Skip to content
ప్రపంచం వార్తలు

అమెరికాలో డెమొక్రటిక్‌ సోషలిస్టులకు ఆదరణ

Prajapaksham 15 Aug 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
అమెరికాలో డెమొక్రటిక్‌ సోషలిస్టులకు ఆదరణ

అమెరికాలో డెమొక్రటిక్‌ సోషలిస్టులకు ఆదరణ

అమెరికాలో నవంబర్‌ మధ్యంతర ఎన్నికలు వేగంగా సమీపిస్తున్నాయి. యూఎస్‌ఏ కమ్యూనిస్టు పార్టీ జాతీయ కమిటీ జులై 11 తేదీల్లో జరిగింది. అది ఇచ్చిన పిలుపు: కాంగ్రెస్‌పై మాగా (MAGA) పట్టును బద్దలుకొట్టటానికి ఈ ఎన్నికల పోరాటంలో చేయగలిగిందంతా చేయాలి. పార్టీ సహాధ్యక్షుడు జోయి సిమ్స్‌ తమ ప్రసంగంలో ఇలా అన్నారు: “ఈ జాతీయ కమిటీ సమావేశం నవంబర్‌ మధ్యంతర ఎన్నికలపై కేంద్రీకరించాలి. అంతకన్నా ముఖ్యమైనదేదీ ఇప్పుడు పార్టీ ముందు, కార్మికవర్గం ముందు, అమెరికా ప్రజల ముందు లేదు. మాగా (మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌) శక్తులను ఓడించటం కోసం శాయశక్తులా కృషి చేయాలి. మీరు ఏమైనా చెప్పండి. అవి కార్మిక హక్కులు, పౌరహక్కులు, మహిళల హక్కులు, ఎల్‌జీబీటీక్యూ హక్కులు, పర్యావరణం, శాంతి, ప్రజాస్వామ్యం ఏదైనా కానీండి… రాజకీయ గాలి మారుతున్నది. ఈ రోజున ఎన్నికలు జరిగితే హౌస్‌లో జీఓపీ (రిపబ్లికన్‌ పార్టీ)ని ఓడించే అవకాశం 5 శాతం ఉన్నట్లు జనరిక్‌ బ్యాలెట్‌ సూచిస్తున్నది.

చలనం ప్రజాస్వామ్యం పక్షాన ఉన్నట్లు ఇప్పటివరకు జరిగిన ప్రైమరీలు సూచిస్తున్నాయి. సెనెట్‌ను రిపబ్లికన్‌ల నుంచి తీసుకోవటం కఠినమైన సవాలు కావచ్చు. అయితే న్యూయార్క్‌ సిటీ, కలరాడోలను డెమొక్రటిక్‌ సోషలిస్ట్స్‌ ఆఫ్‌ అమెరికా గెలుపొందటం కార్మికవర్గ ఓటర్లలో గాఢమైన రాడికలైజేషన్‌ జరుగుతున్నట్లు సూచిస్తున్నది” అని సిమ్స్‌ చెప్పారు. అయితే సిద్ధాంతరీత్యా, రాజకీయంగా, కార్యక్రమం రీత్యా చేయవలసింది ఎంతో ఉందని హెచ్చరిక చేశారు.

సీపీయూఎస్‌ఏ తెరచాటు నుంచి ఎన్నికల రంగంలోకి రావాలన్నది పదేపదే చెప్పే మాట. ఫిలడెల్ఫియాలో డోమ్‌ షన్నాన్‌, సీజర్‌ రూయిజ్‌ కాస్టిల్లా గెలుపొందటాన్ని ఉదహరిస్తూ, కొలంబస్‌, పియోరియా, కన్సాస్‌, బ్రూక్లిన్‌ల్లో వారు పార్టీ సభ్యులతోపాటు ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారని పార్టీ అధ్యక్షుడు సిమ్స్‌ చెప్పారు. “రన్‌ కామ్రేడ్‌ రన్‌! ఇనుము వేడిగా ఉన్నప్పుడే మనం దెబ్బకొట్టాలి. అంటే మనం మన సొంత రంగుల కింద పోటీ చేయాలి” అని ఆయన అన్నారు.

సీపీయూఎస్‌ఏ నుంచి అనేకమంది అభ్యర్థులు గత కొద్ది సంవత్సరాల్లో వివిధ ఎన్నికల్లో కమ్యూనిటీ ఆధారిత కూటములలో భాగంగా ఎన్నికైనారు. కమ్యూనిస్టు గుర్తింపును బాహాటపరచకుండా దశాబ్దాలుగా తీసుకుంటున్న జాగ్రత్త నుంచి బయటకు రావాలి. అది పార్టీ వృద్ధిని వెనక్కు లాగుతున్నది, చురుకుదనం తగ్గిస్తున్నది, పార్టీ చొరవను చంపుతున్నదని ఆయన చెప్పారు.

