Skip to content
తెలంగాణ వార్తలు

తుంగభద్రలో తెలంగాణ వాటాపై కేంద్రం జోక్యం చేసుకోవాలి..అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

Prajapaksham 25 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
తుంగభద్రలో తెలంగాణ వాటాపై కేంద్రం జోక్యం చేసుకోవాలి..అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

Telangana CM Urges Stronger Mechanism for Inter-State Water Distribution

తుంగభద్ర నది నుంచి తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన నికర జలాల వాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు, పొరుగున ఉన్న భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర డ్యాం ,నదీ ప్రవాహం ద్వారా తెలంగాణకు చట్టబద్ధంగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం ఐదారు టీఎంసీలకు మించి రావడం లేదని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం జలసౌధలో తుంగభద్ర ప్రాజెక్టు, రాజోలిబండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్), అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీఎస్ కింద జోగులాంబ గద్వాల జిల్లాలోని 75 గ్రామాలకు చెందిన 83,987 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉందన్నారు. ఈ ప్రాజెక్టులో మూడు రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉన్నందున కేంద్ర జలసంఘం (CWC) ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నీటి వాటాల సమర్థ వినియోగానికి తుంగభద్ర బోర్డును మరింత పటిష్ఠం చేయాలని కోరారు.

ప్రస్తుతం ఆర్డీఎస్‌ ఆనకట్ట అత్యంత ప్రమాదకరంగా మారిందని, భద్రత దృష్ట్యా అక్కడ చేపట్టాల్సిన అత్యవసర పనులను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్డీఎస్‌ డైవర్షన్‌ కెనాల్‌ ఆధునికీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 59 కోట్ల రూపాయలను డిపాజిట్‌ చేసినప్పటికీ, పనులు ఇంకా పూర్తి కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో ప్యాకేజీ 1, 2 పనులు ఇప్పటివరకు ప్రారంభం కాలేదని, ప్యాకేజీ 3, 4 పనులు మాత్రమే పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం, నిలిచిపోయిన మొదటి రెండు ప్యాకేజీల పనులను వెంటనే ప్రారంభించేలా కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగే సమావేశంలో గట్టిగా ప్రస్తావించాలని నిర్ణయించారు.

ఆర్డీఎస్‌ వద్ద తెలంగాణ భూభాగం వైపు భారీగా పూడిక నిండిపోవడం వల్ల ఆశించిన స్థాయిలో నీటి మళ్లింపు జరగడం లేదని ఇంజినీర్లు సీఎం దృష్టికి తెచ్చారు. 2004లోనే నిపుణుల కమిటీ పూడికతీతకు సూచనలు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయంతో పాటు పూడిక ఉన్న భూభాగం కర్ణాటకలో ఉన్నందున ఆ రాష్ట్ర సహకారం కూడా తీసుకోవాలని సమావేశంలో చర్చించారు.

ఈ నేపథ్యంలో 2004 నాటి నిపుణుల కమిటీ సూచనలను ప్రస్తుత వాస్తవ పరిస్థితులతో విశ్లేషించుకుంటూ కేంద్రానికి ఒక సమగ్ర వినతిపత్రం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే తుంగభద్ర ఎత్తిపోతల పథకం ద్వారా వీలైనంత ఎక్కువ నీటిని వాడుకునేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలించాలన్నారు. తుమ్మిళ్ల నుంచి నీటిని సమర్థంగా వాడుకునేందుకు వీలుగా కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్‌ రిザーవాయర్‌ సామర్థ్యాన్ని (కెపాసిటీ) పెంచాలని, ఆ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో నీటి నిర్వహణను మెరుగుపరిచేందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ,కేంద్ర ప్రభుత్వంతో అవసరమైన చర్చలకు ఏర్పాట్లు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

సమావేశంలో ఆర్డీఎస్‌ ఆనకట్ట కాలువ ప్రవేశ ద్వారం వద్ద పేరుకుపోయిన పూడికను తొలగించడం, సరైన గ్రేడియంట్లను పునరుద్ధరించడం ,నదీ ప్రవాహాన్ని స్థిరీకరించేందుకు రివెట్‌మెంట్‌ పనుల గురించి నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులపై విస్తృతంగా చర్చించారు. కాలువ హెడ్‌ వద్ద పేరుకుపోయిన పూడికను శాస్త్రీయంగా తొలగించేందుకు (డ్రెడ్జింగ్‌) తక్షణ చర్యలు చేపట్టడమే అత్యంత ఆచరణాత్మకమైన పరిష్కారమని ఇంజినీర్లు సూచించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ డ్రెడ్జింగ్, కాలువ హెడ్‌ అభివృద్ధి, ఆధునికీకరణ చర్యలు ,ప్రత్యామ్నాయ ఎత్తిపోతల పథకాలపై ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, నీటిపారుదలశాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం ఆర్డీఎస్‌ రైతులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి తమ సమస్యలపై లిఖితపూర్వక వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ, ఏపీ ,కర్ణాటక ముఖ్యమంత్రులతో స్వయంగా మాట్లాడి సమస్య పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *