Skip to content
జాతీయం వార్తలు

కేంద్ర ప్రభుత్వంలో ప్రచారం అధికం – ఫలితాలు పరిమితం

Prajapaksham 31 Jul 2026 0 నిమిషాల పఠనం జాతీయం
కేంద్ర ప్రభుత్వంలో ప్రచారం అధికం – ఫలితాలు పరిమితం

PM Modi Schemes

డాక్టర్‌ కోలాహలం రామ్‌ కిశోర్‌

ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రజాస్వామ్యంలో సహజం. అయితే రాజకీయ ప్రచారం, ఎన్నికల నినాదా లు, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యే సందేశాలు వాస్తవాల స్థానాన్ని భర్తీ చేయలేవు. ఏ ప్రభుత్వాన్నైనా లేదా ఏ ప్రతిపక్షాన్నైనా అంచనా వేయాలంటే భావోద్వేగాల కంటే ఆధారాలు, గణాంకాలు, విధానాల ఫలితాలు, ప్రజల జీవన ప్రమాణాలపై వాటి ప్రభావమే ప్రమాణం కావాలి. ఇటీవల విస్తృతంగా ప్రచారంలో ఉన్న ‘ప్రపంచమంతా భారత్‌ లేదా బిజెపి ఓడిపోవాలని కోరుకుంటోంది’ అనే వాదన కూడా ఇదే ప్రమాణంతో పరిశీలించాల్సిన అవసరం ఉంది.
మొదట విదేశాలు లేదా అంతర్జాతీయ శక్తులు భారత ఎన్నికల్లో ఏకపక్షంగా ఒకే పార్టీ గెలవాలని లేదా ఓడిపోవాలని కోరుకుంటున్నాయనే వాదనకు ఇప్పటివరకు బలమైన, స్వతంత్ర ఆధారాలు అందుబాటులో లేవు. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, బ్రిటన్‌, కెనడా వంటి దేశాలు తమ జాతీయ ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకుని భారత ప్రభుత్వంతో కలసి పనిచేస్తాయి. ప్రభుత్వం మారినా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి. అమెరికాతో రక్షణ, సెమీకండక్టర్లు, సాంకేతికత, వాణిజ్యం వంటి రంగాల్లో సహకారం పెరిగింది. అదే సమయంలో మానవ హక్కులు, మీడియా స్వేచ్ఛ, మైనారిటీల భద్రత వంటి అంశాలపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. విమర్శలను ఎన్నికల్లో ఒక పార్టీని ఓడించాలనే కుట్రగా పరిగణించడం వాస్తవాలను వక్రీకరించడం అవుతుంది.
భారత్‌ రక్షణరంగం స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తున్న మాట కొంతమేరకు నిజమే. రక్షణ ఉత్పత్తుల విలువ గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. రక్షణ ఎగుమతులు కూడా రికార్డు స్థాయికి చేరాయి. కానీ అదే సమయంలో భారత్‌ ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుల్లో ఒకటిగా కొనసాగుతోంది. అందువల్ల విదేశీ ఆయుధ పరిశ్రమ మొత్తం భారత్‌ బలపడకూడదని చూస్తోందనే వాదనకు సరిపడే ఆధారాలు లేవు. వాస్తవానికి అమెరికా, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు భారత రక్షణ మార్కెట్లో భాగస్వాములుగానే ఉన్నాయి. ఆ దేశాల నుండి యుద్ధ విమానాలు, ఆయుధాల దిగుమతులు అధికంగా ఉన్నాయి. ఆయుధాల ఉత్పత్తిలో సాంకేతిక సహకారం రష్యా,
ఇజ్రాయెల్‌ నుండి లభిస్తుంది.