2025 మార్చిలో ‘యుగల్‌/కాటో ఇన్‌స్టిట్యూట్‌’ సర్వే ప్రకారం 30 ఏళ్లలోపు వయోజనుల్లో 62 శాతం సోషలిజం కోరుకుంటున్నారని, 34 శాతం కమ్యూనిజాన్ని ఇష్టపడుతున్నారని సిమ్స్‌ పేర్కొన్నారు. సోషలిస్టు ఉద్యమం పునరాగమనాన్ని ఇది సూచిస్తున్నదన్నారు. ‘జెన్‌ జీ లవ్స్‌ కమ్యూనిజం’ అన్న ఒక యువ కమ్యూనిస్టు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టును ఉదహరించారు. కో రోసన్న కాంబ్రాన్‌ రాజకీయ సమీక్షను ముగిస్తూ, ప్రజా ఉద్యమాలు, సీపీయూఎస్‌ఏ ప్రధాన పోరాటాల మధ్యలో ఉన్నాయని, వాటి పురోగతికి అవకాశాలున్నాయని చెప్పారు. “మనం ఇతర సంఘాలు, సంస్థలతో కలిసి పనిచేస్తూనే, వాస్తవానికి మనం ఎవరో వారికి తెలిసేటట్లు చేయాలి. మన తక్షణ సర్కిల్‌కు ఆవల సంబంధాలు కలిగి ఉండటం వల్ల మనపై దాడులు జరిగినపుడు పార్టీకి మిత్రులు ఉంటారు” అని ఆమె చెప్పారు.

డెమొక్రటిక్‌ సోషలిస్టులు

న్యూయార్క్‌: డెమొక్రటిక్‌ సోషలిస్ట్స్‌ ఆఫ్‌ అమెరికా (డీఎస్‌ఏ) ఇటీవల “కార్మికులు మరింతకు అర్హులు” అనే కొత్త వేదికను ఆమోదించారు. హౌస్‌ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ దీన్ని పదేపదే ఖండిస్తూ, డెమొక్రటిక్‌ సోషలిస్టుల “ఈ తాత్విక యుద్ధాన్ని ప్రపంచ చరిత్రలో మహాదేశమైన అమెరికాను కమ్యూనిజం వైపు తీసుకెళ్లే మరణమృదంగ చీకటి రహదారిలోకి” తీసుకెళ్లకుండా నిరోధించాలని అక్కసు వెళ్లగక్కారు. ఇంకా పలువురు ఈ వేదికను ‘రాజ్యాంగ వ్యతిరేకం’, ‘అమెరికా వ్యతిరేకం’, ‘అవమానకరం’, ‘ఖండనార్హం’గా ఖండించారు.

అధ్యక్ష పదవికి బెర్నీ సాండర్స్‌ తొలిసారి పోటీపడిన తదుపరి దశాబ్దంలో, ముఖ్యంగా న్యూయార్క్‌ సిటీ మేయర్‌గా జొహ్రాన్‌ మమ్దానీ ఎన్నికైన నాటి నుంచి అమెరికాలో రాజకీయ చర్చ మారిన తీరును ఇది వెల్లడిస్తున్నది.

నేడు అమెరికాలో శ్రామికశక్తిలో కనీసం మూడోవంతు మంది వారి ‘ఇష్టం ప్రకారం’ ఉద్యోగం చేస్తున్నారు. దీని అర్థం వారికి ఎటువంటి చట్టబద్ధ రక్షణ లేదు. ఉద్యోగులకు వేతనంతో కూడిన విరామ దినం ఇవ్వాలని యజమానులను లీగల్‌గా ఆదేశించని దేశం అభివృద్ధి చెందిన ప్రపంచంలో ఇదొక్కటే. వైద్య అత్యవసరాలు వైద్యబీమా ఉన్న అమెరికన్లను సైతం అప్పుల్లోకి నెడుతాయి. కాలేజీ చదువుకు వెళ్లటమంటే విద్యా రుణంతో అప్పులపాలు కావటమే. ఉద్యోగ మార్కెట్‌ మారటం అంటే తక్కువ వేతనాలతో కూడిన మధ్యస్థాయి ఉద్యోగాలు పొందటమే. పిల్లల పెంపకం బహుఖర్చుతో కూడినదైనందున అనేకమంది దంపతులు పిల్లలు వద్దనుకుంటారు లేదా ఎక్కువ పిల్లల్ని కోరుకోరు. అమెరికన్లలో చాలామందికి సొంత ఇల్లు లేదు, ఆ సంఖ్య పెరుగుతోంది. దాంతో అద్దె పెరుగుదల కొనసాగుతోంది.

“వర్కర్స్‌ మరింతకు అర్హులు” వేదిక ప్రకటించిన అనేక చర్యలు ఈ సమస్యలను నేరుగా ప్రస్తావిస్తున్నాయి. కార్మిక అనుకూల సంస్కరణలు సాధించటాన్ని కష్టతరం చేస్తున్న రాజకీయ వ్యవస్థలోని పలు అంశాలను కూడా డీఎస్‌ఏ వేదిక విమర్శిస్తున్నది. సోషలిజం నిర్మిస్తున్న సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన అనంతరం, పెట్టుబడిదారీ విధానం అంతాన్ని కోరుకునేవారు కూడా సోషలిజం భావనను ముందుకు తీసుకెళ్లటంలో ఇబ్బంది పడుతున్నారు.

