Yarlung Tsangpo Dam: బ్రహ్మపుత్ర నదిపై చైనా మెగా డ్యామ్.. భారత్‌తో పాటు పొరుగు దేశాలకు పొంచి ఉన్న భూకంప ముప్పు.. శాస్త్రవేత్తల నుంచి తీవ్ర అభ్యంతరాలు..
Yarlung Tsangpo Dam: బ్రహ్మపుత్ర నదిపై చైనా మెగా డ్యామ్.. భారత్‌తో పాటు పొరుగు దేశాలకు పొంచి ఉన్న భూకంప ముప్పు.. శాస్త్రవేత్తల నుంచి తీవ్ర అభ్యంతరాలు..
Yarlung Tsangpo Dam: దాయాది దేశం చైనా భారత్ కు పెనుముప్పును తీసుకువస్తోంది. టిబెట్‌లోని యార్లంగ్ త్సాంగ్పో నదిపై చైనా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జలవిద్యుత్ ప్రాజెక్టు భద్రతపై ఇప్పుడు చైనా శాస్త్రవేత్తల నుంచే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నది భారతదేశంలోకి బ్రహ్మపుత్ర పేరుతో ప్రవహిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ మెగా డ్యాం వల్ల ఆసియా దేశాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ మెగా డ్యామ్ నిర్మాణం వల్ల దిగువన ఉన్న భారతదేశం, బంగ్లాదేశ్‌లలో నీటి సరఫరా దెబ్బతినడమే కాకుండా తీవ్ర పర్యావరణ నష్టం వాటిల్లుతుందనే ఆందోళనలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. బీజింగ్ అధికారిక మద్దతుతో జరిగిన తాజా భూగర్భ శాస్త్ర అధ్యయనం ఈ ప్రాజెక్టు కింద ఒక క్రియాశీల భూకంప రేఖ (Active Fault Line) ఉన్నట్లు గుర్తించిందని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన ప్రత్యేక కథనంలో వెల్లడించింది.
ప్రభుత్వ యాజమాన్యంలోని చైనా జియోలాజికల్ సర్వే పర్యవేక్షణలో చెంగ్డూ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ.. చైనా సివిల్-మిలిటరీ ఇంటిగ్రేషన్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. గత నెలలో చైనీస్ భాషా పత్రిక సెడిమెంటరీ జియాలజీ అండ్ టెథియన్ జియాలజీ లో ప్రచురితమైన ఈ నివేదిక ప్రకారం.. ఈ భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు యొక్క జలాశయ (Reservoir) ప్రాంతం గుండా పైజెన్ ఫాల్ట్ అనే ప్రమాదకరమైన భూకంప పగులు రేఖ నేరుగా వెళుతోంది. ఈ ఫాల్ట్ లైన్ హిమయుగం కాలం నుండి నేటి హోలోసీన్ కాలం వరకు.. అంటే సుమారు 9,500 సంవత్సరాల క్రితం వరకు కూడా నిరంతరం చురుకుగా ఉన్నట్లు భూగర్భ ఆధారాలు లభించాయి. దీనికి మరింత ఊతంగా.. 2017లో టిబెట్‌లో ఈ ఫాల్ట్ ఉత్తర కొన సమీపంలో సంభవించిన 6.9 తీవ్రత గల భయంకర మిలిన్ భూకంపం గురించి పరిశోధకులు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ క్రియాశీల ఫాల్ట్ లైన్ కారణంగా చుట్టుపక్కల ఉన్న రాళ్లు విచ్ఛిన్నమై.. వాటి సహజ యాంత్రిక లక్షణాలు మారిపోయాయని చైనా పరిశోధక బృందం గుర్తించింది. దీనివల్ల డ్యామ్ వంటి భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టుల పునాది భరణ సామర్థ్యం, నిర్మాణ స్థిరత్వం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. జలాశయ ప్రాంతంలోని భూభాగం చాలా వదులుగా, బలహీనమైన సమన్వయాన్ని కలిగి ఉండటం వల్ల భవిష్యత్తులో భూకంపాలు సంభవిస్తే కొండచరియలు విరిగిపడటం, భూభాగం కూలిపోవడం వంటివి జరిగి ప్రాజెక్టు మౌలిక సదుపాయాలతో పాటు అక్కడి సిబ్బందికి కూడా భారీ ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. దీర్ఘకాలం పాటు నీరు నిలిచి ఉండటం వల్ల జలాశయానికి ఇరువైపులా ఉన్న వాలులలో అస్థిరత మరింత సులభంగా ప్రేరేపించబడుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
గత సంవత్సరమే ఈ యార్లంగ్ త్సాంగ్పో డౌన్‌స్ట్రీమ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమైంది. చైనాలోని ప్రసిద్ధ త్రీ గోర్జెస్ డ్యామ్ సామర్థ్యానికి దాదాపు మూడు రెట్లు పెద్దది ఈ ప్రాజెక్టు. ఇది పూర్తయితే ఏటా సుమారు 300 బిలియన్ కిలోవాట్-గంటల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న క్వాటర్నరీ టెక్టోనిక్ కదలికల రికార్డులను బట్టి చూస్తే ప్రాజెక్టు మనుగడకే ప్రమాదం పొంచి ఉందని తేలింది.
ఈ ప్రమాద తీవ్రతను తగ్గించడానికి, కొండచరియలు విరిగిపడే అవకాశాలను నివారించడానికి, నిర్మాణం జరుగుతున్న సమయంలోనే వాలులను బలోపేతం చేయడం.. నిలుపుదల అవరోధాలను ఏర్పాటు చేయడం వంటి ప్రత్యేక సాంకేతిక చర్యల ద్వారా నిర్మాణ స్థిరత్వాన్ని పటిష్టం చేయాలని తాజా చైనా అధ్యయనం గట్టిగా సిఫార్సు చేస్తోంది. ఈ డ్యామ్ నిర్మిస్తున్న ప్రాంతంలో ఒకవేళ భూకంపం వచ్చి ఆనకట్ట దెబ్బతింటే.. ఆ ప్రవాహం దిగువన ఉన్న భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌లో ఎలాంటి జలప్రళయానికి దారి తీస్తోందనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.