Skip to content
తెలంగాణ వార్తలు

అక్షర శిల్పులకు అర్హత సెగ

Prajapaksham 14 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
అక్షర శిల్పులకు అర్హత సెగ

అక్షర శిల్పులకు అర్హత సెగ

కాలగిరి శ్రీనివాస్‌ రెడ్డి

‘బడి గడప దాటి సమాజ వికాసానికి బాటలువేసే అక్షర శిల్పులు ఉపాధ్యాయులు. తరాల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో తమ జీవితాలనే ధారపోసే గురువులు నేడు ఒక అపరిచిత ఆందోళనతో, అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్నారు. దశాబ్దాల బోధనా అనుభవం ఒకవైపు … చట్టబద్ధమైన పరీక్షా నిబంధనలు మరోవైపు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ’టెట్‌’ (TET) అనేది కేవలం అర్హత పరీక్షగా కాకుండా, వేలాదిమంది ఉద్యోగ ఉపాధ్యాయుల మనుగడ ప్రశ్నగా మారింది.
ఇటీవల సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. పునఃసమీక్ష అభ్యర్థనలను తిరస్కరిస్తూ, టెట్‌ తప్పనిసరి అని పునరుద్ఘాటించింది. ఐదేళ్లకు పైగా ఉద్యోగ కాలం మిగిలి ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించాలని పేర్కొంది. అలాగే గడువును 2027 ఆగస్టు 31 నుంచి 2028 ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఇదే చివరి అవకాశం అని కూడా స్పష్టం చేసింది. దీని వెనుక ఉన్న ఉద్దేశం విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడమే. అనుభవం మాత్రమే సరిపోదని, బాల ల మనోవిజ్ఞానం, ఆధునిక బోధనా విధానాలు, సమకాలీన విద్యా నైపుణ్యాలపై కూడా ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలనే అభిప్రాయాన్ని న్యాయస్థానం వ్యక్తం చేసింది.తెలంగాణలో సుమారు 30 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఇంకా టెట్‌ అర్హత పొందలేదు. 2026 జనవరి లో నిర్వహించిన టెట్‌లో ఉద్యోగ ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం 57.76% మాత్రమే ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ప్రభుత్వ నిర్ణయం స్వాగతించదగ్గదే..
ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులు, ప్రజాప్రతినిధుల సూచనలు, పాఠశాల విద్యాశాఖ నివేదికలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్‌ను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించడం అభినందనీయం. దీంతో ఉద్యోగ ఉపాధ్యాయులు సాధారణ అభ్యర్థులతో పోటీ పడాల్సిన అవసరం తగ్గుతుంది. వారికి అనుకూల వాతావరణంలో పరీక్షరాసే అవకాశం లభిస్తుంది. ఇది ప్రభు త్వం సమస్యను సానుకూలంగా అర్థం చేసుకుందనే సంకేతం.
సబ్జెక్టుల వైరుధ్యం.. మానసిక నైరాశ్యం
ప్రభుత్వం ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమే. అయితే ఉద్యోగ ఉపాధ్యాయులు లేవనెత్తుతున్న కొన్ని సమస్యలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం అమలులో ఉన్న పరీక్షా విధానం, పాఠ్యాంశాల రూపకల్పన, అర్హతా ప్రమాణాల విషయంలో ప్రభుత్వం మరోసారి సమగ్రంగా పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. అత్యంత ప్రధానంగా వినిపిస్తున్న అభ్యంతరం ప్రస్తుత టెట్‌ పాఠ్యాంశాలు ఉద్యోగ ఉపాధ్యాయులు బోధిస్తున్న అంశాలకు పూర్తిగా అనుగుణంగా లేకపోవడమే. పాఠశాలలో గణితాన్ని బోధించే ఉపాధ్యాయుడు పరీక్ష కోసం జీవశాస్త్రం, సామాజిక శాస్త్రం వంటి ఇతర అంశాలను కూడా చదవాల్సి వస్తోం ది. అలాగే విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు గణితం లేదా సామాజిక శాస్త్రంలోని అంశాలను అభ్యసించాల్సి వస్తోంది.
శిక్షగా మారొద్దు.. సామర్థ్య వికాసానికి వేదికవ్వాలి!
టెట్‌ను కేవలం పరీక్షగా కాకుండా ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధికి ఉపయోగపడే ప్రక్రియగా ప్రభుత్వం చూడాలి. దేశంలోని ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేస్తే ఉపాధ్యాయులకు, విద్యా వ్యవస్థకు రెండింటికీ మేలు జరుగుతుంది. అదే సమయంలో ఉపాధ్యాయ సంఘాలు కూడా కేవలం డిమాండ్లకే పరిమితం కాకుండా సభ్యులను పరీక్షకు సిద్ధం చేసే బాధ్యతను స్వీకరించాలి. శిక్షణా శిబిరాలు, అధ్యయన వేదికలు, మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాలి.
విద్యా ప్రమాణాలను పెంపొందించడం ప్రభుత్వ బాధ్యత. అదే సమయంలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయుల అనుభవాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యమైనది. ఉపాధ్యాయులు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో తరగతి గదిలో నిలబడగలిగితేనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది.

ట్యాగ్‌లు: students Teachers Telangana