Telanagana Revenue System: తెలంగాణలో భూములు ఎన్ని రకాలు? ప్రభుత్వ, ప్రైవేటు భూముల పూర్తి వివరాలు మీ కోసం..
Telanagana Revenue System: తెలంగాణలో భూములు ఎన్ని రకాలు? ప్రభుత్వ, ప్రైవేటు భూముల పూర్తి వివరాలు!
భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి రెవెన్యూ వ్యవస్థ నైజాం కాలం నుంచి కూడా పటిష్టంగా ఉన్న నేపథ్యంలో భూములను వర్గీకరణ అనేది స్థిరంగా ఉంది అని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో నైజాం కాలం నుంచి పటిష్టమైనటువంటి రెవెన్యూ వ్యవస్థ ఉంది దీనికి ముఖ్యకారకుడు ఒకటవ సాలార్జంగ్ చేపట్టిన సంస్కరణలు అని చెప్పవచ్చు. 1853 నుంచి 1883 వరకు సాగినటువంటి ఒకటవ సాలార్జంగ్ హయాంలో పకడ్బందీగా శాస్త్రీయంగా రెవెన్యూ వ్యవస్థను నిర్మించారు ముఖ్యంగా ల్యాండ్ సర్వే విషయంలో హైదరాబాద్ స్టేట్ బ్రిటిష్ ఇండియా కన్నా కూడా ఎంతో పకడ్బందీగా ఉండేది. నైజాం కాలంలో భూములను రెండు రకాలుగా వర్గీకరించారు. ముఖ్యంగా యాజమాన్య హక్కుల ఆధారంగా అదేవిధంగా సాగు విధానం నేల స్వభావం ఆధారంగా భూములను నిర్ధారించారు.
నైజాం కాలంలో రెవెన్యూ వ్యవస్థ:
దీవానీ భూములు లేదా ఖాల్సా భూములు: ఇవి నేరుగా ప్రభుత్వ ఆధీనంలో ఉండే భూములు వీటిలో రైతులు నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లించాల్సి ఉంటుంది. నైజాం కాలంలో భూములను సద్వినియోగం చేసేందుకు ఈ తరహా వర్గీకరణ చేశారు. దీనివల్ల వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది.
సర్ ఫే ఖాస్ భూములు : ఇవి నేరుగా నిజాం ప్రభువు సొంత ఖర్చుల కోసం కేటాయించిన భూములు. వీటిపై వచ్చే ఆదాయం మొత్తం నేరుగా నైజాం ఖజానాకు వెళుతుంది. ప్రస్తుతం ఈ భూములనే రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా వాడుకుంటున్నాయి.
జాగీర్ భూములు: వీటిని నవాబు తమ ఆశ్రితులకు అధికారులకు ఇచ్చిన భూములుగా చెబుతుంటారు. ముఖ్యంగా నవాబు కొలువులో ఉన్న సైనికులు, అధికారులకు ఇచ్చిన భూములను జాగీర్ భూములు అంటారు. పైగా భూములు, మక్తా భూములు అలాగే ఇతర సంస్థానాల జాగీర్దారులకు ఇచ్చిన భూములు దీని కిందకు వస్తాయి. ఈ భూ యజమానులను జాగీర్దార్ అని పిలుస్తారు.
ఇనాం భూములు: సాధారణంగా గుడులు మసీదులకు అలాగే కళాకారులకు ప్రత్యేక సేవలు అందించిన వారికి ఉచితంగాను నామమాత్రపు పన్నుతోను కేటాయించిన భూములను ఇనాం భూములు అంటారు.
నైజాం కాలంలో నేల స్వభావాన్ని బట్టి భూముల విభజన:
తరి భూములు: సాధారణంగా కాలువలు చెరువులు. బాబుల కింద ఉండే నీటిపారుదల కలిగిన భూములను తరి భూములు అంటారుజ
ఖుష్కీ భూములు: వర్షాధారం పైన ఆధారపడిన సాగు చేసే మెట్ట భూములను కృషికి అని పిలుస్తారు.
