Harish Rao: కేసీఆర్ దాకా ఎందుకు.. మూడు నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగించు.. నీళ్ళు ఎలా తేవాలో చూపిస్తా.. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
Harish Rao: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, కాళేశ్వరం వివాదంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాళేశ్వరం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చకు కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు రావాలంటూ కాంగ్రెస్ నేతలు విసిరిన సవాళ్లకు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఘాటుగా బదులిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ విషయంలో కేసీఆర్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదని, సమాధానం చెప్పడానికి నేను రెడీ అని స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల లక్ష్యంగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నదుల్లో నీళ్లు పుష్కలంగా ప్రవహిస్తున్నప్పటికీ, మోటార్లు నడపకుండా పంటలను ఎండబెట్టడం సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌ల క్రిమినల్ నెగ్లిజెన్స్ (నేరపూరిత నిర్లక్ష్యం) అని ధ్వజమెత్తారు. ఇందుకోసం వారిద్దరినీ ఉరి వేసినా తప్పులేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్ల మంత్రిగా ఉత్తమ్, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇద్దరూ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
దేవాదుల ఎత్తిపోతల పథకం దగ్గర మోటర్లను ఎందుకు ఆన్ చేయడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. అక్కడ ఎలాంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) అభ్యంతరాలు లేదా ఇతర సాంకేతిక సమస్యలు లేవు కదా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ చెల్లించుకోవడానికే తెలంగాణ వాడుకోవాల్సిన కృష్ణా, గోదావరి జలాలను రేవంత్ రెడ్డి ఏపీకి వదిలేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో కట్టిన ఇళ్లు, పెట్టిన పొయ్యి లాగా అన్ని ప్రాజెక్టులను సిద్ధం చేసి ఇస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం వాటిని నిర్వహించలేకపోతోందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడేవన్నీ అబద్ధాలని, అబద్ధాలు చెప్పడంలో రేవంత్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వవచ్చని హరీష్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నిన్న మీడియా ముందు చెప్పిన ప్రతి ఒక్క అబద్ధానికి, ప్రతి ఒక్క అక్షరానికి తాము ఖచ్చితంగా సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు బహిరంగ సవాల్ విసిరారు. “తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్లు ఏదైనా అధికారిక డాక్యుమెంట్ ఉంటే రేవంత్ రెడ్డి దానిని మీడియా ముందు బయటపెట్టాలి. ఆ డాక్యుమెంట్‌ను గనుక నిరూపిస్తే నేను నా పదవికి తక్షణమే రాజీనామా చేస్తా. ఒకవేళ నిరూపించలేకపోతే రేవంత్ రెడ్డి స్వయంగా బయటకు వచ్చి, తప్పు జరిగిందని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి” అని హరీష్ రావు సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డి.. ఈ అంశంపై చర్చించడానికి నీకు మా అధినేత కేసీఆర్ అవసరం లేదు, నేను చాలు. దమ్ముంటే ఒక్క మూడు నెలల పాటు నాకు ఇరిగేషన్ (సాగునీటి) శాఖ బాధ్యతలను అప్పగించు. ప్రస్తుతం ఎండిపోతున్న పంట పొలాలకు నీళ్లు ఎలా తేవాలో, ప్రాజెక్టులను ఎలా నిర్వహించాలో నేను ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తా అంటూ సవాల్ విసిరారు. నదుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం తలెత్తిందని ఆయన ఆరోపించారు.
తమ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టిపారేసిన హరీష్ రావు.. చేతిలో పవర్ ఉండి కూడా ప్రజలకు నీళ్లివ్వకుండా కాలయాపన చేస్తూ కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరంపై నెపం నెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ విసిరిన బహిరంగ చర్చ సవాల్‌ను స్వీకరిస్తూనే.. ఇరిగేషన్ శాఖను మూడు నెలలు ఇస్తే తెలంగాణ రైతులకు సాగునీరు అందించి చూపిస్తానన్న హరీష్ రావు తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.