‘I Won’t Apologise’: నేనేం తప్పు మాట్లాడలేదు.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు.. అమిత్ షాపై రాహుల్ గాంధీ మరోసారి ఫైర్..
rahul gandhi vs amit shah
‘I Won’t Apologise’: పార్లమెంట్‌లో తాను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అందువల్ల ఈ విషయంలో తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
దేశవ్యాప్తంగా జరిగిన పేపర్ లీకేజీలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన కాల్పులు, లాఠీఛార్జీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షానే పూర్తి బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ ఆరోపించారు. పోలీసులు మేకులున్న లాఠీలతో విద్యార్థులను దారుణంగా చావబాదారు. అధికారుల పెల్లెట్ గన్ దాడికి.. ఒక యువకుడు కన్ను కోల్పోయే తీవ్ర పరిస్థితి ఏర్పడింది. మహిళలు, మైనర్ల అని కూడా చూడకుండా దాడులు చేశారు. పోలీసుల బలప్రయోగానికి అమిత్ షా నేరుగా ఆదేశాలైనా ఇచ్చి ఉండాలి.. లేదా ఇదంతా ఆయనకు తెలిసే జరిగి ఉండాలని వ్యాఖ్యానించారు.
అయితే రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ సభలో స్పందిస్తూ.. అమిత్ షా ఆదేశాలు ఇచ్చారనడానికి రాహుల్ గాంధీ వద్ద ఎలాంటి రాతపూర్వక ఆధారాలు ఉన్నా సభ ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎలాంటి పక్కా ఆధారాలు లేకుండా సభలో నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు గాను సభకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు.
సభలో అధికార పక్షం డిమాండ్‌పై స్పందించిన రాహుల్ గాంధీ.. మీడియా ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులపై జరిగిన ఘోరాలపై ప్రశ్నించడంలో ఎలాంటి పొరపాటు లేదని, సత్యం వైపు నిలబడినప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు.