Skip to content
జాతీయం వార్తలు

ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు అవసరం

Prajapaksham 08 Aug 2026 0 నిమిషాల పఠనం జాతీయం
ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు అవసరం

ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు అవసరం

విద్య వ్యక్తిగత పురోగతికే కాదు, సామాజిక న్యాయాన్ని సాధించే అత్యంత ప్రభావవంతమైన సాధనం. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విద్యను సామాజిక విముక్తికి ఆయుధంగా భావించారు. స్వాతంత్య్రం వచ్చి దాదా పు ఎనిమిది దశాబ్దాలు గడిచినా ఉన్నత విద్యలో సమాన అవకాశాల లక్ష్యం ఇంకా పూర్తిగా సాకారం కాలేదు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఇబిసి వర్గాలకు రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ, ఉన్నత విద్యలో పెరుగుతున్న ప్రైవేట్‌ రంగం మాత్రం ఈ బాధ్యత నుంచి దాదాపు మినహాయింపును పొందుతోంది. ఫలితంగా సామాజిక న్యాయం అసంపూర్ణంగా మిగులుతోంది.

రాజ్యాంగం కల్పించిన సమానత్వం అంటే అందరికీ ఒకే అవకాశాన్ని ప్రకటించడం కాదు… చారిత్రకంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించి వారిని సమాన స్థాయికి తీసుకురావడం కూడా. అందుకే రిజర్వేషన్లు దయాదాక్షిణ్యాల ఫలితం కాదు. రాజ్యాంగబద్ధమైన హక్కు. అయితే అవి ప్రభుత్వ విద్యాసంస్థలకే పరిమితమైతే, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటి అసలు లక్ష్యం నెరవేరదు.

ఇంజినీరింగ్‌, వైద్యం, మేనేజ్‌మెంట్‌, న్యాయశాస్త్రం వంటి అనేక రంగాల్లో ప్రభుత్వ సీట్ల కంటే ప్రైవేట్‌ సీట్లే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం లభించని విద్యార్థులకు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలే ప్రత్యామ్నాయంగా మారాయి. అలాంటి పరిస్థితిలో రిజర్వేషన్లు ప్రభుత్వ రంగానికే పరిమితం కావడం వల్ల వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య మరింత దూరమవుతోంది.

ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు పూర్తిగా ప్రైవేట్‌ వ్యవస్థలుగా చెప్పలేం. ప్రభుత్వ గుర్తింపు, చట్టబద్ధ అనుమతులు, భూముల కేటాయింపు, పన్ను రాయితీలు వంటి అనేక ప్రజావనరుల ఆధారంగానే అవి అభివృద్ధి చెందుతున్నా యి. ప్రజా ప్రయోజనాలతో నడిచే సంస్థలు సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించాలి. విద్యను కేవలం వ్యాపారంగా కాకుండా ప్రజా సేవగా చూడాల్సిన బాధ్యత వాటిపైనా ఉంటుంది.

రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు తరచు గా ‘మెరిట్‌ దెబ్బతింటుంది’ అనే వాదనను ముందుకు తెస్తారు. కానీ మెరిట్‌ను కేవలం పరీక్ష మార్కులతో కొలవడం సరైన ప్రమాణం కాదు. అత్యుత్తమ పాఠశాలలు, ఖరీదైన కోచింగ్‌, సమృద్ధిగా విద్యా వనరులు అందుబాటులో ఉన్న విద్యార్థి సాధించిన మార్కులను, కనీస సౌకర్యాలు కూడా లేని గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థి మార్కులతో పోల్చలేం. అవకాశాల్లో ఉన్న అసమానతను విస్మరించి మెరిట్‌ గురించి మాట్లాడటం వాస్తవాన్ని నిరాకరించడమే.

రిజర్వేషన్లు ప్రతిభకు అడ్డంకి కావు. అవకాశాల లోటును భర్తీ చేసే సాధనం. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఐఐటిలు, ఐఐఎంలు, కేంద్ర విద్యాసంస్థ ల్లో దశాబ్దాలుగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అక్కడి నుంచి వేలాది మంది వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, పరిపాలనాధికారులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి రిజర్వేషన్లు నాణ్యతను దెబ్బతీస్తాయనే వాదనకు బలమైన ఆధారాలు లేవు.

అయితే రిజర్వేషన్ల తో మాత్రమే సమస్య పరిష్కారం కాదు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అధిక ఫీజులు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. అందువల్ల ఫీజు రాయితీలు, స్కాలర్‌షిప్‌లు, హాస్టల్‌ సదుపాయాలు, విద్యా రుణాల భరోసా వంటి సహాయక చర్యలు కూడా సమాంతరంగా అమలు కావాలి. ప్రవేశం కల్పించడం ఎంత ముఖ్యమో, చదువు పూర్తిచేసే పరిస్థితులు కల్పించడం కూడా అంతే అవసరం.

