Telangana Assembly Session: కౌరవులకు పట్టిన గతే రేపు కాంగ్రెస్ పార్టీకి పడుతుంది.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. మీకంటే ఎక్కువ ఆవేశ పడాల్సింది నేను అంటూ స్పీకర్ కౌంటర్..
Telangana Assembly Session
Telangana Assembly Session: తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై పోలీసులు ప్రవర్తించిన తీరు, మహిళా శాసనసభ్యులపై జరిగిన ఘటనలపై వరుసగా రెండో రోజు కూడా సభ తీవ్ర ఘర్షణ వాతావరణానికి వేదికైంది. సోమవారం నాటి సంఘటనలకు నిరసనగా భారత రాష్ట్ర సమితి (BRS) సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. సభ ప్రారంభమైన వెంటనే సీనియర్ మహిళా సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు పోలీసులు కలిగించిన అవమానంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత టి. హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే, బాధితులైన ప్రజాప్రతినిధులపైనే తిరుగు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలియుగ దుశ్శాసనుడిలా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య గౌరవ సభగా ఉండాల్సిన అసెంబ్లీ ఇప్పుడు కౌరవ సభగా మారిపోయింది. ఆనాడు మహాభారతంలో కౌరవులకు ఏ గతి పట్టిందో, రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుంది” అని హెచ్చరించారు. మహిళా సభ్యులకు జరిగిన ఈ అవమానం రాష్ట్రంలోని యావత్ మహిళా లోకానికి జరిగిన దాడిగా అభివర్ణించారు.
హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. స్పీకర్ స్థానాన్ని, తన వ్యక్తిగతాన్ని ఉద్దేశించి చేసిన విమర్శలను తీవ్రంగా పరిగణించిన ఆయన.. “నీ తల్లిని అనలేదు, నా తల్లిని అన్నారు.. ఎందుకంత ఆవేశం? మీకంటే ఎక్కువ ఆవేశ పడాల్సింది నేను” అని ఆవేదన వ్యక్తం చేశారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత, కోవా లక్ష్మి వంటి మహిళా సభ్యులంతా తనకు సొంత అక్కాచెల్లెళ్లతో సమానమని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి పోలీస్ నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
శాసనసభలో చోటుచేసుకున్న ఈ పరిణామాలపై సభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్ బాబు స్పందిస్తూ ప్రతిపక్ష వైఖరిని ఎండగట్టారు. స్పీకర్‌ను బెదిరించేలా, కించపరిచేలా మాట్లాడటం పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు. స్పీకర్ స్థానానికి క్షమాపణలు చెప్పకుండా బీఆర్ఎస్ సభ్యులు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ గేట్ల వద్ద కేటీఆర్, కౌశిక్ రెడ్డి, ఇతరులు పోలీసులు, భద్రతా సిబ్బందిపై ప్రవర్తించిన తీరుకు సంబంధించిన పూర్తి వీడియో రికార్డులను త్వరలోనే బహిర్గతం చేస్తామని, ప్రజాక్షేత్రంలోనే నిజానిజాలు తేలుస్తామని స్పష్టం చేశారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ తదితరులు కూడా సభలో ప్రతిపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సభలో మాట్లాడుతూ.. ‘స్పీకర్ అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. స్పీకర్ చైర్‌ను గౌరవిస్తామని.. అలాగే వ్యక్తిగతంగా కూడా స్పీకర్ అంటే మాకు చాలా ఇష్టం. చాలా సంవత్సరాలుగా సభలో కలిసి పనిచేశాం. స్పీకర్‌ను ఉద్దేశించి అనలేదని మా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ చెప్పారు. స్పీకర్‌ను అన్నట్లు భావిస్తే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అని మీడియా సమక్షంలో మా సభ్యుడు చెప్పారు. అయినా దీనిపై రాద్ధాంతం అవసరం లేదు. సభ్యుడు క్షమాపణ చెప్పారు. అరెస్ట్ కూడా చేశారు. ఒక తప్పుకు ఎన్ని శిక్షలు వేస్తారు’ అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు.
- Telangana Assembly Session: కౌరవులకు పట్టిన గతే రేపు కాంగ్రెస్ పార్టీకి పడుతుంది.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. మీకంటే ఎక్కువ ఆవేశ పడాల్సింది నేను అంటూ స్పీకర్ కౌంటర్..
- KCR Farm House: రాష్ట్రాన్ని అగ్ని గుండం చేస్తాము కేటీఆర్ వీడియో వైరల్… కేసీఆర్ ఫార్మ్ హౌస్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం…కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్..
- Telangana Assembly Row: అసెంబ్లీ గౌరవానికి భంగం కలిగితే సహించేది లేదు..సభ్యుల తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం
- Telangana Assembly Tragedy: వీడియో ఇదిగో.. అసెంబ్లీలో ఒక్కసారిగా కుప్పకూలిన అధికారి.. వెంటనే CPR చేసిన మంత్రి వాకిటి శ్రీహరి..
- Konidela Susmitha: విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా కొణిదెల సుస్మిత నియామకం…