంది. వాషింగ్టన్‌కు ఏ మాత్రం అవకాశం కల్పించకుండా కొంత ట్రాఫిక్‌ పునరుద్ధరించటం ఇరాన్‌ ఉద్దేశం. తమ ఏర్పాటు బాటలోకి ప్రవేశిస్తే ఒమన్‌పై బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్‌ చేసిన హెచ్చరిక హార్ముజ్‌ తమ భూభాగం అంటూ ఆయన ప్రకటించటంలోని వాస్తవ ఆందోళనను వ్యక్తం చేస్తున్నది.

జలసంధి మూతపడి ఉండటం పట్ల ఆందోళన కన్నా, దాన్ని తెరిచే కథనంలో తమ కంట్రోలు చేజారుతున్నదనే భయం వాషింగ్టన్‌లో కనిపిస్తున్నది.

ఇదంతా కలిపి చూస్తే, ఇరుపక్షాలూ ఒప్పందం వైపు ప్రయాణించటం లేదు. అవి రెండూ హార్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు తమ సొంత నిర్ణయాల అమలుకై ప్రయత్నిస్తున్నాయి. దీనివల్ల సమీప భవిష్యత్తులో సాధారణ ట్రాఫిక్‌ పునరుద్ధరణ అసాధ్యమవుతున్నది.

దేశంలో రాజకీయ నేపథ్యం మసకబారుతుండగా ట్రంప్‌ దేశం వెలుపల ధీరత్వం ప్రదర్శిస్తున్నారు. రాయిటర్స్‌/ఐప్‌సోస్‌ పోల్‌ ప్రకారం ట్రంప్‌ ఆమోద రేటింగ్‌ ఈ వారంలో 33 శాతానికి తగ్గింది. అది ఆయన ఈ అధ్యక్ష పదవీకాలంలో అతితక్కువ. 64 శాతం మంది అమెరికన్‌లు ఆయన విధానాలు ఆమోదించటం లేదు. ఇరాన్‌ యుద్ధం త్వరలో పరిష్కారం కాబోదని ప్రతి ఐదుగురు అమెరికన్‌లలో దాదాపు నలుగురు భావిస్తున్నారు.

“కొద్ది వారాల్లో ముగుస్తుంది” అని ట్రంప్‌ వాగ్ధానం చేసిన యుద్ధం ఆరు నెల్లుగా కొనసాగుతూ ఉండటం గ్యాసోలిన్‌ ధరను గణనీయంగా పెంచింది. నవంబర్‌ మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపైన, కాంగ్రెస్‌ ఎన్నికల్లో పార్టీ అవకాశాలపైన భారంగా తయారైన సంఘర్షణపట్ల రిపబ్లికన్‌ వ్యూహకర్తలు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్‌ “అమెరికా కొత్త భూభాగం” ప్రకటన చేయటానికి ఇదీ నేపథ్యం. ఈ ప్రకటన టెహరాన్‌ కన్నా ఎక్కువగా అమెరికా ఓటర్లను ఉద్దేశించింది. ఇది ప్రకటనలతో పరిష్కారమయ్యే సమస్య కాదు.

ఏదో ఒక పక్షం వెనక్కు తగ్గాలి. ఆ పరిస్థితి కనిపించటం లేదు. యుద్ధం ప్రారంభించింది అమెరికా కాబట్టి ఇరాన్‌ సైనికంగా గట్టిగా ఎదుర్కొంటూనే తమ డిమాండ్లపై దృఢంగా ఉంది. అమెరికా సైనిక చర్యలకు సహాయపడితే దాడులు చేస్తామని గల్ఫ్‌ సహకార కౌన్సిల్‌ (బహరైన్‌, కువైట్‌, ఒమన్‌, కటార్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) దేశాలను ఇరాన్‌ హెచ్చరించటం దాని తెగింపును సూచిస్తుంది.

అమెరికా–ఇరాన్‌ల మధ్య చర్చలకు మధ్యవర్తులు కుదిర్చిన “మెమొరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌” కాలం గతించి పేరుకు తప్ప ఆచరణలో జీవంలేని కాగితంగా మారింది. అందువల్ల సమగ్రమైన పరిష్కారం జరగాలంటే యుద్ధరంగంలో లేదా ఆర్థిక రంగంలో నాటకీయమైన మలుపు సంభవించి ఒక పక్షం వెనక్కు తగ్గాలి.

లేదా అమెరికా–ఇరాన్‌లు తమ వాదోపవాదాలు కొనసాగించుకుంటూనే, ఒమన్‌–ఇరాన్‌ కుదుర్చుకున్న నౌకాయాన మార్గం ద్వారా ఆయిలు, ఇతర వాణిజ్య సరుకు ఓడల రవాణాను పాక్షికంగానైనా అనుమతించాలి. లేనట్లయితే ప్రపంచ ఇంధన ధరలు నిత్యం పెరుగుతూ ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అదీ ట్రంప్‌కే చేటు చేస్తుంది.

ప్రపంచంలో ఆయిలు దిగుమతుల్లో మూడవ అతిపెద్ద స్థితిలో ఉన్న భారత్‌ తన క్రూడ్‌ ఆయిలు అవసరాల్లో 88 శాతం దిగుమతులపై ఆధారపడి ఉంది. అందువల్ల గల్ఫ్‌ సంక్షోభం దెబ్బ నేరుగా తగులుతుంది. దాని దిగుమతుల్లో 40 శాతం, ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ దిగుమతుల్లో అత్యధికం హార్ముజ్‌ జలసంధి ద్వారానే జరగాలి. తమ కొనుగోలును 40 దేశాలకు విస్తృతం చేసినప్పటికీ నిత్యం టెన్షన్‌ తప్పదు.

ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆయిలు దిగుమతుల వల్ల పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ, దిగుమతుల వ్యయం భారీగా పెరుగుతున్నది. భారత్‌తో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇబ్బందుల పాల్జేస్తున్న ట్రంప్‌ చివరకు సాధించేది ఏమీ ఉండదు – పరాజయం లేదా పరాభవం తప్ప.

ట్యాగ్‌లు: Iran US war news