డెమొక్రటిక్‌ పార్టీ నైరాశ్యం

వైట్‌ హౌస్‌ను డోనాల్డ్‌ ట్రంప్‌కు రెండవసారి అప్పగించిన తర్వాత డెమొక్రాట్లు ఎప్పటివలె రెండేళ్లుగా సాకులు వెదకటం, ఇతరులను నిందించటంలోనే ఉన్నారు. కాలేజీ క్యాంపస్‌లలో ఉన్న ప్రగతిశీల లెఫ్ట్‌, లాభరహిత గ్రూపులు మితవాదానికి వ్యతిరేకంగా తమవంతు కృషి చేస్తున్నారు. బెర్నీ సాండర్స్‌, ఆయన వెనుకనున్న ఉద్యమం డెమొక్రటిక్‌ రాజకీయాలు ముందుకు తీసుకెళ్లే మార్గాలు చూపుతున్నాయి. విభజనవాద, అస్తిత్వవాద రాజకీయాలు, ఇతరులను నిందించే రాజకీయాలు పక్కనబెట్టి ప్రజల జీవన సమస్యలను ముందుపెట్టాలని కోరుతున్నారు. అయితే వ్యవస్థాగత డెమొక్రాట్లు వారిని జాత్యహంకారులుగా, సెక్సిస్ట్‌ ‘బెర్నీ బ్రదర్స్‌’గా నిందిస్తున్నారు.

డెమొక్రటిక్‌ పార్టీ అధికారం కొరకు అతివాదులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. న్యూయార్క్‌లో ఇటీవల కాలంలో సోషలిస్టులు అనేక పదవులకు ఎన్నికైనారు. అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్‌, జొహ్రాన్‌ మమ్దానీ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులుగా ఆవిర్భవించారు.

న్యూయార్క్‌ మేయర్‌గా గత సంవత్సరం జొహ్రాన్‌ మమ్దానీ ఎన్నిక, ఏడు నెలల తర్వాత స్థిరపడిన అభ్యర్థులపై మరికొందరు సోషలిస్టుల ఎన్నికతో డెమొక్రటిక్‌ ఓటర్లలో ఏదో మార్పు జరుగుతున్నట్లు వెల్లడైంది. మిచిగన్‌ నుంచి సెనేట్‌ సీటుకోసం జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఇజ్రాయెల్‌ లాబీ బలపరిచిన, ధనం వెచ్చించిన హాలే స్టీవెన్స్‌పై వామపక్ష డెమొక్రాట్‌ అబ్దుల్‌ ఎల్‌ విజయం గత విజయాలకన్నా ప్రాధాన్యత సంతరించుకుంది. అతను రాజకీయాలకు కొత్త. మహిళలకు సంబంధించి పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా ఓటర్లు మార్పుకు ఓటు చేశారు.

బయటివారు ధనం వెచ్చించటంలో శ్రీమతి స్టీవెన్స్‌ 9:1 ఆధిక్యతలో ఉన్నప్పటికీ, స్వల్ప మెజారిటీతో అయినా సయీద్‌ గెలుపొందటం నవంబర్‌ ఎన్నికల పోరాటానికి సవాలు విసురుతున్నది. సెనేట్‌లో ఇది రిపబ్లికన్‌ సీటు. ఇది ట్రంప్‌ రెండు సార్లు గెలుచుకున్న రాష్ట్రం. 2024 ఎన్నికల్లో సోషలిస్టు అభ్యర్థి జమాల్‌ బౌమన్‌ ప్రత్యర్థి డబ్బు దెబ్బకు ఓడిపోయారు. ప్రముఖ డెమొక్రటిక్‌ పార్టీ నాయకులు చాలామంది ప్రత్యక్షంగా, పరోక్షంగా స్టీవెన్స్‌ను బలపరిచినా ఎల్‌ విజేత కావటం పెద్ద విశేషం.

ఎల్‌ అభ్యర్థిత్వానికి చరిత్ర సృష్టించే స్వభావం ఉంది. అతను అరబ్‌ అమెరికన్‌. ఇస్లామోఫోబియా, అరబ్‌ వ్యతిరేక జాత్యహంకారం పెచ్చరిల్లుతున్న సమయంలో సయీద్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నిక కాగలిగితే అమెరికా సెనేట్‌లో అతను తొలి ముస్లిం అవుతాడు. రిపబ్లికన్లు జాత్యహంకారం రెచ్చగొట్టేందుకుగాను ప్రస్తావన మాత్రంగా సయీద్‌ ముస్లిం మూలాన్ని ప్రచారంలో పెడుతున్నారు.

సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ రెండు ప్రచారాలు బలంగా వినబడతాయి. ఒకటి, ‘వామపక్షవాదుల ఓటమి తథ్యం’. రెండు, ‘ప్రత్యర్థులు పిచ్చిగా డబ్బు వెదజల్లుతారు’. అయితే సయీద్‌ ప్రైమరీ ఎన్నిక కొన్నిసార్లు డబ్బు పనిచేయదని రుజువు చేసింది.

ట్యాగ్‌లు: international news USA