Congress Vs BRS: మనవడి కోసం బయటకు వచ్చిన కేసీఆర్.. తెలంగాణ ప్రజల కోసం ఎందుకు రావడం లేదు.. హరీష్ రావుకు కాంగ్రెస్ కౌంటర్..
Congress Vs BRS: మనవడి కోసం బయటకు వచ్చిన కేసీఆర్.. తెలంగాణ ప్రజల కోసం ఎందుకు బయటకు రావడం లేదు.. బీర్ఎస్ నేతలకు కాంగ్రెస్ కౌంటర్..
Congress Vs BRS: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి మంచి పనిని వ్యతిరేకించడమే బీఆర్ఎస్ పార్టీ పనిగా పెట్టుకుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మనవడి కోసం బయటకు వచ్చిన కేసీఆర్, తెలంగాణ ప్రజల సమస్యల కోసం ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు.
రాజస్థాన్‌లో రుదాలీలు చనిపోయిన వారి దగ్గర ఏడ్చినట్లు, తెలంగాణలో కల్వకుంట్ల తెగ.. ఇక్కడి అభివృద్ధిని చూసి ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నా, మూసీ ప్రక్షాళన చేస్తున్నా, రైతులకు బోనస్ ఇస్తున్నా కల్వకుంట్ల కుటుంబానికి ఏడుపేనని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేసినా బీఆర్ఎస్‌కు బాధేనని విమర్శించారు.
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని నిర్మించింది.. దాని డిజైన్ మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, వారి హయాంలోనే అది కుంగిపోయిందని గుర్తుచేశారు. ఎన్డీఎస్ఏ (NDSA) నివేదిక ప్రకారం మేడిగడ్డ ప్రాంతం భారీ బ్యారేజీ నిర్మాణానికి అస్సలు అనుకూలం కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు.. అక్కడ బలవంతంగా నీళ్లు నింపితే బ్యారేజీ ఊడిపోయి 44 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయాలు చేసే అలవాటు కాంగ్రెస్‌కు లేదన్నారు. గతంలో నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిపుణుల సూచనలతో కాంగ్రెస్ నిర్మించిందని, సమయాన్ని బట్టి డాక్టర్, ఇంజనీర్ అవతారాలు ఎత్తే పగటి వేషగాళ్ల కుటుంబం బీఆర్ఎస్ అని విమర్శించారు.
గతంలో మహారాష్ట్రతో 152 మీటర్ల ఒప్పందం చేసుకుని రాజ్‌భవన్‌లో దావత్ చేసుకున్నది బీఆర్ఎస్ నేతలేనని యెన్నం శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేశారు. ప్రధాని మోదీతో రాజకీయ సాన్నిహిత్యం పెట్టుకున్నది కూడా ఆ పార్టీ నాయకత్వమేనన్నారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ముంపును తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. మెట్రో విస్తరణ కోసం కేంద్రంతో, కృష్ణా-తుంగభద్ర జలాల కోసం పొరుగు రాష్ట్రాలతో గౌరవప్రదంగా చర్చలు జరుపుతున్నారన్నారు. సమస్యలను లొల్లి చేయడం, బ్లాక్‌మెయిల్ చేసి రాజకీయ లబ్ధి పొందడం కాంగ్రెస్ విధానం కాదన్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని, బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఎలాగైనా కేటీఆర్‌కే వెళ్తాయని తెలిసి హరీష్ రావు బీజేపీలో చేరేందుకు రహస్యాన్వేషణ చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే హరీష్ రావు, కేటీఆర్‌లు తమ సొంత నియోజకవర్గాలైన సిద్ధిపేట, సిరిసిల్లలను వదిలి పక్క నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇండిపెండెంట్‌గా జడ్పిటిసిగా, ఆ తర్వాత కొడంగల్‌లో, దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచి తన సత్తా చాటుకున్నారని గుర్తుచేశారు.
కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావాలని.. కాళేశ్వరం అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఒకవేళ ఆ చర్చలో బీఆర్ఎస్ నేతలు మమ్మల్ని ఒప్పిస్తే, రాబోయే మూడు సంవత్సరాల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను బీఆర్ఎస్‌కే అప్పగిస్తామని సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీలో నిలబడి తినాల్సిన అవసరం లేదని, సెంట్రల్ హాల్‌లో కూర్చుని తినే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పారు.
80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి కాళేశ్వరం సమస్యకు సాంకేతిక పరిష్కారం చెప్పాలన్నారు. దొంగ ఆరోపణలు చేయడం మానేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు రావాలని హితవు పలికారు.