అమ్మకానికి అక్షరం.. నలిగిపోతున్న నవతరం
భారతదేశ విద్యావ్యవస్థ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక చీకటి అధ్యాయం లిఖించబడుతోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల కలలను, రాత్రింబవళ్లు పడిన శ్రమను కాసుల కక్కుర్తికి, అవినీతికి బలిపెడుతున్న తీరు హృదయవిదారకం. మే 3న జరిగిన నీట్ (NEET 20 26) పరీక్షాపత్రాలు లీకైపోవడం, ఆ వివాదం ముదిరి 22 లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన ఈ దేశంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షను జాతీయ పరీక్షల సంస్థ (NTA) రద్దు చేసి, మళ్లీ ‘రీ-ఎగ్జామ్’ నిర్వహించాల్సి రావడం మన వ్యవస్థల దిగజారుడుతనానికి పరాకాష్ట. ఒక పరీక్షను పారదర్శకంగా నిర్వహించలేని చేతకానితనం ఇటు ఎన్‌టీఏది, అటు పాలకులది అయితే.. దానికి మూల్యం చెల్లిస్తూ, మానసిక క్షోభను భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఈ దేశ సామూహిక మనస్సాక్షికి తగిలిన పెద్ద గాయం.
ఇంతటి ఘోరకలి దేశంలో జరుగుతుంటే, కేంద్రలో అధికార పీఠంలో ఉన్న నాయకులు, వారి అనుకూల వర్గాలు దీనిని కేవలం ‘ప్రతిపక్షాల రాజకీయ స్టంట్’ అని కొట్టిపారేయడం వారి అహంకారానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. పాలకులారా, ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి! ఒక పరీక్ష కోసం ఏళ్ల తరబడి కంటిమీద కునుకు లేకుండా, తల్లిదండ్రులు తమ రక్తాన్ని, కూడబెట్టిన సొమ్మును కోచింగ్ సెంటర్లకు ధారపోసి చదివిన సగటు విద్యార్థి ఆవేదన మీకు ‘స్టంట్’ లా కనిపిస్తోందా? కన్నీరు మున్నీరవుతూ జంతర్ మంతర్ వద్ద న్యాయం కోసం పోరాడుతున్న నవతరం నిరసన మీకు రాజకీయ క్రీడలా తోస్తోందా? ఇది ఏ ఒక్క పార్టీకో, సిద్ధాంతానికో సంబంధించిన అంశం కాదు; ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత తీవ్రమైన సంక్షోభం.
ఈ అణచివేత, అవహేళనల నుంచే దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని ఒక అపూర్వ డిజిటల్ విప్లవం పుట్టుకొచ్చింది. దేశ అత్యున్నత న్యాయమూర్తి (CJI) దేశ యువతను ఉద్దేశించి ‘పరపరాన్నజీవులు’ (Parasites), ‘బొద్దింకలు’ (Cockroaches) అని సంబోధించడం విద్యార్థుల గుండెల్లో తూటాలా పేలింది. హక్కుల కోసం పోరాడే గొంతుకలను చీకటి గదుల్లో దాక్కునే కీటకాలతో పోల్చడాన్ని నిరసిస్తూ, నవతరం ఆ అవమానాన్నే ఒక ఆయుధంగా మార్చుకుంది. తాము నిజంగానే బొద్దింకలమైతే.. వ్యవస్థల్లోని కుళ్లును తుడిచేసే సైన్యమంటూ యువత సోషల్ మీడియా వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)ని స్థాపించింది. ఇది కేవలం ఒక డిజిటల్ హ్యాష్‌ట్యాగ్ కాదు, అహంకార పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక సమాంతర సామాజిక శక్తి.
ఈ అపూర్వ సంఘటనతో ఉలిక్కిపడ్డ కేంద్ర ప్రభుత్వం తన పాత అణచివేత ధోరణినే నమ్ముకుంది. CJP సోషల్ మీడియా ఖాతాలను, గొంతుకలను దేశవ్యాప్తంగా నిషేధిస్తూ ఉక్కుపాదం మోపింది. అయితే, సాంకేతికతను బంధించినంత మాత్రాన అక్షరాల్లోని ఆవేదనను, ఆకలిని ఆపగలరా? సోషల్ మీడియాపై నిషేధాలు విధించగానే ఈ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి నేరుగా ఢిల్లీ వీధుల్లోకి చేరింది. చలిని, ఎండను లెక్కచేయకుండా వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ ధర్నా వేదికగా ప్రత్యక్ష పోరాటానికి దిగారు. లీకుల మాఫియా అంతం కావాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని వారు చేస్తున్న డిమాండ్లకు ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ వంటి లబ్దప్రతిష్టులైన మేధావులు మద్దతుగా నిలవడం ఈ నిరసనలోని నైతిక బలాన్ని చాటుతోంది.
సమాజంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎండగట్టి, విద్యార్థుల పక్షాన నిలబడాల్సిన ఫోర్త్ ఎస్టేట్ ప్రధాన స్రవంతి మీడియా (Mainstream Media) నేడు పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారి, నిస్సిగ్గుగా ఈ తిరుగుబాటును కించపరుస్తోంది. అర్నాబ్ గోస్వామి లాంటి ప్రముఖ జర్నలిస్టులు సైతం జర్నలిజం విలువలని గంగలో కలిపి, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమాన్ని ‘బాట్ అండ్ పెయిడ్ క్యాంపెయిన్” (డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఫాలోవర్లు) అని కొట్టిపారేయడం అత్యంత దారుణం. కానీ సత్యం ఎప్పుడూ దాగదు! సదరు CJP అకౌంట్ యొక్క అసలైన ఇన్‌స్టాగ్రామ్ అనలిటిక్స్ పరిశీలిస్తే, ఆ అకౌంట్‌ను ఫాలో అవుతున్న వారిలో 94.7% మంది స్వచ్ఛమైన భారతదేశ పౌరులే అని తేటతెల్లమైంది. అయినా సరే, అబద్ధాలనే పరమసత్యాలుగా ప్రచారం చేసే అర్నాబ్ లాంటి జర్నలిస్టుల అహంకారం ఇక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో దాదాపు 22 కోట్ల రీచ్, ఫాలోవర్లను సంపాదిస్తున్న CJP పిలుపు మేరకు నీట్ పేపర్ లీకేజీ ప్రొటెస్ట్‌కు కేవలం 2, 3 వేల మందే వచ్చారంటూ టీవీ స్టూడియోల్లో కూర్చుని వెటకారంగా హేళన చేశారు.
ఇక్కడ దేశ ప్రజలంతా గమనించాల్సిన ఒక ప్రాథమిక సత్యం ఉంది. న్యాయం కోసం, ధర్మం కోసం జరిగే పోరాటంలో నిలబడేది ఎంతమంది అన్నది ముఖ్యం కాదు; అక్కడ నిలబడింది న్యాయమా కాదా అన్నదే ముఖ్యం! ఒక మహోన్నత ఆశయం కోసం జరిగే నిరసనలోకి ఒక్కరు వచ్చినా అది ధర్మమే అవుతుంది కానీ, దానిని లెక్కలతో తక్కువ చేసి చూపడం ఏ రకమైన జర్నలిజం? ఈ రకమైన అబద్ధాల, వక్రీకరణల వార్తల వల్ల ఎవరికి లాభం చేకూరుతోంది? ఖచ్చితంగా విద్యార్థులకు కాదు, వారి భవిష్యత్తును అమ్మేసుకున్న లీకుల మాఫియాకు, వారిని వెనకేసుకొస్తున్న పాలకులకే ఈ మీడియా సంస్థలు లాభం చేకూరుస్తున్నాయి. సత్యం వైపు నిలబడాల్సిన కలం, కాసులకు దాసోహమై పాలకుల భజన చేయడం ప్రజాస్వామ్యానికే ఒక శాపం!
విషాదం ఇక్కడితో ఆగలేదు: పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ సిబిఎస్‌ఈ (CBSE) 12వ తరగతి మూల్యాంకనంలో జరిగిన అవకతవకలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ప్రవేశపెట్టిన ‘ఆన్-స్క్రీన్ మార్కింగ్’ (OSM) విధానం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. జవాబు పత్రాలు సరిగ్గా స్కాన్ కాకపోవడం, మసకబారిన కాపీలను అప్‌లోడ్ చేయడం, ఒకరి ఓఎంఆర్ షీట్లు మరొకరికి మార్చడం వంటి ఘోర తప్పిదాల వల్ల అర్హులైన విద్యార్థులకు అత్యంత తక్కువ మార్కులు వచ్చాయి. ఈ టెక్నాలజీ టెండర్ ప్రక్రియ వెనుక దాగున్న అవినీతిని జార్ఖండ్‌కు చెందిన ఒక 17 ఏళ్ల విద్యార్థి ఫోరెన్సిక్ విశ్లేషణతో బట్టబయలు చేయడం గమనార్హం. గతంలోనే పలు విద్యాసంస్థల పరీక్షల నిర్వహణలో విఫలమై, బ్లాక్‌లిస్ట్ అంచున ఉన్న ‘కోఎప్ట్ ఎడ్యుటెక్’ (Coempt EduTeck) అనే వివాదాస్పద ప్రైవేట్ సంస్థకు నిబంధనలు మార్చి మరీ వందల కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టడం వెనుక ఉన్న రహస్యమేమిటి?