భగాయత్ భూములు: సాధారణంగా పండ్ల తోటలు కూరగాయలకు సాగు కోసం కేటాయించిన భూములను భగాయత్ భూములు అని పిలుస్తారు.
నైజాం కాలంలో ల్యాండ్ సర్వే ఇలా ఉండేది
సాలార్జంగ్ సంస్కరణలో అత్యంత ముఖ్యమైనది 1875లో సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పవచ్చు ఇందులో పూర్తి శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో భూములను సర్వే చేయడం జరిగింది గతంలో అంతకుముందు ఉన్నటువంటి అంచనా విధానాలను రద్దుచేసి ఖచ్చితమైన ఆధునిక గొలుసులతో భూములను కచ్చితంగా కొలవడం ప్రారంభించారు. ఈ కొలతల్లో ఎకరాలు గుంటలు అని భూములను ప్రామాణికరించారు. ఇందులో 40 గుంటలకు ఒక ఎకరం అని నిర్ధారించారు. ఇప్పటికీ కూడా తెలంగాణలో ఎకరం భూమిని గుంటల రూపంలోనే కొలుస్తారు. రికార్డుల్లో కూడా గుంటలు ఎకరాల విస్తీర్ణం ఉంటుంది.
నక్షా ( మ్యాపింగ్) : ఎలాంటి ఆధునిక పరికరాలు లేని రోజుల్లోనే ఖచ్చితమైన శాస్త్రీయమైన అవగాహనతో నైజాం కాలంలో ప్రతి భూమికి ఒక సర్వే నెంబర్ కేటాయించారు. ఇది బహుశా భారతదేశంలో ఏ సంస్థానంలోనూ రాష్ట్రంలోనూ ఈ తరహా సర్వే జరగలేదు అని చెప్పవచ్చు. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి భూములకు సంబంధించిన శిస్తు సవరణ జరిగేది.
హైదరాబాద్ సంస్థానంలోని రెవెన్యూ వ్యవస్థకు బ్రిటిష్ ఇండియా రెవెన్యూ వ్యవస్థకు చాలా తేడా ఉండేది. ముఖ్యంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో నైజాం రెవెన్యూ వ్యవస్థ పకడ్బందీగా ఉంటే, కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో బ్రిటిష్ రెవెన్యూ వ్యవస్థ కంటిన్యూ అయింది అక్కడ భూములను ఎకరాలు సెంట్లు అని కొలిచేవారు. అయితే బ్రిటిష్ ఇండియా రెవెన్యూ వ్యవస్థ కన్నా కూడా నైజాం రెవెన్యూ వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉండేది.
సేత్వార్ ( ల్యాండ్ రిజిస్టర్ ):
నిజాం ల్యాండ్ రెవెన్యూ వ్యవస్థను నేటికీ ఒక గొప్ప వ్యవస్థగా చెప్పుకోవడానికి ఇదే ఒక కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ల్యాండ్ రికార్డుల నిర్వహణ పారదర్శకత అనేది నైజాం రెవెన్యూ వ్యవస్థలో కనిపించేది. భూములను నిర్వహించే రిజిస్టార్ ను సేత్వార్ అని పిలిచేవారు ఇందులో సర్వేనెంబర్ భూమి విస్తీర్ణం భూమి రకం పట్టాదారు పేరు చెల్లించాల్సిన శిస్తు సహా ప్రతి ఒక్క అక్షరం ఇందులో పక్కాగా నమోదు అయ్యేది.
పహానీ: పహాని అంటే నేటికీ కూడా ఇది కంటిన్యూ అవుతోంది ప్రతి సంవత్సరం రైతు ఏ సర్వే నెంబర్లు ఏం పంట వేస్తున్నాడు ఎంత దిగుబడి వస్తుంది అని క్షేత్రస్థాయిలో పరిశీలించి దీన్ని రికార్డు చేసేవారు. నేటికీ కూడా తెలంగాణలో పహాని అనేది అత్యంత కీలకమైన డాక్యుమెంట్.
ఖాస్రా పట్టా: ప్రతి సర్వే నెంబర్ కు సంబంధించిన యాజమాన్య చరిత్ర వంశపారంపర్య హక్కుల వివరాలు ఈ కాసరాపట్టాలో ఉండేవి.
