DSP Bheem Reddy Remanded: అక్రమాస్తులు కేసులో డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్.. కళ్లు బైర్లు కమ్మేలా అవినీతి సంపాదన.. ఏసీబీకి పట్టించిన వ్యక్తిగత డైరీ
DSP Bheem Reddy Remanded: అక్రమాస్తులు కేసులో డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్.. కళ్లు బైర్లు కమ్మేలా అవినీతి సంపాదన.. ఏసీబీకి పట్టించిన వ్యక్తిగత డైరీ
DSP Bheem Reddy Remanded: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ (PCS) డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డికి ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల అనంతరం ఏసీబీ అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. తన సర్వీసు కాలంలో అవినీతి పద్ధతులు, అనుమానాస్పద మార్గాల ద్వారా ఆదాయ వనరులకు మించి అసమానమైన ఆస్తులను కూడబెట్టారనే బలమైన ఆధారాలతో తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) సోమవారం రాత్రి ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో ఉన్న ఆయన నివాసం నుంచి అరెస్టు చేసింది.
నిజానికి జూలై 2వ తేదీ గురువారమే ఏసీబీ అధికారులు ఆయన నివాసంతో పాటు తెలంగాణ, కర్ణాటక వ్యాప్తంగా ఆయన బంధువులు, స్నేహితులు, బినామీదారులకు సంబంధించిన 16 ప్రాంగణాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అయితే సోదాలకు వచ్చిన అధికారులను చూసి భీంరెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించి, నోటీసులు ఇచ్చి వెళ్లారు. రోజులు గడుస్తున్నా ఉన్నతాధికారిని అరెస్టు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడం, పలువురు ఫిర్యాదులు చేయడంతో ఎట్టకేలకు సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడుల్లో మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.200 కోట్ల నుండి రూ.300 కోట్ల వరకు విలువ చేసే కళ్లు చెదిరే అక్రమాస్తులను ఏసీబీ కనుగొంది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో ఒక విల్లా, టెలికాం నగర్‌లో జీ+2 నివాస గృహంతో పాటు ఒక ఫ్లాట్, గచ్చిబౌలి, తెల్లాపూర్‌లలోని అపార్ట్‌మెంట్‌లలో ఫ్లాట్లు ఉన్నాయి. అలాగే మణికొండ లాంకోహిల్స్ రోడ్డులో వాణిజ్య సముదాయంలో వాటా, మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో వాణిజ్య స్థలం, ప్రగతి రిసార్ట్స్, నాగోల్, పటాన్‌చెరు, వికారాబాద్‌లలో వందల చదరపు గజాల ఖాళీ స్థలాలు లభ్యమయ్యాయి. వీటితో పాటు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాలు, వికారాబాద్ మోమిన్‌పేట్‌లో 2 ఎకరాలు, ముచింతల గ్రామంలో 4.20 ఎకరాలు, అలాగే కర్ణాటకలో 44 ఎకరాలు, బెంగళూరు దేవనహళ్లిలో ఒక ఎకరం చొప్పున భారీగా వ్యవసాయ భూములను గుర్తించారు. వీటితో పాటు శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్‌లో రూ.75 లక్షల పెట్టుబడులు ఉన్నట్లు తేలింది. నగదు, నగల రూపంలో భీంరెడ్డి ఇల్లు, ఆయన బినామీ ఇళ్లలో సోదాలు చేసినప్పుడు రూ.43.60 లక్షల నెట్ క్యాష్, సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులతో పాటు రూ.19.91 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్‌లను ఏసీబీ సీజ్ చేసింది.
ఈ దర్యాప్తు మొత్తం భీంరెడ్డి స్వయంగా రాసుకున్నవ్యక్తిగత డైరీ ఆధారంగా ఊపందుకుంది. గడిచిన మే నెలలో తన భార్యతో కలిసి చార్ ధామ్ యాత్రకు బయలుదేరడానికి ముందు భీంరెడ్డి తన ఆస్తులు, పెట్టుబడులు, అప్పులు, బినామీదారుల పేర్లతో కూడిన వివరాలను ఈ డైరీలో పొందుపరిచారు. యాత్రలో ఏమైనా జరుగుతుందేమోనన్న అనుమానంతో దీని స్కాన్ కాపీలను వాట్సాప్ ద్వారా తన ఇద్దరు కుమారులకు షేర్ చేశారు. ఈ డైరీని కీలక సాక్ష్యంగా స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, బినామీల గుట్టును విప్పి మరిన్ని ఆస్తులను, ఆర్థిక లావాదేవీలను వెలికితీసే పనిలో పడ్డారు.