Skip to content
ప్రపంచం వార్తలు

గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. ఎనిమిది మంది మృతి..హమాస్ నిరాయుధీకరణపై నెతన్యాహూ నో..

Prajapaksham 03 Aug 2026 0 నిమిషాల పఠనం ప్రపంచం
గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. ఎనిమిది మంది మృతి..హమాస్ నిరాయుధీకరణపై నెతన్యాహూ నో..

Gaza war

ట్రంప్ ప్రతిపాదించిన నిరాయుధీకరణ ప్రణాళికకు హమాస్ అంగీకరించిందని వార్తలు వెలువడిన తర్వాత గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం ఉద్ధృత దాడులు చేస్తోంది. గాజా నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకుంటానని ఇజ్రాయెల్ ఇప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు.

గాజా అంతటా ఆదివారం కొనసాగిన దాడుల్లో ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిది మంది మరణించారు. మరో 12 మందికిపైగా పాలస్తీనియన్లు గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి తెలిపారు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతం అంతటా ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెరిగింది.

నాజర్ ఆసుపత్రి సమాచారం ప్రకారం, ఒక చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఈ దాడుల్లో మరణించారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో కూడా మసీదులను ఇజ్రాయెల్ సేనలు ధ్వంసం చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో 88 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 30 మంది స్థానిక ఇజ్రాయెల్ వాసుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.

కాగా, పాలస్తీనా తరఫున చర్చల్లో మధ్యవర్తిగా పనిచేసిన ప్రవాస పాలస్తీనా నాయకుడు మహ్మద్ దహ్లాన్ ఒక ప్రకటన చేస్తూ, హమాస్ నిరాయుధీకరణ ఒప్పందంలో భాగంగా గాజాలో దాడులు నిలిపివేసే విషయంపై ఇజ్రాయెల్ ఇంకా ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.

దాడులు చేయకుండా, సైన్యాన్ని వెనక్కి మళ్లించడంలో జారెడ్ కుష్నెర్ ఇజ్రాయెల్‌ను ఒప్పించారని గతంలో దహ్లాన్ చేసిన ప్రకటనను ఆయన వెనక్కి తీసుకున్నారు.

కాగా, ఇజ్రాయెల్–హమాస్ మధ్య గత ఏడాది అక్టోబరులో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఐడీఎఫ్ నిర్వహించిన దాడుల్లో ఇప్పటివరకు 1,222 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 260 మంది చిన్నారులు ఉన్నారు.

ఆయుధాలను వదిలిపెట్టేదిలేదని ఇన్నాళ్లూ భీష్మించుకున్న హమాస్ సంస్థ ట్రంప్ ప్రకటించిన నిరాయుధీకరణ ప్రణాళికను అంగీకరించినప్పటికీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాత్రం దానిపై విశ్వాసం వ్యక్తం చేయడం లేదు. హమాస్ తమను తప్పుదోవ పట్టించి, మళ్లీ సైన్యాన్ని, ఆయుధాలను అభివృద్ధి చేసుకుని విరామం తర్వాత తిరిగి దాడులు చేసే అవకాశం ఉందని, అందువల్ల బలహీన స్థితిలో ఉన్న హమాస్‌ను ఈ దశలోనే పూర్తిస్థాయిలో నిర్మూలించాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు పేర్కొంది.

2023 అక్టోబరులో గాజాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 73,356కు చేరుకోగా, గాయపడిన వారి సంఖ్య 1,74,185 దాటింది.

ట్యాగ్‌లు: Gaza Iran Israel News Trump