Women’s Marriage Age: మహిళల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంపు.. 2021లో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు మళ్లీ తెరపైకి..
Women's Marriage Age: మహిళల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంపు.. 2021లో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు మళ్లీ తెరపైకి..
Women’s Marriage Age: భారతదేశంలో మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతులలో వస్తున్న మార్పులకు వారి వివాహ వయసు పెరుగుదల స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తోంది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే (SRS), నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) నివేదికల ప్రకారం.. దేశంలో మహిళల సగటు వివాహ వయసు 19.3 ఏండ్ల నుండి 23.1 ఏండ్లకు పెరిగింది. విద్యావకాశాలు మెరుగుపడటం, కెరీర్ పట్ల శ్రద్ధ, పట్టణీకరణ వంటి కారణాల వల్ల మహిళలు జీవితంలో ఆలస్యంగా స్థిరపడటానికి మొగ్గు చూపుతున్నారు.
ఈ ధోరణి పట్టణ ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉండి సగటు వివాహ వయసు 24.4 ఏండ్లుగా నమోదవ్వగా.. గ్రామీణ ప్రాంతాల్లో సైతం వలసలు, ఆర్థిక కారణాల వల్ల ఇది 22.6 ఏండ్లకు చేరింది. మహిళల చట్టపరమైన వివాహ వయసును 21 ఏండ్లకు పెంచే బిల్లు గతంలో లోక్సభ రద్దుతో కాలదోషం పట్టినప్పటికీ.. సమాజంలో అంతర్గతంగానే ఈ మార్పు ఇప్పటికే ఆచరణలోకి వచ్చేసింది. ఈ మార్పుల వెనుక ఉన్న ఖచ్చితమైన సామాజిక-ఆర్థిక కారణాలను అంచనా వేయడానికి రాబోయే 2027 జనాభా లెక్కల (జనగణన) వివరాలు కీలకమైన ఆధారంగా మారనున్నాయి. బిల్లును మళ్లీ పార్లమెంటులో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మహిళల వివాహ వయసు పెరగడం అనేది దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) తగ్గడానికి నేరుగా కారణమవుతోంది. వివాహం ఆలస్యమవ్వడం వల్ల మహిళల్లో సహజంగానే సంతానోత్పత్తి కాల పరిమితి (Fertility Window) తగ్గిపోతుంది. దీనివల్ల జనన రేట్లు క్షీణిస్తున్నాయి. ప్రస్తుతం దేశ సగటు సంతానోత్పత్తి రేటు భర్తీ స్థాయి కంటే తక్కువగా 1.9 కి పడిపోయింది. పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 1.5 కి పడిపోవడం మారుతున్న పట్టణ జీవనశైలికి అద్దం పడుతుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 2.1 గా స్థిరంగా ఉంది. ఆలస్యపు వివాహాలు, పడిపోతున్న జనన రేట్లు వంటివి ఒకప్పుడు జపాన్, దక్షిణ కొరియా లాంటి తూర్పు ఆసియా దేశాల్లో కనిపించగా.. ఇప్పుడు భారతదేశం కూడా అదే తరహా జనాభా ధోరణులను ఎదుర్కొంటోంది.
ఈ జనాభా మార్పుల వల్ల దేశంలో వయసుల వారీగా జనాభా విస్తరణ తీవ్రంగా ప్రభావితమవుతోంది. జనన రేట్లు తగ్గడం వల్ల 10-14 సంవత్సరాల వయసు గల పిల్లల జనాభా దేశంలో 24 శాతం మేర క్షీణించింది. ప్రస్తుతానికి 15 నుండి 59 ఏండ్ల లోపు పనిచేయగల వయసు గల జనాభా 66.4 శాతానికి పెరగడం దేశ ఆర్థిక వృద్ధికి డెమోగ్రాఫిక్ డివిడెండ్ రూపంలో ఒక గొప్ప వరంగా మారినప్పటికీ, ఇది తాత్కాలికం మాత్రమే. మరోవైపు 60 ఏండ్లు పైబడిన వృద్ధుల జనాభా ఇప్పటికే 9.7 శాతానికి చేరుకుంది. పిల్లల సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరుగుతున్న ఈ తూర్పు ఆసియా తరహా సంక్షోభం భవిష్యత్తులో దేశంపై వృద్ధాప్య భారాన్ని పెంచే ప్రమాదం ఉంది. కాబట్టి, ప్రభుత్వం కేవలం వివాహ వయసు చట్టాలకే పరిమితం కాకుండా విద్యా విధానాలు, మహిళల ఆరోగ్యం, మారుతున్న ఉపాధి అవసరాలకు అనుగుణంగా తక్షణ విధానపరమైన మార్పులు చేపట్టాల్సి ఉంది.