Skip to content
జాతీయం వార్తలు

‘డూ ఆర్‌ డై’ నినాదంతో క్విట్‌ ఇండియా ఉద్యమం

Prajapaksham 08 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
‘డూ ఆర్‌ డై’ నినాదంతో క్విట్‌ ఇండియా ఉద్యమం

Quit India Movement

(08 ఆగస్టు ‘క్విట్‌ ఇండియా ఉద్యమ’ దినం సందర్భంగా)

2వ ప్రపంచ యుద్ధం ఒకవైపు భారత స్వాతంత్య్ర పోరాటం మరో వైపు ఉన్నత స్థాయిలో జరుగుతున్న రోజులవి. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 08, ఆగష్టు 1942 రోజున బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్‌ తీసుకున్న తీర్మానం ప్రకారం క్విట్‌ ఇండియా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. ఆగష్టు ఉద్యమం లేదా ఆగష్టు క్రాంతి లేదా ‘భారత్‌ ఛోడో ఆందోళన్‌’ అనే పేర్లతో కూడా క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని నినాదాలుగా పిలిచారు. క్విట్‌ ఇండియా అంటూ మహాత్మాగాంధీ బ్రిటీష్‌ పాలకుల గుండెలు అదిరే విధంగా గళమెత్తడమే కాకుండా స్వాతంత్య్ర సాధనకు డూ ఆర్‌ డై (సాధించు లేదా మరణిం చు) అంటూ సామాన్య ప్రజల్లో స్వాతంత్య్ర జ్వాల లు రగల్చగలిగారు. పట్టణాలు, పల్లె ప్రజలు కూడా క్విట్‌ ఇండి యా అంటూ అహింసాయుత బాటలో ముక్త కంఠంతో గొంతులు ఎత్తడంతో వలస పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ప్రారంభమైంది. క్రిప్స్‌ మిషన్‌ వైఫల్యం, భారతీయుల్ని అమానవీయంగా చూడడం, ఈస్ట్‌ బెంగాల్‌ ప్రాంతంలో తీవ్ర అస్థిరత, దేశవ్యాప్తంగా ఆకలి పోరాటాలు, వలస పాలకులు పాలనపై అపనమ్మకం లాంటి పలు కారణాలు కూడా క్విట్‌ ఇండియా ఉద్యమానికి ఆజ్యం పోశాయి.
క్విట్‌ ఇండియా ఉద్యమానికి ప్రధాన నినాదంగా డూ ఆర్‌ డై అనే స్వాతంత్య్ర రెండు పదాల మంత్రం భారతదేశవ్యాప్తంగా వ్యాపించిన వేళ స్వాతంత్య్ర సమరయోధులతో పాటు ఇతర పెద్దలు, విద్యార్థులు, యువత, మహిళలు సహితం పోరాటానికి గళం కలిపి దేశ ఐక్యతను చాటడంతో తెల్ల తోలు పాలకులు భయకంపితులు కావడం జరిగింది. ఈ పోరాటాన్ని అణచి వేయడానికి పోలీస్‌ బలగా లు రంగ ప్రవేశం చేసి పలువురు ప్రముఖ నాయకులను అరెస్టు చేయడం జరిగింది. పౌర సహాయనిరాకరణ, పౌరుల్లో ధైర్యం, ప్రజల త్యాగం, దేశ స్వాతంత్య్ర భావనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పౌర సమాజ భాగస్వామ్యం ప్రజాస్వామ్య పరిరక్షణ, దేశ సార్వభౌమాధికారం, దేశభక్తి, రేపటి యువతరం ప్రేరణ, పెద్ద ఎత్తున నిరసనలు జరగడానికి క్విట్‌ ఇండియా స్ఫూర్తి పనిచేసింది. 1947లో స్వాతంత్య్రం రావడానికి క్విట్‌ ఇండియా ఉద్యమ ఘట్టం ప్రధాన కారణంగా నిలిచింది.
08 ఆగస్టు రోజున పాటిస్తున్న క్విట్‌ ఇండియా ఉద్యమ దినంలో భాగంగా విద్యాలయాల్లో అవగాహనలు, రేపటి తరానికి ప్రేరణాత్మక కార్యక్రమాలు, క్విజ్‌-పోస్టర్‌ -ఉపన్యాస పోటీలు, పోరాటానికి సంబంధించిన సినిమాల ప్రదర్శనలు, చర్చలు, పోరులో అమరత్వ పొందిన వారికి నివాళులు అర్పించడం, సాంస్కృతిక పోటీలు, సామాజిక మాద్యమ ప్రచారాలు, ప్రభుత్వ సంస్థల కార్యక్రమాలు లాంటివి నిర్వహించవచ్చు. వీర మరణమో లేదా స్వాతంత్య్ర సాధనో జరిగే వరకు ఈ పోరాటం ఆగదని బ్రిటీష్‌ పాలకులకు స్పష్టం చేయగలిగిన క్విట్‌ ఇండియా ఉద్యమం భారత దేశ స్వేచ్ఛా పోరులో ఒక ప్రధాన ఘట్టంగా నిలవడం జరిగింది.

ట్యాగ్‌లు: Congress freedom fighters national