ఉద్యోగానికి తొలిమెట్టు నైపుణ్యం
ఉద్యోగానికి తొలిమెట్టు నైపుణ్యం
నేడు జులై 15 ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం (వరల్డ్ యూత్ స్కిల్ డే). ఐక్యరాజ్యసమితి 2014లో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా యువతకు నాణ్యమైన నైపుణ్య విద్యను అందించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, స్వయం ఉపాధివైపు వారిని ప్రోత్సహించడం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో యువత పాత్రను బలోపేతం చేయడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం.
ప్రతి ఏడాది ఈ రోజు కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో యువత స్థానాన్ని, వారి నైపుణ్యాల ప్రాధాన్యాన్ని గుర్తు చేసే సందర్భంగా నిలుస్తోంది. ప్రపంచం నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేగంగా దూసుకుపోతోంది. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ), రోబోటిక్స్, ఆటోమేషన్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీలు ఉపాధి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ‘స్కిల్’ అనే పదానికి అపూర్వమైన ప్రాధాన్యం ఏర్పడింది. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం. ఈ జనాభాను సరైన దిశలో నడిపితే భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రస్థానానికి చేరుకోగలదు.
ఉన్నత విద్య పూర్తి చేసిన యువతలో కూడా పరిశ్రమలు కోరుకునే సాంకేతిక, డిజిటల్, కమ్యూనికేషన్, సమస్య పరిష్కార సామర్థ్యాలు కొరవడుతున్నాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్కిల్ ఇండియా మిషన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, డిజిటల్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి.
అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటిఐలు, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ద్వారా ఉపాధి ఆధారిత శిక్షణను విస్తరిస్తున్నాయి. అయినప్పటికీ, ఈ కార్యక్రమాల ఫలితాలు ప్రతి గ్రామానికి, ప్రతి నిరుద్యోగ యువకుడికి చేరేలా అమలు జరగడం అత్యంత అవసరం.
ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, సమాజం కలిసి యువతకు నైపుణ్యాలను అందించే ఉద్యమంగా ముందుకు సాగాలి.
ఆళవందార్ వేణు మాధవ్