EDITORIAL: త్రిపక్ష సంయుక్త రక్షణ ఒప్పందం పర్యవసానాలు
EDITORIAL: త్రిపక్ష సంయుక్త రక్షణ ఒప్పందం పర్యవసానాలు
శుక్రవారంనాడు ముస్లింల పవిత్రస్థలం మక్కాలో మూడు భిన్నమైన ముస్లిం రాజ్యాలు సౌదీ అరేబియా, టుర్కియె (టర్కీ), పాకిస్థాన్ సంతకాలు చేసిన త్రిపక్ష సంయుక్త రక్షణ ఒప్పందం ప్రభావవంతమైంది, పర్యవసానాలతో కూడినది. ఇది కేవలం ఆత్మరక్షణ ఒప్పందం మాత్రమేనని, ఏ మూడవ పక్షానికీ వ్యతిరేకంగా ఉద్దేశించింది కాదని సంతకందారులు చెబుతున్నప్పటికీ, ఆ ఒప్పందం కేవలం ‘కాగితం ఒప్పందం కాదు’. అయితే ఇప్పుడు దీని అవసరం ఎందుకు ఏర్పడిందీ, పర్యవసానాలేమిటన్నది నింపాదిగా, లోతుగా ఆలోచించదగిన అంశం.
సౌదీ యువరాజు, ప్రధాని మొహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, పాకిస్థాన్ ప్రధాని సెహబాజ్ షరీఫ్ ఏ రాజధాని నగరంలో కాకుండా మతవిశ్వాస ప్రదేశంలో ఒప్పందంపై సంతకాలు చేయటం వ్యూహాత్మకం. ఇది ఇరాన్‌కు పోటీగా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఉద్దేశించిన సాంప్రదాయక పొత్తు కాదని, ఇస్లామిక్ సంఘీభావం, ఉమ్మడి సమష్టి రక్షణ ధ్యేయంతో కూడిన చర్యగా తమతమ దేశాల్లో, ప్రాంతీయంగా ప్రచారం చేసుకోవటానికి వీలుగా సంతకాలకు మక్కాను ఎంచుకున్నారు.
ఇందులో ప్రధానమైన అంశం “ఒప్పంద భాగస్వాముల్లోని ఏ ఒక్క దేశంపై ఎవరు దాడి చేసినా అందరిపై దాడిగా పరిగణించబడుతుంది” అనే సూత్రీకరణ. ఈ రకమైన భాష సాధారణంగా నాటో ఒడంబడిక ఆర్టికల్ 5లో ఉంది. ఇది “ఇస్లామిక్ నాటో”, “సున్నీ నాటో” అనే వ్యాఖ్యలు వెనువెంటనే వచ్చాయి.
ఈ మూడు “సున్నీ” దేశాల్లో సౌదీ అరేబియా గల్ఫ్‌లో ఆర్థికంగా శక్తివంతమైంది, టర్కీ నాటోలో రెండవ పెద్ద సైనిక శక్తి, పాకిస్థాన్ దక్షిణాసియాలో అణ్వాయుధం కలిగిన దేశం. దోహాలో హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ దాడి చేసిన అనంతరం 2025 సెప్టెంబర్‌లో సౌదీ అరేబియా మధ్య కుదిరిన ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం పొడిగింపు తాజా త్రిపక్ష ఒప్పందం అనవచ్చు. ఈ ఒప్పందంలో ఇతర ప్రాంతీయ రాజ్యాలు చేరవచ్చునని టుర్కియె అధికారులు అంటున్నారు.
ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఈ ఒప్పందాన్ని వేగిరపరిచిందనవచ్చు. ఐదు మాసాలు గడిచినా అమెరికా ఇరాన్ మెడలు వంచలేకపోయింది. పర్యవసానంగా ఇరాన్ తన ప్రతీకార దాడులను గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై, సౌదీ తదితర దాని మిత్ర రాజ్యాలపై ఎక్కుపెట్టింది.
