Skip to content
ఎడిట్ పేజి వార్తలు

కామన్వెల్త్‌ గేమ్స్‌లో నారీశక్తికి అభినందనలు

Prajapaksham 04 Aug 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
కామన్వెల్త్‌ గేమ్స్‌లో నారీశక్తికి అభినందనలు

Commonwealth Games 2026

స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో ఆదివారం రాత్రి ఉత్సవంతో ముగిసిన కామన్వెల్‌ గేమ్స్‌ 23వ ఎడిషన్‌లో భారత్‌ అథ్లెట్లు ప్రశంసనీయ ప్రదర్శనతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగవ స్థానంలో నిలవటం గర్వించదగిన ఘట్టం. కుస్తీ, షూటింగ్‌ వంటి క్రీడలు కూడా పోటీల్లో ఉన్నట్లయితే భారత్‌ పతకాల సంఖ్య మరింత మెరుగ్గా ఉండేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. భారత్‌ అథ్లెట్లు సాధించిన 39 పథకాల్లో 13 బంగారం, 17 వెండి, 9 కాంస్యం. 13 బంగారు పతకాలలో 8 మహిళా సాధించడం ప్రత్యేక ప్రశంసలకే కాదు, వరాల జల్లుకు పాత్రులు. 2014 నుంచీ ఒక భారత అథ్లె ట్‌ రెగ్యులర్‌గా పోడియం ఎక్కుతున్నారు. ఆమె ఎవరో ప్రసిద్ధ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను. గ్లాస్గోలో ఆమె వరుసగా మూడవసారి స్వర్ణ పతకం సాధించారు. అటువంటి అద్భుతం సాధించిన తొలి మహిళా అథ్లెట్‌ చానునే. ఆమెతో పాటు పారా అథ్లెట్‌ షర్మిలా థంకర్‌ (మహిళల షాట్‌పుట్‌), జుడోకా అస్మిత డే (ఈ పోటీలో భారత్‌కు తొలి స్వర్ణం సాధించి ఆమె చరిత్ర సృష్టించారు), బాక్సర్‌ సాక్షి చౌదరి (గ్లాస్గో వెళ్లకముందే భారత్‌లో నిఖత్‌ జరీన్‌ను ఓడించి ఆధిక్యతలోకి వచ్చారు. గ్లాస్గోలో నాలుగు బౌట్లలో ప్రత్యర్థులను సునాయసంగా ఓడించి త్రివర్ణ పతాకం రెపరెపలాడించారు.
భారత బాక్సింగ్‌కు శనివారం అరుణాక్షరాలతో లిఖించదగిన రోజు అన్నారు బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బిఎఫ్‌ఐ) అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌. బాక్సర్స్‌ 7 బంగారు పతకాలు, 3 వెండి పతకాలు గెలుచుకోవడం ఆయన అవధులు లేని ఆనందానికి హేతువు.
రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం అంతరించిన తదుపరి దాని అవశేషంగా బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు పూర్వపు వలస దేశాలతో ఏర్పాటు చేసిన అలంకారప్రాయమైన వ్యవస్థ. పేరు కామన్వెల్త్‌. వలస దేశాల నుంచి సంపదను దోచుకుపోయిన బ్రిటిష్‌ సామ్రాజ్యం ఉమ్మడి సంపదగా మిగిల్చిందేమీ లేదు. నయా వలసవాదంతో ఆ తదుపరి కూడా నవ స్వతంత్ర దేశాలను ఆర్థికంగా దోచుకుంది. దాని ఆర్భాట ప్రదర్శనలో భాగంగా పురుడు పోసుకున్నవి కామన్వెల్త్‌ క్రీడలు. 1934లో ఈ క్రీడల్లో తొలిసారి పాల్గొన్న భారత్‌ దాని అన్ని ఎడిషన్స్‌లోను తప్ప (1930, 1950, 1962, 1986) పాల్గొంది. భారత్‌ అనేక క్రీడల్లో పాల్గొంటున్నా దానికి పతకాల పంట పండించింది మాత్రం షూటింగ్‌, కుస్తీ. షూటింగ్‌లో 63 స్వర్ణాలు సహా 135 పతకాలు, కుస్తీలో 49 స్వర్ణాలుసహా 115 పతకాలు లభించాయి. ఆ వరుసలో వెయిట్‌ లిఫ్టింగ్‌ది మూడవ స్థానం. గ్లాస్గో గేమ్స్‌ కుదించబడిన క్రీడా పోటీలతో జరిపారు. గ్లాస్గోలో కామన్వెల్‌ క్రీడల పతాకం, బాటన్‌ తదుపరి క్రీడల ఆతిథ్య దేశమైన భారత్‌కు స్కాట్లాండ్‌ అందించింది. 2030 కామన్వెల్త్‌ క్రీడలకు ఆమ్దా వాద్‌ (అహ్మదాబాద్‌) వేదిక కానుంది. భారత్‌ ఆతిథ్యం అంటేనే ఆర్భాటం.
2036 ఒలంపిక్‌ క్రీడల నిర్వహణకు ఆతిథ్య అవకాశం కోసం పోటీపడే ఆలోచన భారత ప్రభుత్వంలో ఉన్నందున 2030 ఆమ్దాబాద్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ను ఘనంగా నిర్వహించేందుకు సకల ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఈ 24వ ఎడిషన్‌కు 70 దేశాలు, భూభాగాల నుంచి రానున్న వేలాది మంది అథ్లెట్లు, సిబ్బందికి పదికాలాలపాటు గుర్తుండే ఆతిథ్యమివ్వనుంది. గతంలో 2010లో కామన్వెల్త్‌ గేమ్స్‌ ఢిల్లీలో జరిగాయి. ఆ ఎడిషన్‌ నిర్వహణ రాజకీయ వైరాల మధ్య అవినీతి ఆరోపణలకు గురైనప్పటికీ, భారత క్రీడాకారులు పతకాల పట్టికలో రెండవ స్థానంలో నిలిచారు. షూటింగ్‌, కుస్తీ పోటీలు పునఃప్రవేశం చేయనున్నందున ఆమ్దావాద్‌లో భారత్‌ ఆ స్థానాన్ని తిరిగి పొందవచ్చు, ఒక అడుగుపైకి ఎగబాకనూవచ్చు.
జపాన్‌లో సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జరిగే ఆసియా క్రీడల పోటీలు, భారత క్రీడాకారుల ప్రతిభకు, పోటీతత్వానికి పరీక్ష కానున్నాయి. చైనా, జపాన్‌, ఉభయ కొరియాల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ఏమైనా నిరంతర శ్రమ, తర్ఫీదు, క్రమశిక్షణ భారత ప్రభుత్వ ప్రోత్సాహం క్రీడారంగంలో రాణించేందుకు అవసరం. అథ్లెట్ల తయారీకి క్రీడాకారుల అభిరుచి, ఆసక్తితోపాటు తల్లిదండ్రుల త్యాగం ఎన్నడూ విస్మరించకూడనిది.

ట్యాగ్‌లు: Breaking News editorial national