Skip to content
ప్రపంచం వార్తలు

Indus Water Row: సింధూ జలాలు ఆపితే యుద్ధమే.. భారత్ మీద రంకెలేస్తున్న పాకిస్తాన్.. నీళ్లు లేక ఎడారిగా మారుతున్న దాయాది దేశం..

Prajapaksham 07 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Indus Water Row: సింధూ జలాలు ఆపితే యుద్ధమే.. భారత్ మీద రంకెలేస్తున్న పాకిస్తాన్.. నీళ్లు లేక ఎడారిగా మారుతున్న దాయాది దేశం..

Indus Water Row: సింధూ జలాలు ఆపితే యుద్ధమే.. భారత్ మీద రంకెలేస్తున్న పాకిస్తాన్.. ఎడారిగా మారుతున్న దాయాది దేశం..

Indus Water Row: సింధూ నదీ జలాల ఒప్పందాన్ని (IWT) భారత్ తాత్కాలికంగా నిలిపివేయడం దాయాది దేశం పాకిస్తాన్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే సింధు జలాలను ఆపితే దానిని యుద్ధ చర్యగా పరిగణిస్తామంటూ పాకిస్తాన్ తాజాగా కొత్త హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశానికి దక్కాల్సిన నీటి వాటా కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పాక్ పౌర ప్రభుత్వంతో పాటు అక్కడి సైన్యం కూడా ఉమ్మడిగా ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

పాక్ సైనిక దళాల అధిపతి (COAS & CDF) ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిమ్ మునీర్ అధ్యక్షతన రావల్పిండిలోని జీహెచ్‌క్యూ (GHQ) లో 276వ కోర్‌ కమాండర్ల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో సింధు జలాల వివాదంపై పాక్ సైన్యం కీలక నిర్ణయాలు ప్రకటించింది. 2025 ఏప్రిల్ 24 నాటి నేషనల్ సెక్యూరిటీ కమిటీ (NSC) ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని మరోసారి తెలిపింది. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధూ నదీ జలాల వాటాను దక్కించుకునేందుకు అవసరమైన అన్ని రకాల సైనిక, వ్యూహాత్మక చర్యలు తీసుకుంటామని ఆర్మీ స్పష్టం చేసింది. తమ ప్రభుత్వ ఆదేశాలు, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సింధు జలాల హక్కుల కోసం పోరాడుతామని సైన్యం వెల్లడించింది.

గతేడాది జమ్మూ కాశ్మీర్‌లో 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతి చర్యగా భారత్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ శాశ్వతంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంతవరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేతలోనే ఉంటుందని భారతదేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. సరిహద్దుల్లో శత్రుత్వం, ఉగ్రవాదం కొనసాగుతున్నప్పుడు ద్వైపాక్షిక ఒప్పందాలు మామూలుగా సాగవని.. భూమిపై ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే దేశ రక్షణ కోసం నిర్ణయాలు ఉంటాయని భారత్ ఖరాఖండిగా తేల్చి చెప్పింది.

నీటిని ఆపడం లేదా మళ్లించడం వంటి ఏ చర్యకైనా భారత్ పాల్పడితే దానిని నేరుగా యుద్ధ చర్యగా పరిగణించాలని పాకిస్తాన్ NSC గతంలోనే నిర్ణయించింది. ఇదే తరుణంలో.. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ చేసిన సంచలన వ్యాఖ్యల వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. సింధు నదీ జలాల ఒప్పందంపై తాము రాజీ పడే ప్రసక్తి లేదని, భారత్ ఈ జలాలను ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తోందని అందులో ఆరోపించారు. ఒకవేళ నీటి కోసం భారతదేశంతో యుద్ధం చేయాల్సి వస్తే.. అన్ని రంగాలలో పోరాడటానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు.

1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, సట్లెజ్, బియాస్ జలాలు భారత్‌కు.. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలు పాకిస్తాన్‌కు దక్కాలి. అయితే సాధారణంగా వర్షాకాలంలో వరద హెచ్చరికల సమాచారాన్ని భారత్.. పాకిస్తాన్‌తో పంచుకునేది. అయితే ఒప్పందం నిలిపివేయడంతో భారత్ ఇప్పుడు ఆ సమాచారాన్ని పంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. దీనికి తోడు సింధు బేసిన్‌లో సావల్‌కోట్, రట్లే, బుర్సార్, పకాల్ దుల్, క్వార్, కిరు, కీర్తాయ్ వంటి పలు జలవిద్యుత్ ప్రాజెక్టులను భారత్ అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.

పాకిస్తాన్ వ్యవసాయ రంగంలో దాదాపు 80 నుంచి 90 శాతం సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని ప్రధాన జలాశయాలైన తర్బెలా, మంగ్లా డ్యామ్‌లలో నీటి నిల్వలు దాదాపు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. దీంతో తమ బలహీనమైన పాయింట్‌ను భారత్ టార్గెట్ చేయడంతో పాకిస్తాన్ తీవ్ర భయాందోళనకు గురవుతోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లడానికి పాక్ రాయబారులను పంపడం.. ఐక్యరాజ్యసమితికి లేఖలు రాయడం, అంతర్జాతీయ చట్టపరమైన చర్యలకు దిగడం వంటి ప్రయత్నాలు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *