కాపులంటే ఎందుకు అంత కడుపుమంట.. నీకన్నా పవన్ కళ్యాణ్ బెటర్.. చంద్రబాబుపై విరుచుకుపడిన అంబటి రాంబాబు..
Ambati Rambabu vs Chandrababu
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ కావడంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎంతో బెటర్ అని ఆయన ప్రశంసించారు. గుంటూరులో నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో తామిద్దరం పక్కపక్కనే కూర్చొని నవ్వుతూ మాట్లాడటంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం.. బొండా ఉమా నుంచి వివరణ కోరడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
ఈ పరిణామాలపై స్పందించిన అంబటి రాంబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉదారతను గుర్తుచేశారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలతో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన సంతాప సభలకు జనసేన పార్టీకి చెందిన అనేక మంది నాయకులు హాజరయ్యారని.. కానీ పవన్ కల్యాణ్ ఎప్పుడూ వారిని ప్రశ్నించలేదని తెలిపారు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో పవన్ కల్యాణ్ ఎప్పుడూ తన పార్టీ నాయకులను నిలదీయలేదని.. కానీ చంద్రబాబు తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉందన్నారు.
సంతాప సభలో తనను కలవడంపై బొండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని చంద్రబాబు భావించడం చాలా విచిత్రంగా ఉందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిష్కరించాల్సిన గురుతర సమస్యలు ఎన్నో ఉన్నాయని.. అలాంటిది తాము పక్కపక్కనే కూర్చోవడం కూడా ఒక పెద్ద సమస్యగా మారిందా అని ప్రశ్నించారు. ఏ సందర్భంలో, ఎక్కడ కూర్చున్నామనే విషయాన్ని ఆలోచించాలి తప్ప.. దానిని రాజకీయం చేయడం తగదన్నారు. తామేమీ అక్కడ రాజకీయాలు మాట్లాడలేదని, చంద్రబాబు ప్రభుత్వాన్ని పడదోసేందుకు కుట్రలు పన్నలేదని స్పష్టం చేశారు. కాపుల ఐకాన్ ముద్రగడ పద్మనాభం మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి, సమాజానికి విషాదాన్ని పంచుకోవడానికి కాపు సంఘాలన్నీ కలిసి ఈ సంతాప సభను ఏర్పాటు చేశాయని.. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ సభ కాదని గుర్తుచేశారు.
ఈ సంతాప సభకు ఆహ్వానం మేరకు బొండా ఉమాతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు వచ్చారని అంబటి వివరించారు. తెలుగుదేశం పార్టీ నుంచి బొండా ఉమా, జనసేన పార్టీ నుంచి కిలారి రోశయ్య, గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావులతో పాటు కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారని తెలిపారు. అందరూ కలిసి ఒకేచోట కూర్చుని మాట్లాడుకుంటే చంద్రబాబుకు ఎందుకు అంత కడుపుమంటో అర్థం కావడం లేదన్నారు. కాపులంతా కలిసి ఒకచోట కూర్చుంటే చంద్రబాబుకు భయమా, లేక ముద్రగడ పద్మనాభం అంటే కోపమా అని నిలదీశారు.
సొంత పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమా ప్రభుత్వంపై లేదా పార్టీ విధానాలపై ఏవైనా వ్యాఖ్యలు చేసి ఉంటే వాటిపై మాట్లాడటం సమంజసమని.. కానీ ఒక సంతాప సభలో పక్కపక్కన కూర్చోవడాన్ని తప్పుబట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటీవలే రాజమండ్రిలో జరిగిన ముద్రగడ సంతాప సభకు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా వచ్చి తమతో కలసి కూర్చున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు మతిభ్రమించి ప్రవర్తిస్తున్నారాని విమర్శించారు. కాపు సామాజికవర్గంలో అలజడి మొదలైందని బొండా ఉమా చేసిన వ్యాఖ్యలపై కోపం ఉంటే దానిపై ప్రశ్నించుకోవాలని.. అది వారి పార్టీ అంతర్గత విషయమని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.