Skip to content
ప్రపంచం వార్తలు

Hamas Ends Gaza Governing Body: గాజాలో రెండు దశాబ్దాల హమాస్‌ పాలనకు ముగింపు..పాలనా వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన..

Prajapaksham 07 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Hamas Ends Gaza Governing Body: గాజాలో రెండు దశాబ్దాల హమాస్‌ పాలనకు ముగింపు..పాలనా వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన..

Hamas Ends Gaza Governing Body: గాజాలో రెండు దశాబ్దాల హమాస్‌ పాలనకు ముగింపు..పాలనా వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన..

Hamas Ends Gaza Governing Body: పాలస్తీనాకు చెందిన సాయుధ ఇస్లామిక్ సంస్థ ‘హమాస్’ (Hamas) గాజాలో చారిత్రాత్మక రాజకీయ మార్పుకు శ్రీకారం చుట్టింది. దాదాపు రెండు దశాబ్దాలుగా గాజా స్ట్రిప్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న తన ప్రభుత్వ అత్యవసర కమిటీని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సుదీర్ఘ కాలంగా ఇజ్రాయెల్ యుద్ధంతో అతలాకుతలమై.. తీవ్ర ఆంక్షల దిగ్బంధంలో ఉన్న గాజాలో పౌర పాలనను పునరుద్ధరించడానికి, ఒక సాంకేతిక నిపుణుల కమిటీకి పూర్తి బాధ్యతలను అప్పగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం (జూలై 6, 2026) హమాస్ స్పష్టం చేసింది.

గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం.. 2007లో తన ప్రత్యర్థి పాలస్తీనా రాజకీయ ఉద్యమమైన ‘ఫతా’ (Fatah) నుండి గాజాను హమాస్ చేజిక్కించుకుంది. నాటి నుంచి గాజాను శాసిస్తున్న హమాస్.. ఇప్పుడు ఈ కీలక నిర్ణయంతో రోజువారీ పౌర పరిపాలన నుండి పూర్తిగా వైదొలుగుతోంది. గత అక్టోబర్‌లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన “యుద్ధ విరమణ” (Ceasefire) ఒప్పందం నాటి నుండి ఈ బృందం పాలన నుంచి తప్పుకోవడానికి సంకేతాలు ఇస్తున్నప్పటికీ.. హమాస్ ఆయుధాలు వదిలిపెట్టే (నిరాయుధీకరణ) అంశంపై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రభుత్వ అత్యవసర కమిటీ అధిపతి మహమ్మద్ అల్-ఫర్రా.. పరిపాలనా పరివర్తన ప్రక్రియను సులభతరం చేసేందుకు తన పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను అంతం చేయడానికి అమెరికా మద్దతుతో రూపొందించిన రోడ్‌మ్యాప్‌లో భాగంగా.. గాజా భవిష్యత్ పరిపాలనను పర్యవేక్షించే బాధ్యత కలిగిన ‘గాజా పరిపాలన జాతీయ కమిటీ’ (NCAG) త్వరగా బాధ్యతలు స్వీకరించాలని హమాస్ కోరుతోంది. ఇకపై గాజా స్ట్రిప్‌పై తాము పౌర నియంత్రణ కలిగి ఉండబోమని స్పష్టం చేయడం ద్వారా.. తమపై దాడులు కొనసాగించడానికి ఇజ్రాయెల్‌కు ఉన్న అన్ని సాకులను హమాస్ తొలగించిందని హమాస్ ప్రతినిధి హజెమ్ ఖాస్సెమ్ అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ (AFP) కి తెలిపారు.

అయితే ఈ చర్య వల్ల హమాస్ తన రాజకీయ లేదా సైనిక ఉనికిని పూర్తిగా వదులుకోవడం లేదని, కేవలం ప్రత్యక్ష పౌర ప్రభుత్వం నుండి మాత్రమే వైదొలుగుతోందని అల్ జజీరా ప్రతినిధి హనీ మహమూద్ విశ్లేషించారు. గాజాలో నెలకొన్న అధికార శూన్యతను భర్తీ చేయడానికి ఈ సాంకేతిక కమిటీ రంగంలోకి దిగనుంది. హమాస్ నిర్ణయాన్ని ఎన్‌సిఎజి (NCAG) అధిపతి అలీ షాత్ స్వాగతించారు. అవసరమైన వనరులు, సామర్థ్యాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే జాతీయ బాధ్యతలను స్వీకరించడానికి తమ కమిటీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.

అటు NCAG పనులను పర్యవేక్షించేందుకు అమెరికా ఏర్పాటు చేసిన ‘గాజా శాంతి మండలి’ ఉన్నత ప్రతినిధి నికోలే మ్లాడెనోవ్ స్పందిస్తూ.. ఈ నిర్ణయం ప్రకటనలకు, క్షేత్రస్థాయి అమలుకు మధ్య ఒక వారధి లాంటిదని అభివర్ణించారు. మిగిలిన నిబంధనలపై తుది ఒప్పందం కుదిరిన వెంటనే కమిటీ పగ్గాలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్ అభ్యంతరాల కారణంగా ఈ కమిటీ గాజా వెలుపల నుంచే పనిచేస్తోంది. గాజాను పాలించడానికి హమాస్‌ను ఒప్పుకోబోమని ఇజ్రాయెల్ మొదటి నుంచి చెప్తున్నప్పటికీ, వెస్ట్ బ్యాంక్‌ను పాలిస్తున్న ‘పాలస్తీనా అథారిటీ’ నేరుగా గాజాను స్వాధీనం చేసుకోవడాన్ని కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తుండటంతో.. తాజా సాంకేతిక కమిటీ (NCAG) పాలన ఏ మేరకు విజయవంతం అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *