హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఐటీ కంపెనీలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక అడ్వైజరీ..
Cyberabad Police
తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ, వాణిజ్య సంస్థలకు కీలక సూచనలు జారీ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కంపెనీలు తమ ఉద్యోగులకు వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సౌకర్యం కల్పించాలని.. ఒకవేళ అది వీలుపడకపోతే గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచే దశలవారీగా విధులను ముగించి (లాగౌట్) ఇళ్లకు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
భారీ వర్షాల సమయంలో ఐటీ కారిడార్లలో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించకుండా చూడటం, ప్రమాదాలను నివారించడం, అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూసేందుకే ఈ ముందస్తు అడ్వైజరీ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. కంపెనీలు తమ కార్యాలయాల వివరాలు, ఉద్యోగుల లాగౌట్ సమయాలను ఈమెయిల్ ద్వారా పోలీసులకు తెలియజేస్తే.. దానికి అనుగుణంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ప్రణాళికలు రూపొందించుకోవడం సులభమవుతుందని పేర్కొన్నారు.
ఈ వారం ప్రారంభం నుంచి మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ఐటీ కారిడార్లలో సాయంత్రం వేళల్లో వర్షం కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సున్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. రద్దీ సమయంలో రోడ్లపై ఒత్తిడి తగ్గించేందుకే ముందస్తు హెచ్చరికలు ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం సుమారు 1,500 కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ వాతావరణ సమాచారాన్ని, ట్రాఫిక్ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు చేరవేస్తున్నామని వివరించారు. రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.