Sonia Gandhi Slams Modi Govt: నిరసన చేస్తున్న విద్యార్థులను దేశ శత్రువుల్లా బీజేపీ చూస్తోంది.. మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడిన సోనియా గాంధీ..
Sonia Gandhi Slams Modi Government Over Handling of Student Protests
Sonia Gandhi Slams Modi Govt: నీట్ (NEET) లీకేజీ వివాదం, విద్యార్థుల ఆందోళనలపై మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ‘ది హిందూ’ పత్రికలో ఆమె రాసినట్లుగా ప్రచురితమైన ప్రత్యేక వ్యాసంలో కేంద్రంపై నిప్పులు చెరిగారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను భవిష్యత్తు వారసులుగా చూడాల్సింది పోయి.. దేశ శత్రువులుగా పరిగణిస్తూ వారిపై పిరికితనం, విచక్షణారహిత క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
జూలై 20న ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై పోలీసులు చేసిన లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగాలను ఆమె అపఖ్యాతి పాలైన రోజుగా అభివర్ణించారు. గతంలో సీఏఏ-ఎన్‌ఆర్‌సీ ఆందోళనల సమయంలో విశ్వవిద్యాలయాలపై దాడులు, మహిళా రెజ్లర్ల పట్ల నడుచుకున్న తీరునే ప్రభుత్వం ఇప్పుడు కూడా పునరావృతం చేస్తోందన్నారు. విద్యార్థుల అసమ్మతిని దేశద్రోహంగా ముద్ర వేస్తూ.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం కుట్ర కోణాలను ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.
దేశంలో విద్యా వ్యవస్థ క్షీణించడానికి ప్రభుత్వ విధానాలే కారణమని సోనియా గాంధీ విమర్శించారు. ప్రభుత్వం బడ్జెట్‌లో పాఠశాల విద్య కేటాయింపులను 50 శాతం, ఉన్నత విద్య కేటాయింపులను 33 శాతం తగ్గించడాన్ని ఆమె ప్రశ్నించారు. గడిచిన 12 ఏళ్లలో దాదాపు లక్ష ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలు నిర్వహించే పాఠశాలలను ప్రోత్సహించడం వల్ల సామాన్య కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే, నీట్ అక్రమాలపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి నిరాకరించడం.. పార్లమెంటరీ కమిటీ సిఫార్సులలో ప్రతిపక్ష సభ్యులు ఉన్నారనే నెపంతో వాటిని తోసిపుచ్చడం ప్రభుత్వ అహంకారానికి, జవాబుదారీతనం లేకపోవడానికి నిదర్శనమని అన్నారు. విద్యార్థులకు అండగా నిలిచి వారి భవిష్యత్తును కాపాడటం అందరి నైతిక, రాజ్యాంగపరమైన బాధ్యత అని సోనియా గాంధీ స్పష్టం చేశారు.