Skip to content
తెలంగాణ వార్తలు

Drought 2026: 150 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కరవు తాండవిస్తోంది.. వరి సాగు చేయడం చాలా కష్టతరమంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

Prajapaksham 27 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Drought 2026: 150 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కరవు తాండవిస్తోంది.. వరి సాగు చేయడం చాలా కష్టతరమంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

Thummala Nageswara rao

Drought 2026: ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి తీవ్రంగా దాడి చేస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత 150 సంవత్సరాలలో ఎన్నడూ చూడని రీతిలో ప్రస్తుతం తీవ్ర కరవు పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం వల్లే దేశానికి రావాల్సిన నైరుతి రుతుపవనాల జాడ లేకుండా పోయిందని.. దీనిఫలితంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. ఈ కరవు ప్రభావం వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల వరకు కొనసాగే అవకాశం ఉందని, రాబోయే రోజుల్లో సరైన వర్షాలు కురవవని ఐఎండీతో పాటు అంతర్జాతీయ వాతావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారని తెలిపారు.

వచ్చే నెలలో కురిసే స్వల్ప వర్షాలు కేవలం మెట్ట పంటలకు మాత్రమే ఉపయోగపడతాయని.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో వరి సాగు చేయడం చాలా కష్టతరమని మంత్రి స్పష్టం చేశారు. నీటి లభ్యత అత్యంత తక్కువగా ఉన్నందున రైతులు సమయానుకూలంగా ఆలోచించాలని సూచించారు. తక్కువ సమయంలో, తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్ది రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ కమిటీల పనితీరును సమగ్రంగా పరిశీలించేందుకు 6 ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామని, ఈ బృందాలు వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తాయని తెలిపారు.

ఇదిలా ఉంటే వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారిక ప్రకటనలో తెలిపింది. రానున్న 24 గంటల వ్యవధిలో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాయుగుండం సోమవారం నాటికి ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపాల మధ్య తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది.

మరోవైపు, ఈ జూలై నెలలో రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే 43 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. సాధారణంగా జూలై నెలలో 227.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం కురవాల్సి ఉండగా, ఈసారి కేవలం 109.7 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్లు తెలిపింది.