Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అమ్మో అమరావతి…? కూటమి ముందు అసలైన సవాలు..? టైం దగ్గర పడుతున్నా కదలని క్యాపిటల్ పనులు..

Prajapaksham 02 Aug 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
అమ్మో అమరావతి…? కూటమి ముందు అసలైన సవాలు..? టైం దగ్గర పడుతున్నా కదలని క్యాపిటల్ పనులు..

అమ్మో అమరావతి...? కూటమి ముందు అసలైన సవాలు..? టైం దగ్గర పడుతున్నా కదలని క్యాపిటల్ పనులు..

2029 ఎన్నికల నాటికి అమరావతి పూర్తవుతుందా లేదా అనేది ఇప్పుడు కూటమి సర్కార్ ముందున్నటువంటి అతిపెద్ద సవాలు అని చెప్పవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అమరావతి రాజధాని అనేది ఒక అతిపెద్ద అంశంగా మారింది అని చెప్పవచ్చు. ఓవైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సైతం విశాఖపట్నం రాజధాని మాటను పక్కకు పెట్టి మావిగన్ అని పరోక్షంగా అమరావతి రాజధానిని ఒప్పుకున్నట్లే అనే సంకేతాలు లభించాయి. దీంతో ఇప్పుడు కూటమి సర్కారు హామీ ఇచ్చినట్టు అమరావతి రాజధాని నిర్మాణం అనేది వేగం పొంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పవచ్చు. అయితే అమరావతిలో ఇప్పటివరకు ఇంకా భూ సమీకరణ వద్దే మల్ల గులాలు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా అమరావతి ఇప్పటివరకు 33,000 ఎకరాలు సరిపోకుండా మరికొంత భూమి కావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమరావతి లోనే భోగాపురం తరహాలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు కానీ ఇప్పటికీ కూడా అమరావతి సీడ్ క్యాపిటల్ లో నిర్మాణాలు ముందుకు పడటం లేదు. సచివాలయం, అసెంబ్లీ వంటి నిర్మాణాలు ఇంకా తాత్కాలిక భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే కూటమి సర్కారు రెండు సంవత్సరాలు పైన గడిచిపోయింది. అయితే ఈ రెండు సంవత్సరాల్లో నిర్మాణాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం గతంలో వదిలేసిన భవనాలను ఫినిషింగ్ ఇవ్వడం, ప్రైవేటు భూములు లో నిర్మాణాలు తప్ప ప్రభుత్వం తరఫున చేస్తున్న చురుకైన ప్రాజెక్టులు ఏవి కంటికి కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. 

కదలని అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం పనులు

ప్రస్తుతం అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు తాత్కాలిక భవనాల్లోనే సాగుతున్నాయి. ఐకానిక్ డిజైన్లతో నిర్మించాల్సిన శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, శాశ్వత హైకోర్టు భవనాల ప్రాజెక్టులు టెండర్లు, పునాదుల దశ దాటి వేగంగా ముందుకు సాగకపోవడం పెద్ద లోటుగా ఇక్కడ కనిపిస్తోంది.

ఎకనామిక్ అండ్ నాలెడ్జ్ హబ్‌లు (భూ కేటాయింపుల పునరుద్ధరణ):
గతంలో అమరావతిలో ప్రతిపాదించిన స్టార్టప్ ప్రాంతాలు (సింగపూర్ కన్సోర్టియం ప్రాజెక్ట్ ఉపసంహరణ తర్వాత) నాలెడ్జ్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ వంటి రంగాలు ఇంకా ఆలోచనల స్థాయిలోనే ఉన్నాయి.

ల్యాండ్ పూలింగ్ రైతుల కౌంటర్ ప్లాట్లు (LPS Layouts):
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన డెవలప్‌డ్ ప్లాట్లలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీటి సరఫరా వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల (Trunk Infrastructure) కల్పన పనులు పూర్తి కాకపోవడం కూడా ఇందులో పెద్ద సమస్యగా చెప్పవచ్చు.

కాగితాలపైనే ఔటర్ రింగ్ రోడ్ (ORR), ఎక్స్‌ప్రెస్ వేలు:
అమరావతిని విజయవాడ, గుంటూరు, జాతీయ రహదారులతో అనుసంధానించే ఐకానిక్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాజెక్ట్, కృష్ణానదిపై వారధుల (Bridges) నిర్మాణం వేగం పుంజుకోకపోవడం కూడ ప్రధాన సమస్యగా ఉంది. వీటితో పాటు అమరావతికి శాశ్వత వరద ముప్పు నివారణలో భాగంగా కొండవీటివాగు, పాలవాగు ఎత్తిపోతల పథకాలు, వరద నివారణ ప్రాజెక్టులతో పాటు నగరంలో అండర్ గ్రౌండ్ కేబుల్స్, డ్రైనేజీ నెట్‌వర్క్ పనులు పూర్తిస్థాయి రూపుదిద్దుకోకపోవడం కూడా పెద్ద సమస్యగా ఉన్నాయి.

వీటితో పాటు ఆర్థిక అంశాల విషయానికి వ్తే ప్రపంచ బ్యాంక్ , ADB ఇచ్చిన రూ. 15,000 కోట్ల రుణ నిధులు విడతలవారీగా మైలురాళ్ల (Milestones) ఆధారంగా వస్తున్నాయి. ఆ నిధులను వేగంగా ఖర్చు చేస్తూ పనులను వేగవంతం చేయడంలో యంత్రాంగానికి క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

ప్రభుత్వ భవనాల పరిస్థితి ఇలా ఉంటే, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు కేటాయించిన స్థలాల్లో పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టడానికి వెనుకాడడం.

ప్రభుత్వం మంత్రులు ‘అమరావతి మొదటి దశను 2028 నాటికి పూర్తి చేస్తాం’ అని ప్రకటనలు చేస్తున్నప్పటికీ, మిగిలిన సమయం కేవలం 2 ఏళ్ళు మాత్రమే ఉంది అనుకున్న ప్రతిపాదిత ప్రాజెక్టులన్నీ గ్రౌండ్ అవ్వడం సాధ్యమేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఏది ఏమైనా, ఓవైపు ప్రతిపక్షాలు సైతం అమరావతి రాజధానిని పరోక్షంగా అంగీకరిస్తున్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో, బాధ్యత అంతా కూటమి ప్రభుత్వంపైనే పడింది. 2029 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రజలు, ముఖ్యంగా రాజధాని రైతులు ప్రకటనలను కాదు… ప్రత్యక్ష నిర్మాణాలను చూడాలని కోరుకుంటున్నారు. రాబోయే రెండేళ్ల వ్యవధిలో నిధుల సమీకరణ, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సచివాలయం, అసెంబ్లీ వంటి ఐకానిక్ భవనాలతో పాటు మౌలిక వసతులను కూటమి సర్కార్ శరవేగంగా పూర్తి చేయగలుగుతుందా? లేక గతంలో లాగే కేవలం హామీలు, నమూనా డిజైన్లకే అమరావతి పరిమితమై, మొదటి దశ నిర్మాణం అర్ధాంతరంగానే ఉండిపోతుందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 2029 రాజకీయ భవిష్యత్తును శాసించేది ఈ అమరావతి నిర్మాణ వేగమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ట్యాగ్‌లు: andhra pradesh political news