Skip to content
వార్తలు వార్తలు

జగన్‌తో భేటీ అయిన డీఎస్సీ 2025 బాధితులు.. అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని మాజీ సీఎం డిమాండ్..

Prajapaksham 04 Jun 2026 1 నిమిషాల పఠనం వార్తలు
జగన్‌తో భేటీ అయిన డీఎస్సీ 2025 బాధితులు.. అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని మాజీ సీఎం డిమాండ్..

This Is an Attack on Democratic Values and Freedom of Expression: YS Jagan

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డీఎస్సీ 2025 పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీ 2025లో పెద్ద ఎత్తున అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ.. దీనిపై తక్షణమే సీబీఐ (CBI) విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన డీఎస్సీ 2025 బాధితులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ను కలిసి తమ ఆవేదనను పంచుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థుల సమస్యలను సావధానంగా విన్న జగన్, వారికి పార్టీ తరఫున పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఉదంతంపై వైఎస్ జగన్ వ్యక్తంచేసిన ముఖ్యమైన అంశాలు క్రింది విధంగా ఉన్నాయి:

ఒక పోస్టుకు ఒక్కరు (1:1) చొప్పున అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచి, అన్ని అర్హతలూ సరిగ్గా ఉన్నప్పటికీ చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అత్యంత హేయమైన చర్య అని జగన్ ఆక్షేపించారు. క్వాలిఫై అయ్యి, కాల్ లెటర్స్ వచ్చిన మెరిట్ అభ్యర్థులను కాదని, వారి కింద ఉన్న వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు. ఒక జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వెరిఫికేషన్‌కు రాలేదనే నెపంతో ఉద్యోగం నిరాకరించారని, సదరు అభ్యర్థి ఇప్పుడు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఒక ఉదాహరణను ప్రస్తావించారు.

కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా పేరుతో ఇష్టానుసారంగా జీవోలు జారీ చేసి ఉద్యోగాలను అమ్ముకుందని జగన్ ఆరోపించారు. మొదట ఒక జీవో జారీ చేసి, ఎలాంటి పరీక్షలు లేకుండా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు భర్తీ చేశారని.. టెట్ (TET) క్వాలిఫై అవ్వని వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్న వెంటనే.. గేట్లు మూసేస్తూ ‘స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా పరీక్ష రాయాలి, ఇతర అర్హతలు ఉండాలి’ అంటూ నిబంధనలను మార్చి మరో జీవో ఇవ్వడం అభ్యర్థులను దగా చేయడమేనని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో 2019లో కేవలం ఆరు నెలల కాలంలోనే ఎక్కడా ఎలాంటి వివాదాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా 1.30 లక్షల గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేశామని జగన్ గుర్తుచేశారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కేవలం 16 వేల ఉద్యోగాల భర్తీకే ఇన్ని అక్రమాలకు, అవకతవకలకు తెరలేపడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేసినా అభ్యర్థులకు స్పష్టమైన సమాధానాలు దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధిత అభ్యర్థుల తరఫున ఉచితంగా న్యాయపోరాటం చేయడానికి పార్టీ తరఫున ఒక ప్రత్యేక ‘లీగల్ ప్యానెల్’ ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. పార్టీకి చెందిన ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు, విద్యార్థి విభాగం, లీగల్ టీమ్ కలిసి కోర్టులో పిటిషన్లు వేసి అభ్యర్థుల తరఫున పోరాడుతుందని హామీ ఇచ్చారు.

“దేవుడి దయతో మూడేళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే ఈ డీఎస్సీ 2025 అక్రమాలపై ఒక ప్రత్యేక కమిషన్ వేసి పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం. గతంలో 1998, 2008 డీఎస్సీ బాధితులకు న్యాయం చేసినట్లే, ఈ డీఎస్సీలో అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం. న్యాయం జరగడం కొంత ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది” అని వైఎస్ జగన్ అభ్యర్థులకు ధైర్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *