ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా గొంతు నొక్కుతారా.. సినిమా ఎలా ఉంటుందో కూటమికి చూపిస్తానంటూ జగన్ మాస్ వార్నింగ్
YS Jagan Slams Government
శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తమ గొంతు నొక్కేందుకు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. శాసనసభను రెండేళ్లుగా బహిష్కరిస్తున్నప్పటికీ.. శాసనమండలిని వేదికగా చేసుకుని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను ఎండగట్టాలని ఆయన పార్టీ ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు.
ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బుధవారం నాడు ఆయన పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి రావాల్సిన ప్రతిపక్ష నేత హోదాను నిరాకరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. మండలిలో ఉన్న పార్టీ బలాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని ప్రజావాణిని వినిపించాలని స్పష్టం చేశారు. ప్రధాన పార్టీ అయిన వైసీపీకి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం ఇష్టపడటం లేదని, అందుకే ప్రజా సమస్యలను మీడియా ద్వారానే ప్రజల దృష్టికి తీసుకెళ్లి నాణేనికి మరోవైపు చూపిస్తానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
డీఎస్సీ భర్తీ ప్రక్రియలో జరిగిన అక్రమాలపై గత 74 రోజులుగా 10 రకాల నిరసనలు చేపట్టామని జగన్ గుర్తుచేశారు. పేపర్ లీకేజీ, ఔట్సోర్సింగ్ కుంభకోణాలు, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు, జీఓల మార్పులకు సంబంధించిన ఆధారాలను బహిర్గతం చేశామని.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రమేయంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అలాగే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాల బకాయిలు 13 త్రైమాసికాలుగా నిలిచిపోయాయని, ప్రభుత్వం కేవలం రూ. 2,900 కోట్లు మాత్రమే విడుదల చేసి మిగిలిన భారీ బకాయిలను పక్కనబెట్టిందని విమర్శించారు. రైతాంగానికి గిట్టుబాటు ధర లభించకపోవడం, పంటలకు నీరందక పోవడం, ఉచిత పంటల బీమాను నిలిపివేయడం వల్ల అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా సేవల ప్రైవేటీకరణ, పీపీపీ ప్రాజెక్టుల పేరుతో ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చే చర్యలను సభలో ప్రశ్నించాలని ఆదేశించారు. దిశ చట్టం రద్దు, బీసీ నేతలు చింతడ రవి, ముస్తఫాలపై అక్రమ కేసులు, జూనియర్ డాక్టర్ల సమ్మె, ఉద్యోగుల అసంతృప్తి వంటి అంశాలపై పూర్తి ఆధారాలతో శాసనమండలిలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని జగన్ పార్టీ ఎమ్మెల్సీలకు స్పష్టమైన కార్యాచరణను అందించారు.
- Strait of Hormuz Attack: హార్ముజ్ జలసంధిలో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు..
- US Measles Outbreak: అమెరికాలో మీజిల్స్ కలకలం.. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ 3,900కు చేరువైన కేసులు!
- సీపీఐ నేత గుజ్జుల ఈశ్వరయ్యను పరామర్శించిన సీపీఐ, బీఆర్ఎస్ నేతలు.. ప్రజా జీవితంలో మళ్లీ చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్ష..
- Bay of Bengal Dead Zone: బంగాళాఖాతంలో తగ్గుతున్న ఆక్సిజన్.. విశాఖ-కాకినాడ తీరాలకు ఎదురుగా ‘డెడ్ జోన్’.. కనుమరుగవుతున్న చేపలు..
- CEC Resignation Row: జ్ఞానేశ్ రాజీనామా వరకు కదలను.. ఢిల్లీ రోడ్డుపైనే బైఠాయించిన రాహుల్