Mumbai Rains: భారీ వర్షాలతో ముంబై అష్టదిగ్బంధనం.. పూర్తిగా తెగిపోయిన రవాణా సంబంధాలు..
Mumbai Rains: భారీ వర్షాలతో ముంబై అష్టదిగ్బంధనం.. పూర్తిగా తెగిపోయిన రవాణా సంబంధాలు..
Mumbai Rains: గత మూడు రోజులు నుంచి వరుసగా కురుస్తున్న ఎడతెగని భారీ వర్షాల కారణంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై పూర్తిగా అష్టదిగ్బంధనమైంది. మూడు వైపులా సముద్రపు నీరుండే దేశ ఆర్థిక నగరం.. భారీ వానల ధాటికి నాలుగో వైపు ఉన్న రవాణా సంబంధాలు కూడా తెగిపోవడంతో ఒక ద్వీపంలా మారిపోయింది. ముంబైని ఇతర ప్రధాన నగరాలతో అనుసంధానించే ముంబై-పుణె, ముంబై-అహ్మదాబాద్, ముంబై-కొంకణ్ రహదారులు వరద నీరు, కొండచరియల కారణంగా పూర్తిగా మూసుకుపోయాయి. భారీ వర్షాల ప్రభావం రైల్వే వ్యవస్థపై కూడా తీవ్రంగా పడటంతో రైళ్ల రాకపోకలకు పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది.
ఈ వర్షాల బీభత్సంలో భాగంగా అత్యంత కీలకమైన ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. సాధారణంగా ఈ ఎక్స్‌ప్రెస్ వేలో ఘాట్ రోడ్డు ప్రాంతంలో తరచూ వచ్చే ట్రాఫిక్ అంతరాయాలను, ప్రమాదాలను నివారించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.6,695 కోట్ల భారీ వ్యయంతో 13.3 కిలోమీటర్ల పొడవైన ‘మిస్సింగ్ లింక్’ (Missing Link) బైపాస్ మార్గాన్ని నిర్మించింది. ఇందులో ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు 1.6 కిలోమీటర్లు, 8.9 కిలోమీటర్ల పొడవు గల రెండు అత్యాధునిక సొరంగ మార్గాలను (Tunnels) కూడా ఏర్పాటు చేశారు. కేవలం 9 వారాల కిందటనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా ఈ సరికొత్త సొరంగ మార్గం ప్రారంభమైంది.
అయితే సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ సరికొత్త సొరంగం సమీపంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో ఆ రూట్‌లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ సిబ్బంది, రెస్క్యూ టీమ్‌లు భారీ యంత్రాలతో రంగంలోకి దిగాయి. ఎడతెగని వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఏకంగా 18 గంటల పాటు నిరంతరాయంగా శ్రమించి.. రోడ్డుపై పడిన భారీ శిథిలాలను, రాళ్లను తొలగించి ఎట్టకేలకు ఈ మార్గంలో ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రస్తుతం కురుస్తున్న తీవ్ర రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.