భిన్న సామాజిక నేపథ్యాల విద్యార్థులు కలిసి చదివే విద్యాసంస్థలు సమాజంలో పరస్పర అవగాహనను పెంచుతాయి. కుల, వర్గ, ప్రాంత, ఆర్థిక విభేదాలను తగ్గించి సమ్మిళిత సమాజ నిర్మాణానికి దోహదపడతాయి. అదే సమయంలో దేశ అభివృద్ధికి అవసరమైన మానవ వనరులను కూడా విస్తృతంగా తీర్చిదిద్దుతాయి.

ఉన్నత విద్యలో ప్రైవేట్‌ రంగం ఆధిపత్యం పెరుగుతున్న ఈ దశలో, రిజర్వేషన్లను ప్రభుత్వ విద్యాసంస్థలకే పరిమితం చేయడం సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధం. విద్యాసంస్థల స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తూనే, పారదర్శక విధానాల ద్వారా ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఇబిసి రిజర్వేషన్లను అమలు చేసే చట్టపరమైన వ్యవస్థను రూపొందించడం ప్రభుత్వాల బాధ్యత. విద్య కొద్దిమందికి మాత్రమే పరిమితమయ్యే ప్రత్యేక హక్కు కాకుండా, ప్రతి ప్రతిభావంతుడికి అందుబాటులో ఉండే అవకాశం కావాలంటే ఈ సంస్కరణ ఇక ఆలస్యం చేయలేని అవసరం.

ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఇబిసి రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేదు. ఎందుకంటే, రాజ్యాంగం ఇప్పటికే ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే, రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల అది ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. 2005 లో తీసుకొచ్చిన 93వ రాజ్యాంగ సవరణ ద్వారా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు, ఎస్‌సిలు, ఎస్‌టిలకు ప్రైవేట్‌ విద్యాసంస్థ ల్లో కూడా ప్రత్యేక అవకాశాలు కల్పించే అధికారాన్ని రాజ్యాంగం ఇచ్చింది. అయితే మైనారిటీలు నిర్వహించే విద్యాసంస్థలకు ఈ నిబంధన వర్తించదు.

అనంతరం 2008లో అశోక కుమార్‌ ఠాకూర్‌ కేసులో సుప్రీంకోర్టు ఈ నిబంధన రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. 2011, 2013 తీర్పుల్లో కూడా ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో రిజర్వేషన్లకు చట్టపరమైన అడ్డంకి లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంటే చట్టపరంగా మార్గం సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయలేదు.

ప్రస్తుతం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు రిజర్వేషన్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి. కానీ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు ఈ పరిధికి దాదాపు బయటే ఉన్నాయి. దీంతో ఉన్నత విద్యా వ్యవస్థలో రెండు వేర్వేరు ప్రపంచాలు ఏర్పడ్డాయి. ఒకవైపు పరిమిత నిధులతో, సామాజిక ప్రాతినిధ్యాన్ని కల్పించే ప్రభుత్వ విద్యాసంస్థలు ఉండగా, మరోవైపు అధిక ఫీజులు, మెరుగైన మౌలిక వసతులతో, ప్రధానంగా ఆర్థికంగా, సామాజికంగా బలమైన వర్గాల ఆధిపత్యం ఉన్న ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఉన్నాయి. ఫలితంగా విద్యలో అవకాశాల అసమానత మరింత పెరుగుతోంది.

మనదేశంలో ఉన్నత విద్య కు డిమాండ్‌ గత కొన్ని దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. 1960 తో పోలిస్తే 2018 నాటికి విశ్వవిద్యాలయాల సంఖ్య దాదాపు పది రెట్లు, అదే విధంగా స్థూల నమోదు నిష్పత్తి రెండున్నర రెట్లకు పైగా పెరిగింది. ముఖ్యంగా ఎస్‌సిలు, ఎస్‌టిలు, బిసిలు, ముస్లింలు, మహిళల్లో ఉన్నత విద్యపై ఆసక్తి గణనీయంగా పెరిగింది. సామాజికంగా వెనుకబడిన వర్గాలు విద్య ద్వారానే ఆర్థిక, సామాజిక పురోగతి సాధించవచ్చనే అవగాహన ఏర్పడడమే ఇందుకు ప్రధాన కారణం.