రామ మందిర నిర్మాణం బిజెపికి ఒక ముఖ్య రాజకీయ, సాంస్కృతిక విజయంగా భావించబడుతుంది. అయితే ఇటీవల రామ మందిరంలో దేవుని బంగారం, వెండి, పెద్ద ఎత్తున భక్తుల ముడుపులు దోపిడీ జరగటం అయోధ్య రామమందిరం ప్రతిష్టను దిగజార్చింది. ఇప్పుడు భక్తుల రద్దీ తగ్గింది. భక్తుల కానుకలు, పరిసర ప్రాంతాల్లో వ్యాపారాల ఆదాయం కూడా తగ్గింది. రామమందిర నిర్మాణం అన్ని భారతీయ వర్గాల ఏకాభిప్రాయ విజయంగా చెప్పలేం. కేవలం సుప్రీంకోర్టు తీర్పు మూలంగా జరిగింది. అలాగే ఆర్టికల్‌ 370 రద్దు తరువాత కాశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు తగ్గినట్లు అధికారిక గణాంకాలు సూచించినప్పటికీ, రాజకీయ ప్రక్రియ, ప్రజాస్వామ్య ప్రతినిధి త్వం, నిర్బంధాలు, పౌర స్వేచ్ఛలపై అనేక ప్రశ్నలు దేశీయ, అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తబడ్డాయి. కాబట్టి ఒకే విధానాన్ని పూర్తిగా విజయంగా లేదా పూర్తిగా వైఫల్యంగా చిత్రీకరించడం సరైన
విశ్లేషణ కాదు. సిఎఎ అమలైంది కానీ జాతీయ పౌరుల నమోదు (ఎన్‌ఆర్‌సి) దేశవ్యాప్తంగా ఇప్పటికీ అమల్లోకి రాలేదు. అందువల్ల ‘సిఎఎ/ఎన్‌ఆర్‌సి పూర్తిగా అమలయ్యాయి’ అనే వాద న కూడా వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించదు. నూతన విద్యా విధానం కూడా సంస్కరణల దిశగా ఒక ప్రయత్నమే అయినప్పటి కీ, రాష్ట్రాల అమలు సామర్థ్యం, నిధుల కొరత, డిజిటల్‌ అసమానత, ఉపాధ్యాయ శిక్షణ వంటి సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా చాలా రాష్ట్రాల లో అమ లు కావడం లేదు.
భారత్‌ జిడిపి రీత్యా ప్రపంచం లో నాలుగు నుంచి ఆరవ స్థానానికి పడిపోయింది. అయినా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ మధ్య కాలం లో ఎదగడం ఒక ముఖ్యమైన మైలురాయి. అయితే తలసరి ఆదా యం, నిరుద్యోగం, యువత ఉపా ధి, మహిళల శ్రామిక భాగస్వామ్యం, ఆదాయ అసమానత వంటి సూచికల్లో ఇంకా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే వెనుకబడి ఉన్నాం అనే విషయాన్ని మర్చిపోకూడదు. జిడిపి పరిమాణం పెరగడం ఒక్కటే ప్రజల జీవన ప్రమాణాలు సమానంగా మెరుగుపడ్డాయని ఆర్థిక శాస్త్రం నిరూపించదు.
కరోనా సమయంలో భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాల్లో ఒకదాన్ని నిర్వహించింది. ఇది పరిపాలనాపరంగా ఒక విశేష విజయం. అదే సమయంలో రెండో కరోనా అలలో ఆక్సిజన్‌ కొరత, ఆసుపత్రులపై ఒత్తిడి, మరణాల లెక్కలపై వచ్చిన వివాదాలు కూడా చరిత్రలో నమోదయ్యాయి. కాబట్టి విజయాలను మాత్రమే కాదు, వైఫల్యాలను కూడా గుర్తుంచుకోవాల్సిందే.
మౌలిక సదుపాయాల అభివృద్ధిలో రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, రైల్వే విద్యుదీకరణ, విమానాశ్రయాల విస్తరణ, డిజిటల్‌ చెల్లింపుల పెరుగుదల వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. అదే సమయంలో విద్య, ఆరోగ్యం, పోషకాహారం, ప్రభుత్వ పాఠశాలల నాణ్యత, పట్టణ అసమానతల వంటి రంగాల్లో ఇంకా పెద్ద పెట్టుబడులు అవసరమని స్వతంత్ర అధ్యయనాలు సూచిస్తున్నాయి.
జిఎస్‌టి దేశవ్యాప్తంగా ఒకే పన్ను వ్యవస్థను తీసుకువచ్చింది. కానీ ప్రారంభ సంవత్సరాల్లో చిన్న వ్యాపారులు ఎదుర్కొన్న సమస్య లు, తరచూ మారిన పన్ను రేట్లు, పరిహార నిధులపై రాష్ట్రాల అభ్యంతరాలు కూడా వాస్తవాలే. అదే విధంగా డీమానిటైజేషన్‌ నల్లధనాన్ని అరికడుతుందని ప్రకటించినప్పటికీ, రిజర్వ్‌ బ్యాంక్‌ గణాంకాల ప్రకారం చలామణిలో ఉన్న దాదాపు మొత్తం కరెన్సీ బ్యాంకులకు తిరిగి వచ్చింది. అంటే ప్రభుత్వ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది. డీమానిటైజేషన్‌ అనియతరంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని అనేక మంది ఆర్థిక నిపుణులు విశ్లేషించారు.
