Skip to content
క్రైమ్ వార్తలు

కువైట్ పేరుతో నకిలీ వీసాల దందా.. ఎయిర్‌లైన్ నిర్లక్ష్యంపైనా విచారణ.. 39 మందిపై కేసు

Prajapaksham 09 Aug 2026 0 నిమిషాల పఠనం క్రైమ్
కువైట్ పేరుతో నకిలీ వీసాల దందా.. ఎయిర్‌లైన్ నిర్లక్ష్యంపైనా విచారణ.. 39 మందిపై కేసు

కువైట్ పేరుతో నకిలీ వీసాల దందా.. ఎయిర్‌లైన్ నిర్లక్ష్యంపైనా విచారణ.. 39 మందిపై కేసు

కువైట్‌కు వెళ్లే మహిళా ప్రయాణికులను టార్గెట్‌గా చేసుకుని నకిలీ వీసాలతో విదేశాలకు పంపేందుకు ప్రయత్నించిన వ్యవహారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుగులోకి వచ్చింది.

ఈసీఆర్ పాస్‌పోర్టులు కలిగిన మహిళల కువైట్ వీసాల్లో అక్రమ మార్పులు చేసి, నకిలీ పత్రాలతో ప్రయాణానికి ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు 20 మంది ప్రయాణికులతో పాటు 19 మంది ఏజెంట్లపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. రాత్రి విధుల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ అధికారులు కువైట్ వెళ్లేందుకు ఒమన్ మీదుగా ప్రయాణించాల్సిన మహిళా ప్రయాణికుల పత్రాలను పరిశీలించారు. వారు డబ్ల్యూవై236 విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు.

అయితే, వారి వద్ద ఉన్న కువైట్ వీసా పత్రాలపై అనుమానం రావడంతో అధికారులు వాటిని తనిఖీ చేశారు. వీసా పత్రాలను పరిశీలించగా, ఎంప్లాయ్‌మెంట్ కేటగిరీని విజిట్‌గా మార్చి నకిలీ పత్రాలు రూపొందించినట్లు గుర్తించారు.

అధికారిక కువైట్ వీసా యాప్‌లో అదే వివరాలు, ఆధారాలతో పరిశీలించగా అసలు వీసాలు డొమెస్టిక్ వర్క్ వీసాగా ఉన్నట్లు తేలింది. ఈసీఆర్ పాస్‌పోర్ట్‌దారులకు ఉద్యోగ వీసాలపై వర్తించే తప్పనిసరి పీఓఈ నిబంధనలను తప్పించుకునేందుకే వీసా కేటగిరీని మార్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

అంతేకాకుండా, ఆయా పాస్‌పోర్టులపై కువైట్ వీసా స్టాంప్‌లో ‘జాయింట్ ఫ్యామిలీ’, ‘నాట్ పర్మిటెడ్ టూ వర్క్’ వంటి ఎండార్స్‌మెంట్లు ఏజెంట్లు జతచేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ వ్యవహారంలో పలువురు ఏజెంట్లు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 19 మంది ఏజెంట్ల పేర్లు ఫిర్యాదులో నమోదయ్యాయి. వీరిలో కొందరు విదేశాల్లో ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ప్రయాణికుల నుంచి పత్రాలు సేకరించడం, వీసా మార్పులు చేయించడం, ప్రయాణ ఏర్పాట్లు చేయడం వంటి అంశాల్లో ఎవరి పాత్ర ఎంతమేర ఉందన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఎయిర్‌లైన్ తీరుపైనా అనుమానాలు..

ప్రయాణికుల వద్ద ఉన్న వీసా పత్రాలను పరిశీలించకుండా ఎయిర్‌లైన్ బోర్డింగ్ పాస్‌లు జారీ చేయడంపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఈ అంశంపై సంబంధిత ఎయిర్‌లైన్ నుంచి కూడా పోలీసులు వివరణ తీసుకున్నారు.

ఏజెంట్లతో ఎయిర్‌లైన్ సిబ్బందికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? నిబంధనలకు విరుద్ధంగా బోర్డింగ్ పాస్‌లు ఎలా జారీ అయ్యాయి? అనే కోణాల్లోనూ దర్యాప్తు చేయనున్నారు.

నకిలీ వీసాల తయారీ వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్, ఏజెంట్లకు ప్రయాణికులతో ఉన్న సంబంధాలు, వీసా పత్రాల్లో మార్పులు ఎక్కడ జరిగాయి, ఎయిర్‌లైన్ తనిఖీల్లో ఎలా తప్పించుకున్నారు వంటి అంశాలపై సీసీఎస్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్‌లు: Crime Hyderabad news Telangana