అయితే ఈ పెరుగుతున్న డిమాండ్‌ను ప్రధానంగా ప్రైవేట్‌ రంగమే తీర్చడం ప్రారంభించింది. 2015 నుంచి 2024 మధ్య ప్రైవేట్‌, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల సంఖ్య 276 నుంచి 523కు పెరిగింది. 2021 నాటికి దేశంలోని మొత్తం విశ్వవిద్యాలయాల్లో సుమారు నాలుగో వంతు ప్రైవేట్‌ రంగానికి చెందినవే. డిగ్రీ స్థాయిలో చదువుతున్న విద్యార్థుల్లో దాదాపు 45 శాతం మంది ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లోనే చేరుతున్నారు. అంటే ఉన్నత విద్యలో ప్రైవేట్‌ రంగం ప్రభావం నిరంతరం పెరుగుతోంది.

ఈ నేపథ్యం లో రిజర్వేషన్లు ప్రభుత్వ విద్యాసంస్థలకే పరిమితం కావడం వల్ల రాజ్యాంగం లక్ష్యంగా పెట్టుకున్న సామాజిక న్యాయం బలహీనపడుతోంది. ఆల్‌ ఇండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఎఐఎస్‌హెచ్‌ఇ) 2021 గణాంకాలు ఈ అసమానతను స్పష్టంగా చూపిస్తున్నా యి. దేశ జనాభాలో సుమారు 20 శాతం ఉన్న అగ్రవర్ణ హిందువులు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో 60 శాతానికి పైగా ఉన్నారని స్పష్టమవుతున్నది. మరోవైపు జనాభాలో దాదాపు 17 శాతం ఉన్న ఎస్‌సిల ప్రాతినిధ్యం కేవలం 6.8 శాతం మాత్రమే. 9 శాతానికిపైగా జనాభా ఉన్న ఎస్‌టిలు కేవలం 3.6 శాతంతో పరిమితమయ్యారు. జనాభాలో దాదాపు సగం ఉన్న బిసిలు 24.9 శాతం మాత్రమే. ముస్లింల ప్రాతినిధ్యం కూడా వారి జనాభా నిష్పత్తితో పోలిస్తే చాలా తక్కువగా ఉంది.

అదే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎస్‌సిలు, ఎస్‌టిలు, బిసిల ప్రాతినిధ్యం గణనీయంగా ఎక్కువగా కనిపించడం రిజర్వేషన్‌ విధానం ప్రభావాన్ని సూచిస్తోంది. ఈ పరిస్థితి విద్యలో అసమానతను సృష్టిస్తున్నది. సమాజంలో అవకాశాల పంపిణీని ప్రభావి తం చేస్తోంది. మెరుగైన విద్యా వనరులు, పరిశోధనా సదుపాయాలు, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం తగ్గడం వల్ల సామాజిక చలనం కూడా పరిమితమవుతోంది.

మరోవైపు ప్రభుత్వ విద్యాసంస్థలపై విద్యార్థుల ఒత్తిడి పెరుగుతుండగా, వాటికి తగిన నిధులు అందకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. ఈ అంశంలో జాతీయ విద్యా విధానం కూడా మౌనం పాటించిం ది. విద్యా సంస్కరణల గురించి విస్తృతంగా ప్రస్తావించినప్పటికీ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. వివిధ రాజకీయ పార్టీల నుంచి సానుకూల స్పందన ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి చర్యలు ప్రారంభం కాలేదు. చట్టపరమైన అవకాశం ఉన్నా, రాజకీయ సంకల్పం లేకపోతే రాజ్యాంగ హామీలు కాగితాలకే పరిమితమవుతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రైవేట్‌ ఉన్నత విద్యలో రిజర్వేషన్లు అమలు చేయడం ఒక రాజకీయ నిర్ణయమనే పరిధి కి పరిమితం చేయడం న్యాయం కాదు. రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక న్యాయ లక్ష్యాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి అవసరమైన సంస్కరణగా దీనిని చూడాలి. ఉన్నత విద్యలో ప్రైవేట్‌ రంగం వేగంగా విస్తరిస్తున్న సమయంలో, సామాజిక న్యాయాన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకే పరిమితం చేస్తే రాజ్యాంగం ఉద్దేశించిన సమాన అవకాశాలు నెరవేరవు. అందువల్ల చట్టపరమైన మద్దతును కార్యాచరణగా మార్చి, నాణ్యమైన ఉన్నత విద్య ప్రతి సామాజిక వర్గానికీ అందుబాటులో ఉండేలా చేయడం కేంద్ర ప్రభుత్వ కీలక బాధ్యత.