కేంద్ర ప్రభుత్వం ఈ సత్యాలను అంగీకరించి తప్పులను సరిదిద్దాల్సింది పోయి, కేవలం డిజిటల్ డేటాను ప్రభు త్వ సర్వర్లకు మార్చడం, కంటితుడుపు జరిమానాలు విధించడం వంటి చర్యలతో చేతులు దులుపుకుంటోంది. గతంలో జరిగిన అనేక బోర్డు పేపర్ లీకులు, ప్రస్తుత నీట్, సిబిఎస్‌ఈ సంక్షోభాలు విద్యాశాఖ పతనానికి ప్రత్యేక్షసాక్ష్యాలు. ఒకవైపు లీకుల మాఫియా దేశా న్ని గుల్ల చేస్తుంటే, బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోగా, ప్రశ్నించిన యువతపై సోషల్ మీడియా నిషేధాలు విధించడం ఎంతవరకు న్యాయం? ఈ దేశాన్ని నిర్మించే మేధో సంపత్తిని ఇలా బజారున పడేస్తే రేపు దేశానికి వైద్యులు, శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి వస్తారు?
ఈ లీకుల మాఫియా, వ్యవస్థల వైఫల్యం దేశవ్యాప్తంగా తెచ్చిపెట్టిన మానసిక సంక్షోభం మాటలకు అందనంత భయానకమైనది. ఒక గదికే పరిమితమై, సుదూర స్వప్నాల్ని గుండెల్లో దాచుకుని, పగలు రాత్రి తేడా లేకుండా పుస్తకాలతో కుస్తీ పట్టి… నేడు నిలువునా కుప్పకూలిపోతున్నారు. పట్టుమని ఇరవై ఏళ్లు కూడా నిండని వయసులో, వ్యవస్థలు చేసిన పాపానికి తమను తాము దోషులుగా భావిస్తూ ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తున్నారు.
ఇది కేవలం పేపర్ లీక్ కాదు, ఈ దేశ భవిష్యత్తు లీక్. కార్పొరేట్ శక్తులకు, అవినీతి కాంట్రాక్టర్లకు విద్యావ్యవస్థను తాకట్టు పెట్టే ఈ దోపిడీ విధానాలు మారాలి. అబద్ధపు ప్రచారాలతో, ‘పొలిటికల్ స్టంట్లు’ అనే నెపాలతో, గోబెల్స్ తరహా మీడియా ప్రచారాలతో నిజాన్ని సమాధి చేయాలనుకుంటే నవతరం ఊరుకోదు.
ఇకనైనా పాలకపక్షం తన రాజకీయ కళ్లద్దాలను పక్కనపెట్టి, నిగూఢంగా ఉన్న ఈ వ్యవస్థాగత అవినీతిని అంగీకరించాలి. ఈ పెను తిరుగుబాటును ‘స్టంట్’ అని కొట్టిపారేసే అహంకారాన్ని వీడాలి. అదే సమయంలో, ఈ దేశంలోని ద్వంద్వ ప్రమాణాలను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఒక నిరుపేద విద్యార్థి ట్రాఫిక్ జామ్ వల్లో, బస్సు దొరకకో కేవలం ఒక్క నిమిషం ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వస్తే.. నిబంధనల పేరుతో లోపలికి రానివ్వకుండా గేట్లు మూసేసి, వారి కన్నీళ్లను కూడా చూడకుండా కఠినంగా వ్యవహరిస్తారు. ఆ ఒక్క నిమిషం ఆలస్యానికి ఆ విద్యార్థి చదివిన చదువు, పడిన కష్టం, ఒక అమూల్యమైన విద్యా సంవత్సరం నిలువునా బూడిదైపోతుంది. ఒక నిమిషం ఆలస్యాన్ని క్షమించని ఈ నిరంకుశ విద్యావ్యవస్థ.. మరి లక్షలాది మంది జీవితాలను బుగ్గిపాలు చేస్తూ ఇంతటి భారీ పేపర్ లీక్ కుంభకోణానికి పాల్పడితే ఎందుకు నోరు మెదపడం లేదు? ఇంత పెద్ద తప్పు జరిగినా, ఇంతమంది విద్యార్థులు రోడ్లెక్కినా, వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నా ఇంకా ఎందుకు ’సప్పుడు’ లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు?
దిడ్డి శ్రీకాంత్, జర్నలిస్ట్