ప్రజలకు ఓటు లేకుండా చేసేందుకు జరుగుతున్న కుట్రే సర్.. సిపిఐ అవగాహన సదస్సులో మండిపడిన ప్రజాస్వామ్యవాదులు..
CPI Holds Awareness Meeting on Special Intensive Revision
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ద్వారా ప్రజలకు లేకుండా చేసేందుకు జరుగుతున్న కుట్రను అడ్డుకొని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని పలువురు వక్తలు అన్నారు. ఓటు హక్కును రక్షించుకునేందుకు ‘సర్’ పట్ల వార్డు, గ్రామ స్థాయి నుంచి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్, బషీర్ బాగ్ దేశోద్దారక భవన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివ రావు అధ్యక్షతన సోమవారం ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సకు ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్, మాజీ ఎంఎల్ సి ప్రొఫెసర్ నాగేశ్వర్, మహేంద్ర యూనివర్సిటీ లా డీన్, కేంద్ర సమాచార కమిషన్ మాజీ సభ్యులు మాడభూషి శ్రీధర్ ముఖ్య వక్తలుగా హాజరవ్వగా ,సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్ల పల్లి శ్రీనివాస్ రావు, ఈ.టి.నరసింహ, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్.బోస్, ఎం.బాలనర్సింహ, కలవేణ శంకర్, సిపిఐ ఎంఎల్ సి నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.
‘శక్తివంతమైన ‘ఓటు’ ఆయుదాన్ని కాపాడుకుందాం : కూనంనేని సాంబశివరావు
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఎన్నికల వ్యవస్థను,ఓటరు హక్కులను కాపాడేందుకు సిపిఐ నిరంతరం కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే మేధావులు,చట్ట నిపుణులతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో వచ్చిన సూచనల ఆధారంగా రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను,ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని వెల్లడించారు. ఓటర్లను తొలగించడం ద్వారా ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ విధానాలపై కేవలం నాయకులకు మాత్రమే కాకుండా గ్రామ స్థాయిలోని సాధారణ ప్రజలకు, కార్యకర్తలకు పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు.
బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా వ్యవహరిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే విధంగా తప్పులు లేని జాబితా రూపొందేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, పౌరుల స్వేచ్ఛ కోసం సిపిఐ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. మేధావులు, చట్ట నిపుణులు అందించిన సూచనలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ప్రజల హక్కులకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనైనా తాము తీవ్రంగా నిరసిస్తామన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) దేశ భవితవ్యాన్ని నిర్ణయించే ప్రక్రియ అని అన్నారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ సక్రమంగా జరగకపోతే సామాన్య ప్రజల, అర్హులైన పౌరుల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
చాలా మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తారని, ఓటు వేసేందుకు తమ ప్రాంతాలకు తిరిగి వస్తారని, అలాంటి వారికి సొంత ఊరు వెళ్లి ఓటు నమోదు చేసుకునేందుకు దారి ఖర్చులు ఎవరిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం సాఫ్ట్ ఉద్యోగులు, వలసకూలీలు ఇలా చాలా మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారి పరిస్థితిపైన స్పష్టత లేదన్నారు. ఎక్కువ శాతం ఓట్లు పోయేవి పేదలవే అని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ 60 శాతం దాటడం లేదని,చదువుకొని వారే ఓట్లు వేస్తారని, చదువుకున్న వారు మాత్రం ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదని కూనంనేని సాంబశివరావు అన్నారు.
దేశ రాజకీయ పరిస్థితులు మార్చేందుకే ‘సర్’ : పరకాల ప్రభాకర్
దేశ రాజకీయ పరిస్థితులు మార్చేందుకే ‘సర్’ను ప్రవేశపెట్టారని పరకాల ప్రభాకర్ విమర్శించారు. బీహార్ 63 లక్షల ఓట్లను తొలగించారని, పూర్తి స్థాయిలో లేక్కలు తీసుకుంటే ఆ సంఖ్య 80 లక్షలు చేరుతుందని, పశ్చిమ బెంగాల్ 90 లక్షలు, తమిళనాడులో 97 లక్షలు, కేరళలలో 27 లక్షల ఓటర్లను తొలగించారని, ఉత్తరప్రదేశ్ కూడా 2.83 కోట్ల ఓట్లర్లను తొలగిస్తే ఎవ్వరూ మాట్లాడటం లేదన్నారు. ‘సర్’ ప్రక్రియ పూర్తయిన తరువాత ఒకే ఇంటిపైన 8 వందల ఓట్లు ఉన్నాయని, అందులో అన్ని మతాలు, అన్ని కులాల వారికి చెందిన ఓట్లు ఉండట ఆశ్చర్యమని, ఆ ఇంటిని పరిశీలించేందుకు కొంతమంది ప్రయత్నిస్తే, అక్కడ అసలు ఆ ఇళ్లే లేదని వివరించారు. ‘సర్’ నిర్వహించిన తర్వాత కూడా ఇలాంటి అనేక సంఘటనలు చూశామన్నారు.
ఉద్దేశపూర్వకంగానే ఓట్ల తొలగిస్తున్నారని మండిపడ్డారు.తొలగించిన ఓటర్లలో ముస్లీం, క్రిస్టియన్ మైనార్టీలతో పాటు ఆదివాసీ, దళితులు, పేద, సామాన్య ఓటర్లే అత్యధిక శాతం ఉన్నారని ప్రభాకర్ తెలిపారు. ఎన్నికలు జరగని రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా సర్ నిర్వహించి, ఓటర్లను తొలగించారని, ఈ విషయం రాజకీయ పార్టీలకు అవసరం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సర్’ ప్రక్రియ పూర్తయిన తర్యాత దేశంలో ఓటు ఉన్నావారు,ఓటు లేని వారు అని రెండు రకాల వారు ఉంటారన్నారు. ఇదే జరిగితే ఓటు లేని వారి వద్దకు ఎవ్వరూ వెళ్లారని అన్నారు.
తద్వారా ఓట్లు లేనివారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ పథకాలతో పాటు కనీస సౌకర్యాలు కూడా అందని పరిస్థితులు నెలకొంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని ఇజ్రాయిల్ తరహాలో మారుస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల జాబితా సవరణ జరపాలాంటే రాజ్యాంగం ప్రకారం గ్రామా,వార్డు సభ ఏర్పాటు చేసి, సభలో బహిరంగంగా ఓటరు సవరణ ప్రక్రియ చేపట్టాలన్నారు. చీకటి గదుల్లో కూర్చొని ఓట్లను తొలగిస్తే కుదరదన్నారు. దేశంలో అర్హులైన ప్రతి ఓక్కరికి ఓటు హక్కు ఉండాలన్నారు. సాధారణంగా ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకుంటారని, కానీ ప్రభుత్వమే ఓటర్లను ఎన్నుకుంటుందని విమర్శించారు. ఇతర మతాల వారు దేశంలో ఉండటం ఇష్టం లేదని, వారిని చంపలేరని, కానీ ‘సర్’ ద్వారా పౌరసత్వాన్ని చంపుతున్నారని దుయ్యబట్టారు. తొలగించిన ఓటర్లతో ఓటర్ల సంఘాన్ని ఏర్పాటు చేసి, ఓటు హక్కు పునరుద్దరణకు పోరాటం చేయాలని పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు.
ఇజ్రాయిల్ తరహా వ్యవహరిస్తున్నారు: ప్రొఫెసర్ నాగేశ్వర్
ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ తరహా నాన్ జూయిస్ బతక కూడదనే దోరణిని భారతదేశంలో కూడా తీసుకొస్తున్నారని విమర్శించారు. గాజాలో 70 లక్షలమందిని చంపేశారన్నారు. సౌత్ ఆఫ్రికాలో 70-80 శాతం భూములు తెల్లవారి అధినంలో ఉంటాయని, దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రంగంలో దిగారని, అదే తరహాలో భారతదేశంలో కూడా ఆస్మదీయులైన ఓటర్లను తయారు చేసుకున్నారని విమర్శించారు.ఎన్నికల్లో పోటీ చేయాలంటే రిటర్నింగ్ అధికారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని, ఇందుకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ సంఘటననే ఉదాహరణగా గుర్తు చేశారు.తమిళనాడులో ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన విజయ్ ప్రమాణస్వీకారానికి గవర్నర్ అనేక అడ్డంకులను సృష్టించారన్నారు. ప్రశ్నిస్తే బొద్డింకలు అని అంటారన్నారు.
చట్టాలపై పౌరులకు సంపూర్ణ అవగాహన అవసరం: మాడభూషి శ్రీధర్
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ నాన్ ఆప్లికేబుల్ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారన్నారు. నాన్ ఆప్లికేబుల్ అని అంటే ఇక పోటీ చేయడానికి అవకాశం ఉండబోదని, ఓటరు జాబితాలో కూడా ఇదే మాదిరిగా ఓట్లను తొలగింపు ప్రక్రియ చేస్తున్నారన్నారు. ఓట్లు లేని వాళ్లు ఎక్కడికి పోవాలని ఆయన ప్రశ్నించారు. ఆధార్ ఉన్నంత మాత్రాన సిటీజన్ కాదని, పాస్ కూడా ఉండాలని, పాస్ పోర్ట్ ఉంటే కూడా కాదని, ఓటు హక్కు ఉండాలని, ఇవన్ని లేకుంటే పౌరసత్వం రాని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఓటు పవర్ మారిందని, ఓటు ఎటు జారీ పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.