Skip to content
క్రైమ్ వార్తలు

హైదరాబాద్‌లో కీచక సీఐ అక్రమాలు: స్టేషన్‌కు వచ్చిన యువతిపై లైంగిక దాడి

Prajapaksham 28 Jul 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
హైదరాబాద్‌లో కీచక సీఐ అక్రమాలు: స్టేషన్‌కు వచ్చిన యువతిపై లైంగిక దాడి

హైదరాబాద్‌లో కీచక సీఐ అక్రమాలు: స్టేషన్‌కు వచ్చిన యువతిపై లైంగిక దాడి

స్టేషన్ కు వచ్చిన యువతిని లొంగదీసుకుని, గర్భవతిని చేసి బలవంతంగా అబార్షన్ .. వీడియోలతో బెదిరించి రూ.2కోట్లు వసూలు.. రెండేళ్లుగా నరక యాతన డిజిపికి ఫిర్యాదు చేసిన బాధితురాలు

జాతీయ పోలీసు అకాడమీలో ట్రైనీ ఐపిఎస్ అధికారి లైంగిక వేధింపుల ఘటన దర్యాప్తు కొనసాగుతుండగానే మరోపక్క హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విఐపి జోన్లో పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (సిఐ)గా విధులు నిర్వహిస్తున్న ఓ ఇన్స్పెక్టర్ లైంగిక నిర్వాకం వెలుగు చూసింది. ఫిర్యాదు కోసం పోలీసు స్టేషన్కు వచ్చిన యువతిని (27) లోబర్చుకున్న సదరు ఇన్స్పెక్టర్ రెండేళ్లుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడటం.. కొన్ని వీడియోలు తీసి బెదిరించి ఆమె నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకోవడం..చిత్రహింసలకు గురిచేయడంతో చివరకు బాధితురాలు రాష్ట్ర డిజిపి సివి ఆనంద్‌ను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకుంది. తన ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై కేసు నమోదు చేసి, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని కోరింది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఓ పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ (సిఐ)గా పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ మూడేళ్ల క్రితం సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహించాడు. ఆ సమయంలో అదే జిల్లాలో నివాసముంటున్న ఓ మహిళ తన భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు సదరు ఇన్స్పెక్టర్ వద్దకు వెళ్లగా, ఆ సమయంలో తనను మాయమాటలు చెప్పి అతని ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె పేర్కొంది.

అదే సమయంలో తీసిన కొన్ని వీడియోలను చూపించి బ్లాక్ మైల్ చేశాడని, అతని వేధింపులు భరించలేక సుమారు రూ.2 కోట్ల రూపాయలు ఇచ్చానని, అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. రెండేళ్లపాటు తనను చిత్రహింసలకు గురిచేశాడని, తనపై దాడులు కూడా చేశాడని, గర్భం దాల్చిన తనకు బలవంతంగా నగర శివార్లలోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ కూడా చేయించాడని ఆమె డిజిపికి తెలిపింది. ఈ ఘటనల కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని ఫిర్యాదులో పేర్కొంది.

తన వద్ద నుంచి తీసుకున్న రూ.2 కోట్లను ఇన్స్పెక్టర్ వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారని కూడా ఆమె ఆరోపించింది. ఈ విషయంపై గత ఏడాది డిసెంబర్లో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) డైరెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ఇన్స్పెక్టర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని, ఎస్హెచ్ఓ పోస్టు కోసం రూ.25 లక్షలు చెల్లించి ఆ పదవిని పొందారని తనకు సమాచారం ఉందని ఫిర్యాదులో ప్రస్తావించింది. ఈ అంశాలపై కూడా సమగ్ర విచారణ జరపాలని కోరింది.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను పలుమార్లు కలిసి ఫిర్యాదు అందజేయడానికి ప్రయత్నించినప్పటికీ, సంబంధిత అధికారులు తనను లోపలికి అనుమతించలేదని బాధితురాలు ఆరోపించింది. తాను కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అక్కడ కొందరు తనను అడ్డుకున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొంది. ఇన్స్పెక్టర్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్కు వెళ్లిన సందర్భాల్లో ‘నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నాకు పైస్థాయిలో అండ ఉంది’ అంటూ అవమానించారని, తనపై ఫిర్యాదు చేస్తే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఆమె ఆరోపించింది. ఈ బెదిరింపుల కారణంగా ప్రస్తుతం తన ప్రాణ భద్రతపై తీవ్ర ఆందోళనలో ఉన్నానని పేర్కొంది.

ఇదే విధంగా మరికొంత మంది మహిళలు కూడా సదరు అధికారితో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తనకు సమాచారం ఉందని, ఈ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ జరిగితే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో తన ఫిర్యాదును స్వీకరించి సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేయడంతో పాటు, తనకు తగిన భద్రత కల్పించి న్యాయం చేయాలని డిజిపిని కోరింది. అలాగే, మహిళలపై అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సదరు ఇన్స్పెక్టర్పై శాఖపరమైన దర్యాప్తు కొనసాగుతుంది.

ట్యాగ్‌లు: Telangana