Skip to content
జాతీయం వార్తలు

Sonam Wangchuk: 26 రోజుల తర్వాత నిరాహార దీక్ష విరమించిన సోనం వాంగ్‌చుక్..కేంద్ర మంత్రులతో చర్చల తర్వాత కీలక నిర్ణయం

Prajapaksham 24 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Sonam Wangchuk: 26 రోజుల తర్వాత నిరాహార దీక్ష విరమించిన సోనం వాంగ్‌చుక్..కేంద్ర మంత్రులతో చర్చల తర్వాత కీలక నిర్ణయం

Sonam Wangchuk Ends 26-Day Hunger Strike

Sonam Wangchuk: నీట్ పోటీ పరీక్షల పేపర్ లీకేజీలను అరికట్టడంతో పాటు విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన 26 రోజుల సుదీర్ఘ ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులు, ఆందోళనకారులపై ఎలాంటి చట్టపరమైన కేసులు నమోదు చేయబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆయన తన పోరాటాన్ని విరమించారు.

గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్‌ల సమక్షంలో, వారి చేతుల మీదుగా నిమ్మరసం తాగి వాంగ్‌చుక్ దీక్షకు స్వస్తి పలికారు. ఆ సమయంలో ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో కూడా ఆయన పక్కనే ఉన్నారు.

దేశంలో అశాంతి, హింసాత్మక ఘటనలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే సుదీర్ఘ చర్చల అనంతరం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని.. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాలు, షరతుల పూర్తి వివరాలను త్వరలోనే వివరమైన వీడియో ద్వారా పంచుకుంటానని వాంగ్‌చుక్ వెల్లడించారు. జులై 20న పార్లమెంట్ మార్చ్‌తో పాటు జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి కేసులు పెట్టబోమని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు.

దీనికి తోడు నీట్ పేపర్ లీకేజీ ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించే విషయాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఇప్పటికే విద్యాశాఖ కార్యదర్శిని పదవి నుంచి తొలగించిన కేంద్రం.. కేసుల విచారణ వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసింది.

సుదీర్ఘ దీక్ష కారణంగా దాదాపు 11 కిలోల బరువు తగ్గిన వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు. 3 ఈడియట్స్ సినిమాలోని ఫున్సుఖ్ వాంగ్డూ పాత్రకు స్ఫూర్తిగా నిలిచిన వాంగ్‌చుక్ దీక్ష విరమించడం పట్ల కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), విద్యార్థి లోకం సంతోషం వ్యక్తం చేశాయి. అయితే, నీట్ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే తమ ప్రధాన డిమాండ్‌పై పోరాటాన్ని విరమించేది లేదని సీజేపీ స్పష్టం చేసింది.