వ్యవసాయంపై సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రం
వ్యవసాయంపై సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రం
రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై సూపర్ ఎల్‌నినో ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలు బలహీనపడి, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ సాగు తీవ్ర సంక్షోభంలో పడింది.
వానాకాలం ప్రారంభమై దాదాపు 40 రోజులు గడిచినా రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటలు వేసేందుకు రైతులు జంకుతున్నారు. ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో జూన్ నెలలో సాధారణం కంటే 22 శాతం తక్కువ వర్షపాతం నమోదుకాగా, జులై రెండో వారం నాటికి రాష్ట్ర సగటు వర్షపాత లోటు 13 శాతం నుంచి 16.5 శాతం వరకు నమోదైంది.
సాధారణంగా ఈ సమయానికి 177.9 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, కేవలం 154.9 మి.మీ. మాత్రమే నమోదు కావడంతో పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. ఎల్‌నినో సృష్టించిన వర్షపాత లోటు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 17 నుంచి 26 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ (లోటు) వర్షపాతం నమోదైంది.
వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లోని పలు మండలాలు తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయి. కొన్ని దక్షిణ, పశ్చిమ జిల్లాల్లో ఈ లోటు మరింత ఎక్కువగా ఉంది.
మొత్తం 1.32 కోట్ల ఎకరాల సాగు భూమి ఉండగా, వర్షపాత లోటు కారణంగా రాష్ట్రంలో జులై మొదటి వారం ముగిసేసరికి కేవలం 14.78 లక్షల (11.2 శాతం) ఎకరాల్లోనే సాగు పనులు ప్రారంభమయ్యాయి. ఈ సమయానికి గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు సగానికి పైగా తక్కువ ఉంది.
రాష్ట్రంలో వరి సాధారణ సాగు విస్తీర్ణ లక్ష్యం దాదాపు 65.97 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 4.22 లక్షల ఎకరాల్లో (అంటే కేవలం 6.40 శాతం) మాత్రమే నాట్లు పడ్డాయి. వర్షాలు లేకపోవడంతో నీరు లేక వేసిన నారుమడులు ఎండిపోతున్నాయి.
మరోవైపు తొలకరి జల్లులు చూసి రైతులు ముందస్తుగా వేసిన పత్తి, మొక్కజొన్న, కంది వంటి ఆరుతడి పంటల మొలకలు ఎండ తీవ్రతకు, తేమ లేక ఎండిపోతున్నాయి. దీంతో చాలా మంది రైతులు విత్తనాలు మొలకెత్తక రెండు, మూడు సార్లు విత్తనాలు వేయాల్సి రావడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా గ్రామాల్లో పశువులకు పచ్చిమేత దొరకడం కూడా గగనమైపోయింది.
వట్టిపోతున్న సాగునీటి ప్రాజెక్టులు
ఎల్‌నినో దెబ్బకు వర్షాలు లేకపోవడంతో కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు వట్టిపోతున్నాయి. రెండు ప్రధాన బేసిన్లలో సాధారణంగా ఈ సమయానికి రిజర్వాయర్లలో 522.31 టీఎంసీల నీటి నిల్వలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 333.34 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణలో అధిక శాతం వ్యవసాయం బోరుబావులపై ఆధారపడి ఉండగా, వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు భారీగా క్షీణించాయి. వ్యవసాయ బోర్లు పూర్తిగా ఎండిపోతున్నాయి. దీంతో రైతులు 1000 అడుగులు వేసినా చుక్క నీరు పడని పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే రబీ సీజన్లో ఎలా ఉండనుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ప్రాజెక్టులోనూ నీరు లేదు
వర్షాకాలం సగం ముగిసినా సరైన వర్షం కురవకపోవడంతో జలవనరులు వట్టిపోతున్నాయి. నాగార్జునసాగర్ పరివాహక ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటల్లో కొద్ది కొద్దిగా నీరు కనిపిస్తోంది తప్ప మిగిలిన ప్రాంతాల్లో జలవనరులు ఎండిన బీళ్లను తలపిస్తున్నాయి.
మధ్యతరహా ప్రాజెక్టుల్లో కూడా నీరు లేదు. రెండు రోజుల నుంచి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా మధ్యతరహా ప్రాజెక్టులోకి గోదావరి నీరు చేరుతోంది. ఎన్ని రోజులకు వైరా చెరువు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుందో స్పష్టత లేదు.
వైరా, పాలేరు, లంకాసాగర్ మొదలైన మధ్యతరహా ప్రాజెక్టులను మినహాయిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏ ప్రాజెక్టులోనూ నీరు లేదు. వర్షాలు లేకపోవడంతో సాగునీటిని అందించడం సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
జీవనది లాంటి మున్నేరుకు ఇప్పటివరకు కొత్త నీరు రాకపోవడంతో నీటి కదలిక లేదు. వైరా, కిన్నెరసాని, కట్టలేరు, పెద్దవాగు, ముక్కమామిడి మొదలైన ప్రాజెక్టుల కింద ఉన్న లక్షలాది ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది.
శాపమైన జాప్యం
సాగునీటి ప్రాజెక్టుల పట్ల పాలకుల నిర్లక్ష్యం రైతాంగానికి శాపంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పంటల భూములకు సాగునీటిని అందించేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కానీ ఎకరానికి కూడా నీటిని అందించలేదు.
ప్రతి ఏడాది సుమారు 750 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. గోదావరి నీటిని పొలాలకు మళ్లించాలన్న సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 2004లో జలయజ్ఞం ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ పేర్లతో రెండు ప్రాజెక్టులు ప్రారంభించి రూ.2,100 కోట్లు ఖర్చు చేశారు.
వైఎస్ మరణం, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత 2016లో సీతారామ ప్రాజెక్టు పేరుతో గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
2019 నాటికి పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదివేల కోట్లు ఖర్చు చేసింది. ప్రధాన కాలువల్లో అధిక భాగం, పంప్‌హౌస్‌లు పూర్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును కాదనకపోయినా సరిపడా నిధులు కేటాయించకపోవడంతో అంచనాలు పెరిగి, ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేని స్థితి ఏర్పడింది.
ఎల్‌నినో పరిస్థితుల్లో కూడా గోదావరికి కొత్త నీరు చేరుతుందనే నేపథ్యంలో ప్రాజెక్టులు పూర్తయి ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సుమారు ఏడు లక్షల ఎకరాలకు సాగునీటి కొరత ఉండేది కాదు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యమే ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం పాలిట శాపంగా మారి, ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.