Skip to content
బిజినెస్ వార్తలు

ISRO: రాకెట్లు, ఉపగ్రహాల తయారీకి ఇస్రో గుడ్‌బై .. పరిశోధనలు, భవిష్యత్ మిషన్లపై దృష్టి సారించనున్న భారత అంతరిక్ష పరిశోధన దిగ్గజం..

jagan 22 Aug 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
ISRO: రాకెట్లు, ఉపగ్రహాల తయారీకి ఇస్రో గుడ్‌బై .. పరిశోధనలు, భవిష్యత్ మిషన్లపై దృష్టి సారించనున్న భారత అంతరిక్ష పరిశోధన దిగ్గజం..

ISRO

ISRO: ఇస్రో రాకెట్లు తయారు చేసే సంస్థ నుంచి అత్యాధునిక అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేసే సంస్థగా రూపాంతరం చెందుతుండగా, వాటి వాణిజ్య ఉత్పత్తి బాధ్యతలను ప్రైవేట్ రంగం చేపట్టే దిశగా భారత అంతరిక్ష రంగం కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది.

ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తన పని విధానంలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రాకెట్లు, ఉపగ్రహాల తయారీతో పాటు ప్రయోగాలకు సంబంధించిన అనేక కార్యకలాపాలను స్వయంగా నిర్వహించిన ఇస్రో.. ఇకపై తన ప్రధాన దృష్టిని పరిశోధన, అభివృద్ధి (R&D), అధునాతన అంతరిక్ష సాంకేతికతలు, శాస్త్రీయ ప్రయోగాలు, భవిష్యత్ మిషన్లపై కేంద్రీకరించనుంది. సాధారణంగా పెద్ద స్థాయిలో నిర్వహించే రాకెట్ల తయారీ వంటి పనులను ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) ఛైర్మన్ డాక్టర్ పవన్ గోయెంకా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ మార్పు దశలవారీగా అమలు కానుంది. అంతరిక్ష రంగంలో ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యాన్ని మరింత పెంచడం దీని ప్రధాన ఉద్దేశం.

ఈ ప్రక్రియలో ఇప్పటికే కీలక అడుగు పడింది. Small Satellite Launch Vehicle (SSLV) సాంకేతికత, ఉత్పత్తి హక్కులను బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా Hindustan Aeronautics Limited (HAL)కు అప్పగించారు. దీంతో SSLV తయారీ, వాణిజ్యపరమైన వినియోగంలో ప్రభుత్వ రంగ సంస్థకు కూడా కీలక పాత్ర లభించింది. అయితే తదుపరి దశలో మరింత భారీ రాకెట్ల తయారీలో ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

PSLV, LVM3 కూడా ప్రైవేట్ చేతుల్లోకి?

భారత్‌కు అత్యంత కీలకమైన రాకెట్లలో PSLV, LVM3 ఉన్నాయి. ఇప్పటివరకు వీటి రూపకల్పన, తయారీ, ప్రయోగ వ్యవస్థల్లో ఇస్రోకు ప్రధాన పాత్ర ఉంది. అయితే భవిష్యత్తులో వీటి ఉత్పత్తిని పూర్తిగా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇది అమల్లోకి వస్తే.. ఇస్రో స్వయంగా రాకెట్లను భారీ సంఖ్యలో తయారు చేసే సంస్థగా కాకుండా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే పరిశోధనా సంస్థగా మరింతగా మారే అవకాశం ఉంటుంది.

అంతరిక్ష ప్రయోగాల సంఖ్య పెంచడంతో పాటు ప్రైవేట్ రంగానికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కొత్త లాంచ్ సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే కొన్ని నెలల్లో కొత్త ప్రయోగ కేంద్రాన్ని నిర్వహించేందుకు ప్రైవేట్ ఆపరేటర్‌ను ఎంపిక చేసే ప్రక్రియ ముందుకు వెళ్లనుంది.

ప్రైవేట్ కంపెనీలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో ISRO ఇప్పటికే ముందడుగు వేసింది. ఇప్పటివరకు సుమారు 120 సాంకేతిక పరిజ్ఞానాలను ప్రైవేట్ రంగానికి బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా దేశీయ కంపెనీలు ఉపగ్రహాలు, ప్రయోగ వాహనాలు, అంతరిక్ష ఆధారిత సేవల రంగాల్లో తమ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది.

భారత అంతరిక్ష రంగాన్ని ప్రపంచ వాణిజ్య మార్కెట్లో మరింత బలమైన స్థాయికి తీసుకెళ్లడమే ఈ మార్పుల వెనుక ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సుమారు 8 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను 2033 నాటికి 44 బిలియన్ డాలర్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

మొత్తంగా చూసినట్లయితే.. ఇస్రో రాకెట్లు తయారు చేసే సంస్థ నుంచి అత్యాధునిక అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేసే సంస్థగా రూపాంతరం చెందుతుండగా, వాటి వాణిజ్య ఉత్పత్తి బాధ్యతలను ప్రైవేట్ రంగం చేపట్టే దిశగా భారత అంతరిక్ష రంగం కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది.