Daivalaguda Incident: షాబాద్ హత్యాకాండపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం.. ఎస్సై సస్పెండ్.. రాజకీయ రంగు పులుముకున్న ఘటన..
Daivalaguda Incident: షాబాద్ హత్యాకాండపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం.. ఎస్సై సస్పెండ్.. రాజకీగ రంగు పులుముకున్న ఘటన..
Daivalaguda Incident: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో నిందితుడు రాజ్‌కుమార్.. ఆరుగురిని కిరాతకంగా నరికి చంపిన ఘటనపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ మారణహోమం జరిగిందని మండిపడుతూ.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, బాధితుల బంధువులు ఉదయం నుంచి షాబాద్ చౌరస్తాలో హైవేపై బైఠాయించి భారీ ఆందోళన నిర్వహించారు.
నిందితుడిని తమకు అప్పగించాలంటూ నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యకు గ్రామస్థుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి పంపించివేశారు.
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి స్వయంగా ఆందోళన స్థలానికి చేరుకుని గ్రామస్థులతో చర్చలు జరిపారు. పోక్సో కేసు నిందితుడికి స్టేషన్ బెయిల్ లభించేలా తక్కువ శిక్ష పడే సెక్షన్లు పెట్టి.. బాధితులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక ఎస్సై రమేశ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. అలాగే, ఈ దారుణ హత్యాకాండలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన దివ్యాంగ బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కలెక్టర్ హామీలతో శాంతించిన గ్రామస్థులు తమ ఆందోళనను విరమించారు.
దర్యాప్తులో వెలుగుచూస్తున్న మరికొన్ని వివరాలు పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో శంషాబాద్‌లో ఇంటర్ పరీక్షలు రాయడానికి వెళ్లిన బాధిత బాలికను రాజ్‌కుమార్ అడ్డుకుని.. మీ నాన్నను ఎలా చంపేశానో.. మిమ్మల్నీ అలాగే చంపేస్తా అని తీవ్రంగా బెదిరించినట్లు సమాచారం. ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించలేదని.. పైగా ఫిర్యాదుదారులతో దురుసుగా ప్రవర్తించారని బంధువులు ఆరోపిస్తున్నారు. అప్పుడే పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఆరుగురు ప్రాణాలు దక్కేవని వారు మండిపడుతున్నారు.
మరోవైపు హత్యల అనంతరం నిందితుడు రాజ్‌కుమార్ పరారైన కారును పోలీసులు నందిగామ సమీపంలో గుర్తించారు. అక్కడ కారును వదిలేసి.. అతడు సమీప రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడికి కారును అద్దెకు ఇచ్చిన యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి.
ఈ దారుణం తెలంగాణ రాజకీయాల్లోనూ తీవ్ర కలకలం రేపింది. దైవాలగూడలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు చేవెళ్ల వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ఉన్నారు. అలాగే శంకర్పల్లి వద్ద ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, పట్నం నరేందర్‌రెడ్డిలను అరెస్ట్ చేయగా.. పట్లోళ్ల కార్తీక్‌రెడ్డిని గృహనిర్బంధం (House Arrest) చేశారు. ఒకవైపు ప్రజా నిరసనలు, మరోవైపు పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలు, ఇంకోవైపు ప్రతిపక్ష నేతల అరెస్టులతో షాబాద్ ప్రాంతమంతా భారీ బందోబస్తు నడుమ ఉత్కంఠగా మారింది.