అమెరికా ప్రతిఘటన కొరవడటంతో దాని సైనిక అండపై ఆధారపడిన గల్ఫ్ దేశాల్లో అమెరికాపై నమ్మకం సన్నగిల్లింది. సౌదీతో పౌర అణుశక్తి ఒప్పందం కుదుర్చుకున్న అధ్యక్షుడు ట్రంప్, దానిపై సిరా ఆరకముందే, అబ్రహం ఒప్పందాలను (ఇజ్రాయెల్‌తో సహజీవనం) రియాద్ అంగీకరిస్తేనే అణుశక్తి సహకార ఒప్పందం అమలు జరుగుతుందని ప్రకటించి సౌదీ పాలకులను దిగ్భ్రాంతి పరిచారు.
మరోవైపున, సౌదీ శాంతి ఒప్పందం విఫలం కావటం. కొద్దిరోజులముందు, ఇరాన్ అండకలిగిన హౌతీ దళాలు ఎమెన్ ప్రభుత్వ సైనికులను పెద్దసంఖ్యలో చంపాయి. జిజాన్, యాండుల్లో సౌదీకి చెందిన అరాంకో ఆయిల్ వసతులపై మిస్సైళ్లు, డ్రోన్లు ప్రయోగించాయి.
పాకిస్థాన్‌కు సంబంధించి అది ఫిబ్రవరి నుంచీ అప్ఘానిస్థాన్‌తో సరిహద్దు పోరాటం సాగిస్తోంది. 2025 మే నెలలో భారత్‌తో దాదాపు యుద్ధం దశకు పరిస్థితులు క్షీణించాయి.
టర్కీకి సంబంధించి అత్యంత బలమైన సాంప్రదాయక సైనిక శక్తిగా ముస్లిం ప్రపంచంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవచ్చు. ఆయుధ వ్యాపారం పెంచుకోవచ్చు. రియాద్, ఇస్లామాబాద్‌లతో ఆర్థిక సంబంధాలు వృద్ధి చెందుతాయని అంకారా ఆశిస్తోంది.
ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలున్నట్లు భావిస్తున్న తరుణంలో అణ్వస్త్ర దేశమైన పాకిస్థాన్ కౌంటర్ వెయిట్‌గా గల్ఫ్‌లోకి ప్రవేశించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా బలాన్ని సమతులనపరచటం, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ శక్తిని నిర్మించటం ఈ ఒప్పందం తక్షణ ప్రయోజనంగా కనిపిస్తున్నది.
ఈ ఒప్పందం సౌదీ అరేబియాకు భద్రత చేకూర్చదని “షియా” ఇరాన్ వ్యాఖ్యానించింది. ఇన్ని సంవత్సరాలు అమెరికాపై ఆధారపడటం భద్రత కలిగించిందా అని ప్రశ్నించింది. రక్షణకోసం మీ విధానాలు సంస్కరించుకోండి అని పరోక్ష సలహా ఇచ్చింది. అంటే హౌతీలు, ఇరాకీ మిలీషియా ద్వారా సౌదీపై ఒత్తిడి కొనసాగుతుందని హెచ్చరిక చేసింది.
కాగా, గాజా, సిరియాలపై టర్కీ మధ్య ఘర్షణ పెరుగుతున్న దశలో ఈ ఒప్పందం నెతన్యాహూకు గట్టి హెచ్చరిక అవుతుంది. అంతేగాక ఇరాన్ ఇతర మిత్రులకు వ్యతిరేకంగా, గాజాపై దాడులకు దిగేముందు ఇజ్రాయెల్ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి రావచ్చు. అబ్రహం ఒప్పందాలను ఆమోదించాలన్న అమెరికా ఒత్తిడి నుంచి సౌదీ అరేబియా దూరం జరగవచ్చు.
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గత సంవత్సరం సౌదీ రక్షణ ఒప్పందంనాడు స్పందించినట్లే ఇప్పుడు కూడా ఈ పరిణామాన్ని “జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం” అని వ్యాఖ్యానించింది. మన దేశ ఇంధన అవసరాలకు, ప్రవాస ఉద్యోగాలకూ సౌదీ భారత్‌కు కీలకం.
అలాగే 2025 మే నెలలో పాకిస్థాన్‌తో సరిహద్దు ఘర్షణల సమయంలో టర్కీ భారత్ వ్యతిరేక వైఖరి తీసుకుంది. అందువల్ల ఈ తాజా త్రైపాక్షిక రక్షణ ఒప్పందం భారత్ రక్షణ ఎస్టాబ్లిష్‌మెంట్‌ను తప్పక అప్రమత్తం చేస్తుంది.