Skip to content
ఎడిట్ పేజి వార్తలు

కేంద్రానికి ఖరీఫ్‌ పరీక్ష

Prajapaksham 11 Jul 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
కేంద్రానికి ఖరీఫ్‌ పరీక్ష

Kharif test for the center

ఎల్‌ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా ఈ ఏడాది కరువు పరిస్థితులు నెలకొనే అవకాశమున్నట్లు శాస్త్రజ్ఞులు గత కొద్ది కాలంగా హెచ్చరిస్తున్నా. అయితే, గడిచిన రెండు మాసాలలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. జూన్‌ మాసంలో 40 శాతం లోటు వర్షపాతం నమోదవ్వగా, జులై తొలి వారం రోజులలో సాధారణం కంటే 42 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితులు దేశం ఎదుట బహుళ సవాళ్ళను విసురుతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ సన్నద్ధతకు పరీక్షగా నిలవనున్నాయి.
దేశవ్యాప్తంగా జులై 1 నుంచి 8వ తేదీ వరకు భారతదేశంలో 9.2 సెంటీమీటర్ల సగటు వర్షం కురిసింది. ఇది సాధారణంగా నమోదయ్యే 6.5 సెంటీమీటర్లకంటే ఎక్కువే. 1901 నుంచి చూసినట్లయితే, ఐదవ సారి మాత్రమే జూన్‌ మాసంలో లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌ లోటును, జులై ఆరంభంలో అధిక వర్షపాతానికి కలిపినట్లయితే మొత్తం లోటు 15.2 శాతానికి తగ్గింది. గతంలోని వివిధ కాలాలలో పరిశీలించినట్లయితే, 1971 2020 నడుమ జూన్‌ 1 నుంచి జులై 8 వరకు సగటు వర్షపాతం 19.5 సెంటీమీటర్లు. అయితే ఈసారి కూడా అది 19.5 సెంటీమీటర్లే. ఇది పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.
వాయువ్య, మధ్య, పశ్చిమ భారతదేశంలో అధిక వర్షాలు కురిసాయి. పడిన వర్షాలు కూడా ఎక్కువగా ముంబై, ఢిల్లీ, గుర్‌గావ్‌ వంటి నగర ప్రాంతాలలో ఎక్కువగా నమోదైన కారణంగా ఎక్కువ ప్రయోజనకారి కావు. ఆ నగరాలలో సరైన మౌలిక సదుపాయాలు లేక అనేక ప్రాంతాలు నీటి మునిగిన ఘటనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుచూపు రాహిత్యాన్ని, సన్నద్ధత లోపాలను ఎత్తి చూపాయి. పలు చోట్ల జనజీవన స్థంభించింది. తూర్పు, ఈశాన్య, కొన్ని మధ్య భారత ప్రాంతాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయి. దక్షిణ ద్వీపకల్పంలో నైరుతి రుతుపవనాలు మందకొడిగా ప్రారంభమయ్యాయి. జూన్‌ 1 నుండి జులై 8 మధ్య దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో మొత్తం వర్షపాతం సాధారణం కంటే సుమారు 19 శాతం తక్కువగా నమోదైంది. ఈ సారి రుతుపవనాలు ఆలస్యంగా జూన్‌ 4న ప్రారంభమమై, నెమ్మదిగా కదులుతున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవని ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై పడింది. తెలంగాణలో జూలై ఆరంభంలో విస్తారంగా స్వల్ప వర్షాలు కురిసినప్పటికీ, ఆ తర్వాత రాష్ట్రంలో రుతుపవనాల పురోగతి బలహీనపడి, పొడి వాతావరణం నెలకొంది. జూన్‌ జులై మాసాలలో సాధారణంగా నమోదయ్యే సగటు వర్షపాతం 18.5 సెంటీమీటర్ల కంటే తక్కువగా 15.6 సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది.
లోటు వర్షపాతంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. పలు చోట్ల ఆలస్యంగా పంటలు వేయడం, వేసిన నాట్లు, విత్తనాలు ఎండిపోతున్న ప్రమాద సంకేతాలను సూచిస్తూ వార్తలు వస్తున్నాయి. పట్టణ, నగర ప్రాంతాలలో నీటి ఎద్దడి నెలకొంటున్నది. అప్పుడే ట్యాంకర్‌ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కేంద్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జులై 8వ తేదీ నాటికి 350.58 లక్షల హెక్టార్‌లలో వానాకాలం సాగు జరిగింది. రుతుపవనాలు ఆలస్యమైన ప్రభావం పత్తి, సోయాబీన్‌ల సాగుపై పడింది. అలాగే ప్రభుత్వాలు వర్షాధార పంటలను నిరుత్సాహపరుస్తూ జొన్న లు, మొక్కజొన్నలు, పెసలు, రాగులు, సజ్జలు, కందులు, మినుములు వంటి ఆరుతడి పంటలు వేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం సైతం వరి కంటే మెట్ట పంటలకే ప్రాధాన్యత నివ్వాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.
ఎల్‌ నినో కారణంగా నైరుతి రుతుపవనాలు మందగమనంతో నెలకొన్న అస్థిర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర సన్నద్ధతతో ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చెప్పినప్పటికీ, ఆచరణ ఎంత వరకో చూడవలసి ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, కర్నాటక, బిహార్‌, జార్ఖండ్‌, బిహార్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిషాలో పరిస్థితులను కేంద్రం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నది. జులై మాసంలో తొలినాళ్ళ మాదిరిగానే వర్షాలు పుంజుకొని ఖరీఫ్‌కు ఊపునిస్తుందని వ్యవసాయ శాఖ ఆశాభావంతో ఉంది. భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్‌) సహకారంతో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న జిల్లాల వివరాలతో కూడిన కంటింజెన్సీ ప్లాన్‌లను రాష్ట్రాలకు ఏప్రిల్‌లోనే పంపి, సన్నద్ధం కావాలని రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు కేంద్రం చెబుతోంది.
తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులలో రైతులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు ‘ప్రధాన మంత్రి పంట బీమా పథకం’లో రైతుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి చౌహాన్‌ వెల్లడించారు. ఎల్‌ నినో దృష్ట్యా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి విస్తృత యంత్రాంగం అందుబాటులో ఉంచామని, ఎల్‌నినో మానిటరింగ్‌ సెల్‌, క్రాప్‌ వెదర్‌ వాచ్‌ గ్రూప్‌, రాష్ట్ర స్థాయి కంట్రోల్‌ రూమ్‌లు, ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. వానాకాలం పంటలకు సంబంధించి రైతులకు అన్ని రకాల సహకారం అందించేందుకు కేంద్రం సర్వ సన్నద్ధంగా ఉన్నట్లు చెబుతున్న మాటల్లో నిజమెంతో భవిష్యత్తులో తెలుస్తుంది. నిజానికి రైతులకు ఇంతకంటే ఎక్కువ భరోసా అవసరం. ప్రభుత్వాలు చెబుతున్న మాటలు ఆచరణ లో ఎంత వరకు అమలు అవుతున్నాయనే దానిపై చిత్తశుద్ధి ఆధారపడి ఉంటుంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను ఉజ్జాయింపుగా చూస్తూ, కర్షకులకు కావాల్సిన సహకారాన్ని సకాలంలో అందించగలిగితే, నష్టాలను నివారించవచ్చు. మొత్తానికి ప్రస్తుత ఖరీఫ్‌ ప్రభుత్వాలకు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికీ పరీక్షా కాలమే!

ట్యాగ్‌లు: El Niño El Niño effect Modi