హైదరాబాద్‌లో విదేశీయులకు సులభంగా ఇండియన్ పాస్‌పోర్టులు ?… అక్రమ పాస్‌పోర్టుల కలకలం..
హైదరాబాద్‌లో విదేశీయులకు సులభంగా ఇండియన్ పాస్‌పోర్టులు ?… అక్రమ పాస్‌పోర్టుల కలకలం..
దేశంలోనే అత్యుత్తమ పాస్‌పోర్టు పోలీసు వెరిఫికేషన్ సేవలు అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ పోలీసులకు ఇటీవల కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. డీజీపీ సీవీ ఆనంద్ ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు.
2025-26లో 8.67 లక్షలకు పైగా పాస్‌పోర్టు దరఖాస్తులను 99 శాతం విజయవంతంగా, సగటున 57 రోజుల్లో పరిశీలించినందుకు ఈ గుర్తింపు లభించింది. అయితే, ఈ ప్రశంసల మధ్యే హైదరాబాద్‌లో విదేశీయులు నకిలీ పత్రాలతో భారతీయ పాస్‌పోర్టులు పొందుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు విదేశీయులు భారతీయ పాస్‌పోర్టులతో విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో పట్టుబడ్డారు. ఈ ఉదంతంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్న కీలక అంశాల్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ఫీల్డ్ వెరిఫికేషన్‌లో లోపాలున్నాయా? స్థానిక చిరునామాలు, నివాస ధ్రువీకరణ, పౌరసత్వ వివరాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా పరిశీలిస్తున్నారా? అనే ప్రశ్నలు ఉన్నాయి.
ఇది కొత్త సమస్య కాదు. 2021లో వెలుగుచూసిన భారీ నకిలీ పాస్‌పోర్టు రాకెట్లో బంగ్లాదేశ్ పౌరులకు ఒకే చిరునామాలతో డజన్ల కొద్దీ భారతీయ పాస్‌పోర్టులు జారీ అయినట్లు దర్యాప్తులో బయటపడింది. ఆ కేసులో పోలీసు సిబ్బందిపై కూడా చర్యలు తీసుకున్నారు.
స్పెషల్ బ్రాంచ్ పోలీసుల భౌతిక వెరిఫికేషన్ కేవలం పేరుకే జరుగుతోందా? నకిలీ ఆధార్, ఓటర్ ఐడీ, ఇతర పత్రాలతోనే పాస్‌పోర్టులు పొందుతున్నారా? మధ్యవర్తుల నెట్వర్క్ ఇంకా కొనసాగుతోందా? విదేశీయులు భారతీయులుగా మారి విదేశాలకు వెళ్లడం జాతీయ భద్రతకు ముప్పుగా మారుతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పాస్‌పోర్టు అనేది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే కాదు. భారత పౌరుల మాదిరిగా అన్ని ప్రభుత్వ సేవలు పొందే అత్యంత కీలక గుర్తింపు పత్రాల్లో ఒకటి. అలాంటి పత్రం నకిలీ ఆధారాలతో విదేశీయుల చేతికి వెళ్తే అది జాతీయ భద్రతకే సవాలుగా మారుతుందని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
శ్రీలంక మహిళకు భారత పాస్‌పోర్టు..
ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీ చేయగా, శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు వచ్చిన పుష్ప కుమారి అంగ్లూరి అనే మహిళ వద్ద భారత పాస్పోర్టుతో పాటు, హలియావత్తలగే పుష్ప కుమారి పేరిట జారీ అయిన శ్రీలంక పాస్‌పోర్టు కూడా లభించింది.
విచారణలో ఆమె 2009లో శ్రీలంక పాస్పోర్టుతో భారతదేశానికి వచ్చి, తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉండి, తన అసలు గుర్తింపును మార్చుకుని మోసపూరితంగా భారత పాస్‌పోర్టు పొందినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అఫ్గాన్ పౌరుడికి భారత పాస్‌పోర్టు..
అఫ్గానిస్థాన్‌కు చెందిన సామియుల్లా షా అనే వ్యక్తి భారత పాస్‌పోర్టు (నం. Y5778942)తో ఎమిరేట్స్ విమానం ద్వారా దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాడు.
ప్రయాణ పత్రాలను పరిశీలించిన ఇమ్మిగ్రేషన్ అధికారులకు డేటాబేస్‌లో అబ్దుల్లా దాద్ మహ్మద్ అనే అఫ్గానిస్థాన్ పౌరుడి వివరాలు కనిపించాయి. 2020లో మెడికల్ వీసాపై భారత్‌కు వచ్చిన ఆ వ్యక్తి ఇప్పటికీ దేశం విడిచి వెళ్లలేదని రికార్డులు వెల్లడించాయి.
ఈ వ్యవహారంలో నకిలీ పత్రాలు రూపొందించడం, భారత పాస్‌పోర్టు పొందేందుకు సహకరించిన ఏజెంట్ల ప్రమేయంపై లోతుగా సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీ గుర్తింపు పత్రాలతో మహిళకు పాస్‌పోర్టు..
దుబాయ్ నుంచి విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న దొండపాటి సుజేవను ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. విచారణలో ఆమె తన అసలు పేరు పట్టా మేరీ రాజ్యలక్ష్మి అని, అయితే దొండపాటి సుజేవ పేరుతో నకిలీ గుర్తింపు పత్రాల ఆధారంగా భారత పాస్‌పోర్టు పొందినట్లు అంగీకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ పాస్‌పోర్టు పొందేందుకు కువైట్‌లో ఉన్న రమేష్ దొండపాటి సహకరించినట్లు కూడా ఆమె వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.
ఈ వ్యవహారంలో నకిలీ పత్రాల తయారీ, పాస్‌పోర్టు పొందేందుకు సహకరించిన వ్యక్తులు, అంతర్జాతీయ నెట్వర్క్ ప్రమేయం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.