టిపన్: టిపన్ పేరిట ఖచ్చితమైన కొలతలతో గీసిన మ్యాప్ లు రికార్డులు ఉండేవి. . ఈ టిఫన్ ఆధారంగానే భూవివాదాలను పరిష్కరించేవారు.
సాలార్జంగ్ ప్రవేశపెట్టిన జిల్లా బందీ వ్యవస్థ రెవెన్యూ చరిత్రలో అత్యంత సక్సెస్ అయినటువంటి వ్యవస్థగా చెబుతుంటారు. ఎందుకంటే గ్రామస్థాయిలో పట్వారి, తాలూకా స్థాయిలో తహసిల్దార్, జిల్లా స్థాయిలో తాలూకదార్, సుభా స్థాయిలో సుబేదార్, జవాబుదారీతనం ఉండేది. ఇప్పటికీ కూడా తెలంగాణలో రెవెన్యూ రికార్డులు మెయింటైన్ చేయడానికి సాలార్జంగ్ ప్రవేశపెట్టినటువంటి మార్గదర్శకాలని కంటిన్యూ చేస్తున్నారంటే నైజాం రెవెన్యూ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో భూములు ఎన్ని రకాలు…రెవెన్యూ వ్యవస్థ ఎలా ఉంది..?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రస్తుతం ప్రభుత్వ రికార్డుల ప్రకారం భూముల వర్గీకరణ ఎలా ఉందో చూద్దాం
ప్రభుత్వ భూములు:
అసైన్డ్ లాండ్స్: ఈ భూములను సాధారణంగా పేదలకు సాగు కోసం ప్రభుత్వం కేటాయించే భూములు వీటిని అమ్మడం లేదా కొనడం నిషేధం.
పోరంబోకు సర్కారీ భూములు- సాధారణంగా రోడ్లు పాఠశాలలకు కేటాయించిన భూములను పోరంబోకు భూముల అంటారు ఇందులో కుంటలు చెరువులు వంటివి కూడా వస్తాయి.
అటవీ భూములు: ఇవి ఫారెస్ట్ శాఖ అధీనంలో ఉంటాయి
ప్రభుత్వ సంస్థల భూములు: సాధారణంగా సైన్యం రైల్వే ఇతర ప్రభుత్వ శాఖల అధీనంలో ఉంటాయి.
వక్ఫ్, దేవాదాయ భూములు: వక్ఫ్ బోర్డు, దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న భూములు
ప్రైవేట్ భూములు:
పట్టా భూములు: ఇవి రైతుల పేరున పట్టాదారు పాసుబుక్కులో పూర్తి వివరాలు కలిగి యాజమాన్య హక్కులు కలిగి ఉంటాయి.
రక్షిత కౌలుదారు భూములు: భూమిని కౌలుకు సాగు చేసుకుంటున్న పేద రైతులకు, కౌలుదారుల రక్షణ చట్టం ద్వారా లభించిన భూములును రక్షిత కౌైలుదారు భూములు అంటారు.
నాన్ అగ్రికల్చర్ భూములు: వీటిని నాలా కన్వర్షన్ ద్వారా వ్యవసాయ భూములను వాణిజ్య అవసరాలకు లేదా గృహ నిర్మాణాలకి ఉపయోగిస్తుంటారు
తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ ఇలా పని చేస్తుంది..
CCLA (Chief Commissioner of Land Administration): రాష్ట్ర స్థాయిలో అత్యున్నత అధికారి.
కలెక్టర్ (District Collector): జిల్లా స్థాయి రెవెన్యూ అధిపతి.
ఆర్డీఓ (RDO – Revenue Divisional Officer): డివిజన్ స్థాయి అధికారి.
తహసీల్దార్ (MRO): మండల స్థాయి అధికారి (రిజిస్ట్రేషన్ బాధ్యతలు కూడా వీరే చూస్తున్నారు).
గిర్దావర్ (RI – Revenue Inspector): మండల స్థాయి సహాయకుడు.
విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (VRA): గ్రామ స్థాయిలో ఉండే సిబ్బంది.