‘మంత్రిత్వ స్థాయిలో అవినీతి శూన్యం’ అనే వాదనను కూడా జాగ్రత్తగా చూడాలి. పెద్ద అవినీతి కేసుల్లో కేంద్ర మంత్రులపై తీర్పు లు లేకపోవడం ఒక విషయం అయితే, ఎన్నికల బాండ్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, పారదర్శకతపై వచ్చిన విమర్శలు, దర్యాప్తు సంస్థల వినియోగంపై ప్రతిపక్షాల ఆరోపణలు మరోవైపు ఉన్నాయి. ఒకప్పుడు దేశంలో అవినీతిపరులు అని బిజెపి ముద్ర వేసిన వారిలో చాలామంది ప్రముఖులు తదనంతర కాలంలో బిజెపిలో చేరి కొందరు రాజకీయ పదవులు పొందినందువల్ల అవినీతి పూర్తిగా అంతరించిపోయిందని చెప్పడం కంటే, పారదర్శకతను కోల్పోయిన ఇడి,ఐటి, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల నివేదికలు కూడా విశ్వసనీయతను కోల్పోయాయి.
బిజెపి ప్రభుత్వంలో ‘బాంబు పేలుళ్లు లేవు’, ‘పాకిస్థాన్‌ను ఒక్క బులెట్‌ కూడా వేయకుండా దెబ్బతీశారు’, ‘చైనాను నియంత్రించారు’ వంటి రాజకీయ నినాదాలు కూడా అతిశయోక్తితో కూడుకున్నవే. ఉగ్రవాద ఘటనలు తగ్గిన ప్రాంతాలున్నప్పటికీ, సరిహద్దు ఉద్రిక్తతలు, గాల్వాన్‌ వంటి సంఘటనలు, పుల్వామ ఉగ్రవాద సంఘటనలు, భారత చైనా సరిహద్దుల వివాదాలు ఇంకా పూర్తిగా పరిష్కారమవలేదు. విదేశాంగ విధానాన్ని విజయాల జాబితాగా లేదా వైఫల్యాల జాబితాగా కాకుండా అదొక నిరంతర ప్రక్రియగా చూడాలి.
భారత్‌లో ఐఐటిలు, ఎయిమ్స్‌లు, తాగునీటి పథకాలు, ఆయుష్మాన్‌ భారత్‌, మొబైల్‌ తయారీ, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో నిజమైన పురోగతి కనిపిస్తోంది. అయితే ఈ విజయాలు కేవలం ఒకే పార్టీకి చెందినవి అని చెప్పడం కూడా సరైంది కాదు. అనేక రంగాల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రభుత్వరంగ సంస్థల స్థాపన, మిశ్రమ ఆర్థిక విధానాలు, కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యం, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్‌ రంగం కలిసి చేసిన మిశ్రమ కృషి ఫలితమే.
చివరగా, ‘దేశాన్ని ప్రేమించడం అంటే కేవలం ఒకే ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం’ అనే భావన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. దేశభక్తి ఏ పార్టీకి గుత్తాధిపత్యం కాదు. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశంసించడం ఎంత అవసరమో, లోపాలు ఉంటే ప్రశ్నించడం కూడా అంతే అవసరం. విమర్శించే వారిని దేశద్రోహులుగా, మద్దతు ఇచ్చేవారిని మాత్రమే దేశభక్తులుగా విభజించడం ప్రజాస్వామ్య చర్చ ను బలహీనపరుస్తుంది. ఓటరు బాధ్యత ప్రచార సందేశాలను పునరావృతం చేయడం కాదు; ఆధారాలను పరిశీలించడం, వాగ్దానాలను ఫలితాలతో పోల్చడం, పాలనను ప్రశ్నించడం. ప్రజాస్వామ్యంలో బలమైన దేశాన్ని నిర్మించేది ఏకపక్ష నినాదాలు కాదు; వాస్తవాల ఆధారంగా తీసుకునే చైతన్యపూర్వక నిర్ణయాలే.

ట్యాగ్‌లు: BJP Modi