అప్పుడే అధికారం వచ్చేసిందా..? బీఆర్ఎస్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతోందా..?
అప్పుడే అధికారం వచ్చేసిందా..? బీఆర్ఎస్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతోందా..?
తెలంగాణ రాజకీయాల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించడం ఏ విశ్లేషకుడికీ సాధ్యం కాదు. అధికారం శాశ్వతం కాదనే పాఠాన్ని ప్రజా తీర్పు ఇప్పటికే అనేక పార్టీలకు నేర్పింది. ప్రస్తుతం తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాల వేళ, అధికార కాంగ్రెస్ పట్ల వస్తున్న విమర్శలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఇంకా ఎన్నికలకు సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ.. ‘వచ్చే అధికారం మనదే’ అనే ధీమా బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తుండటం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
కాంగ్రెస్ పై వ్యతిరేకత.. బీఆర్ఎస్ ధీమా
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పైన ప్రస్తుతం అసంతృప్తి ఉన్న నేపథ్యంలో దీన్నే తమ అధికారానికి పావుగా వాడుకునేందుకు బిఆర్ఎస్ బలంగా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కుమ్ములాటలు, ఆర్థిక ఇబ్బందులు, సంక్షేమ పథకాలకు నిధుల లేమి వంటి సమస్యలతో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది కిందిస్థాయి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. అయితే ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ఇది తమకు కలిసి వస్తుందని, వచ్చే అధికారం తమదే అని కులాసాగా ఉన్నారు అనే వార్త రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం:
కానీ ఎన్నికల గెలుపు అనేది ఎక్కువగా ఆధారపడేది పార్టీ నిర్మాణం పైన. ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నప్పటికీ కూడా, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నేతలంతా కలిసి పనిచేస్తేనే పార్టీ నిలబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ చదరంగంలో వేసే వ్యూహాలను, ఆయన పట్టుదలను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా సమయం ఉంది. రాజకీయాల్లో రెండున్నర సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ సమయం. కేవలం ఒక నెల రోజుల సమయంలోనే రాజకీయాల్లో జాతకాలు అటు ఇటు అయిపోతుంటాయి.
సోషల్ మీడియానే నమ్ముకున్నారా..? పార్టీలోని అంతర్గత సమస్యలు:
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయకుండా కేవలం ప్రచారానికే పరిమితమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే కూడా సోషల్ మీడియానే నమ్ముకున్నారు. క్షేత్రస్థాయి పర్యటనకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా “హరీష్ రావు వర్సెస్ కేటీఆర్” అనే నేరేటివ్ ఇప్పుడు ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీసే పరిణామంగా మారుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పైకి అంతా బాగానే కనిపిస్తున్నప్పటికీ, లోపల మాత్రం ఇప్పటికీ కూడా బలహీనతలు ఉన్నాయని చెప్పవచ్చు.
కెసిఆర్ సైలెంట్.. కవిత సొంత దారి:
పార్టీకి కొండంత అండగా నిలవాల్సిన కీలక నేతల పరిస్థితులు కూడా గులాబీ దళానికి కలిసి రావడం లేదు. అటు పార్టీ అధినేత కేసిఆర్ ఇంకా పూర్తిస్థాయిలో జనాల్లోకి రాలేదు. ఉన్న ఒక్క చెల్లె కవిత వేరే కుంపటి పెట్టుకుంది/సొంత దారిన వెళ్తోంది. ఇవన్నీ కూడా భారత రాష్ట్ర సమితికి భారమైన పరిస్థితులే.
మితిమీరిన విశ్వాసమే దెబ్బతీస్తుందా..?
అధికార కాంగ్రెస్ పార్టీ బలహీనతలను తమ బలంగా మార్చుకునేందుకు భారత రాష్ట్ర సమితి ప్రయత్నాలు చేస్తున్నా, తమ ప్రయత్నాల్లో చిత్తశుద్ధి మాత్రం కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అట్టడుగు స్థాయిలో కార్యకర్తలను కాపాడుకోవడం, చేరికలను అడ్డుకోవడం, క్షేత్రస్థాయి పోరాటాలు చేయడం పక్కనబెట్టి.. ఇక అధికారం తమకే అని భారత రాష్ట్ర సమితి నేతలు ఫిక్స్ అయిపోతున్నారు. ఈ తొందరపాటే వారి కొంప ముంచుతుందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
రాజకీయాల్లో శత్రువు బలహీనత కంటే మన బలమే మనల్ని గెలిపిస్తుంది. కాంగ్రెస్ పాలనలోని లోపాలను వేలెత్తి చూపిస్తూనే, సొంత ఇంటిని సరిదిద్దుకోవడం బీఆర్ఎస్కు అత్యంత ముఖ్యం. కేవలం సోషల్ మీడియా పోరాటాలు, అధికార పక్షంపై నెగెటివ్ ప్రచారానికే పరిమితమైతే ప్రజాదరణ ఓటుగా మారడం కష్టమే. మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని పక్కనబెట్టి, కేసీఆర్ మార్గదర్శకత్వంలో నేతలంతా ఐక్యంగా క్షేత్రస్థాయిలోకి వెళ్తేనే గులాబీ జెండా మళ్ళీ రెపరెపలాడే అవకాశం ఉంటుంది. లేకపోతే ‘అతి విశ్వాసమే కొంప ముంచుతుంది’ అనే చందంగా గులాబీ పార్టీ పరిస్థితి మారుతుందనడంలో సందేహం లేదు!