Metabolic Health Crisis: భారత్‌లో మెటబాలిక్ హెల్త్ సంక్షోభం.. ఆహారం, జీవనశైలిపై ఏఐజీ డాక్టర్లు కీలక హెచ్చరిక..
Doctor Health Checkup
Metabolic Health Crisis: ఇండియాలో మధుమేహం, ఊబకాయం, ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు వంటి మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని ఏఐజీ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చునే జీవనశైలి, తగినంత నిద్ర లేకపోవడం వంటి అంశాలే దీనికి ప్రధాన కారణమని వారు సూచిస్తున్నారు.
Metabolic Health Crisis: దేశంలో వేగంగా మారుతున్న ఆహారపు అలవాట్లు, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం, శారీరక శ్రమ తగ్గిపోవడం, మానసిక ఒత్తిడి పెరగడం వల్ల భారత్ తీవ్ర మెటబాలిక్ హెల్త్ క్రైసిస్ ను ఎదుర్కొంటోందని ఏఐజీ (AIG) హాస్పిటల్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి ఊబకాయం, ఫ్యాటీ లివర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారుతోందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య వేగంగా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏఐజీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, సెంటర్ ఫర్ ఒబెసిటీ అండ్ మెటబాలిక్ థెరపీ డైరెక్టర్ డాక్టర్ కలపాల మాట్లాడుతూ.. స్థూలకాయాన్ని కేవలం అధిక బరువుగా కాకుండా శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేసే దీర్ఘకాలిక జీవక్రియ వ్యాధిగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఒకసారి మెటబాలిజం దెబ్బతింటే కాలేయం, గుండె, కిడ్నీలు, హార్మోన్ల వ్యవస్థతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.
ప్రస్తుతం చాలా మంది తీసుకుంటున్న ఆహారంలో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, అధిక చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్లు, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషకాలు తక్కువగా ఉండటంతో శరీరానికి అవసరమైన సమతుల పోషణ అందడం లేదన్నారు.
ఇలాంటి ఆహారం త్వరగా ఆకలి తీర్చకపోవడంతో పదే పదే తినాలనే కోరిక (Cravings) పెరుగుతుందని, దీని వల్ల అధిక కేలరీలు శరీరంలో చేరి ఊబకాయం, ఫ్యాటీ లివర్, టైప్-2 మధుమేహం వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని డాక్టర్ కలపాల వివరించారు.
ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారికీ ఈ సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం చేయని వారు, మద్యం సేవించని వారు, శాకాహారులు కూడా సరైన పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మెటబాలిక్ వ్యాధుల బారిన పడుతున్నారని వెల్లడించారు.
ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అల్ట్రాసౌండ్, లివర్ ఫంక్షన్ పరీక్షలు చేసినప్పుడే చాలాసార్లు ఈ సమస్య బయటపడుతుందని తెలిపారు. లక్షణాలు కనిపించే సమయానికి కాలేయం గణనీయంగా దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా జీవక్రియలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి ఎక్కువైతే అధిక ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్‌పై ఆసక్తి పెరగడం, వ్యాయామం చేయాలనే ఉత్సాహం తగ్గిపోవడం జరుగుతుందని తెలిపారు. ఇది మెటబాలిక్ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుందని వివరించారు.
ICMR, NFHS గణాంకాల ప్రకారం దేశంలో బాల్య స్థూలకాయం 15–18 శాతం వరకు పెరగడం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు తెలిపారు. గర్భధారణ సమయంలో తల్లి అధిక బరువుతో ఉంటే ఆ ప్రభావం శిశువుపై కూడా పడే అవకాశం ఉందని, పుట్టుకతోనే భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించారు.
నిపుణుల సూచనల ప్రకారం ఏం చేయాలి..
ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర పానీయాల వినియోగాన్ని తగ్గించాలి.
ప్రోటీన్లు, పీచు పదార్థాలు అధికంగా ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి.
రోజుకు కనీసం 30–45 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయాలి.
తగినంత నిద్ర, ఒత్తిడి నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
అధిక బరువు, మధుమేహం, ఫ్యాటీ లివర్ ప్రమాదం ఉన్నవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మెటబాలిక్ వ్యాధులు ఒక్కరోజులో వచ్చే సమస్యలు కావు. జీవనశైలిలో చిన్న మార్పులు, సమతుల ఆహారం, క్రమమైన వ్యాయామం ద్వారా వీటిని గణనీయంగా నివారించే అవకాశం ఉంది.
- Repo Rate Unchanged: లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్.. రెపో రేటును యథాతథంగా ఉంచిన ఆర్బీఐ..
- Metabolic Health Crisis: భారత్‌లో మెటబాలిక్ హెల్త్ సంక్షోభం.. ఆహారం, జీవనశైలిపై ఏఐజీ డాక్టర్లు కీలక హెచ్చరిక..
- లావాదేవీలు రూ. 2 వేలు దాటితే ఛార్జీలు.. UPI చెల్లింపులపై కొత్త నిబంధనలు..
- జీవితం అమూల్యం… జిందగీని ప్రేమించండి !
- ఇరాన్‌తో స్వతంత్ర సంబంధాలపై గల్ఫ్ దేశాల దృష్టి